ఉత్తమ అవార్డుకు జిల్లా జైలు ఎంపిక !

కంది, జనవరి 22 : సంగారెడ్డి జిల్లా పరిధిలోని కంది జైలు జిల్లా విభాగంలో ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. ఈ విభాగంలో కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జైలుకు రెండోస్థానం లభించింది. అయితే జిల్లా, సెంట్రల్, సబ్ జైళ్ల విభాగాల్లో రెండింటికీ ఎంపిక చేసి అందులో ఒకదానికి ఉత్తమ అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు తమిళనాడులోని ఏపీసీఏ (అకాడమి ఆఫ్ ప్రిసన్ అండ్ అడ్మినిస్ట్రేషన్)కు చెందిన వారే ఈ అవార్డు ఎంపిక చేస్తారు. ఈ ఏపీసీఏలోనే దేశంలో జైలు శాఖలో పనిచేసే వారికి ట్రైనింగ్ ఉంటుంది. ప్రస్తుతం ఇది దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నది. సంగారెడ్డి జిల్లాలోని కంది జైలుకు అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు ఆ శాఖ అధికారులు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకుంటే ఇక్కడే నిర్మించిన జైలు ఇప్పటికే దేశంలో అన్ని విషయాల్లో మంచి పేరు సంపాదించుకున్నది.
అవార్డులో ఎంపిక చేసే అంశాలు..
భారతదేశంలోని అన్ని సెంట్రల్, సబ్ జైలు, జిల్లా జైళ్లలో ఉన్న పనితీరును ముందుగా ఈ శాఖకు చెందిన ముఖ్య అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. ఇందులో ప్రధానంగా ఖైదీలో తీసుకొచ్చే పరివర్తన కోసం జైలు శాఖ ఏ విధంగా పనిచేస్తుందనే అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. వీటితో పాటు జైలు అధికారులు చేస్తున్న కృషి, ఉద్యోగ పనితీరు కూడా పరిగణలోకి వస్తాయి. ఉత్తమ అవార్డులో భాగంగా విశేష కృషి చేసినందుకు ఆ జైలు శాఖ అధికారులకు మెమోంటోతో పాటు క్యాష్ రివార్డు కూడా అందజేస్తారు.
మూడు విభాగాల్లో రెండేసి జైళ్ల ఎంపిక..
సెంట్రల్ జైలు విభాగంలో చర్లపల్లితో పాటు వైజాగ్ జైలు, జిల్లా జైలు విభాగంలో సంగారెడ్డి జిల్లాలోని కంది జైలుతో పాటు కేరళ రాష్ర్టానికి చెందిన ఎర్నాకులం జైళ్లు ఎంపికయ్యాయి. అయితే సబ్ జైలు విభాగంలో ఆంధ్రప్రదేశ్లోని చెందిన వినుకొండ సబ్ జైలు, తమిళనాడులోని సైదాపేట సబ్జైలు 2019-20 సంవత్సరానికి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యాయి.
అవార్డు వస్తదనే నమ్మకం బలంగా ఉంది..
ఏపీసీఏఈ ప్రతి యేటా పలు విభాగాల్లోని జైళ్లకు ఇచ్చే ఉత్తమ అవార్డుకు మా జిల్లా జైలు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. కంది జైలుతో పాటు కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లా జైలు కూడా ఎంపికలో ఉంది. రిలీజ్ ఖైదీలను మా జైలు శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెట్రోల్ బంక్లలో ఉపాధి, ఇతర ఉపాధి అవకాశాలు కల్పించాం. జైలులోని స్టీలు ఇండస్ట్రీతో మంచి ఆదాయం జైలు శాఖకు ప్రతి యేటా వస్తుంది. దీంతో పాటు దాదాపు 30 ఎకరాల్లో నర్సరీ, ఇతర చెట్ల పెంపకం ద్వారా మా జైలుకు మంచి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే మా జైలుకు అవార్డు వస్తుందనే గట్టి నమ్మకం అయితే ఉంది.
- నవాబ్ శివకుమార్ గౌడ్, జిల్లా జైలు సూపరింటెండెంట్