బుధవారం 03 మార్చి 2021
Sangareddy - Jan 22, 2021 , 01:26:13

అవకాశాలనుఅందిపుచ్చుకోవాలి

అవకాశాలనుఅందిపుచ్చుకోవాలి

పటాన్‌చెరు, జనవరి 21 : మహిళా సంఘాలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని మినిస్ట్రీ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ నేషనల్‌ మిషన్‌ మేనేజర్‌(ఎన్‌ఎంఎంయూ) రాజీవ్‌ సింఘాల్‌ అన్నారు. గురువారం పటాన్‌చెరు పట్టణంలో జిల్లా రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, వారి పనితీరును తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన రాజీవ్‌ సింఘాల్‌ బృందం డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. కంప్యూటర్‌తో బ్లౌజ్‌లపై డిజైన్‌లు వేయడం చూసి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. పచ్చళ్లు, హ్యాండ్‌మేడ్‌ సబ్బులను పరిశీలించి వాటి వివరాలను, క్వాలిటీని తెలుసుకున్నారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణంపై, వారు చేస్తున్న వ్యాపారం వివరాలను అడిగి రికార్డు చేసుకున్నారు. మంజీరా బ్రాండ్‌తో జిల్లా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తున్నామని జిల్లా అధికారులు వారికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజీవ్‌ సింఘాల్‌ మాట్లాడారు. దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం సుక్ష్మరుణాలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నదన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సాయం మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు తమ బృందం వచ్చిందన్నారు. సంగారెడ్డి జిల్లా మహిళల ఉత్పత్తులు బాగున్నాయన్నారు. ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, వాటిని ప్యాకింగ్‌ చేసి అమ్ముకోవడంలోను తాము సాయం చేస్తామన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మహిళలు తయారు చేసిన 800 రకాల ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో అమ్మకం అవుతున్నాయని తెలిపారు. జిల్లా ఉత్పత్తులు కూడా ఆన్‌లైన్‌లో లభ్యమయ్యేలా కార్యాచరణ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కూడా అవసరమైన చోట మహిళల ఉత్పత్తులు కొంటున్నదన్నారు.  కొవిడ్‌ సమయంలోనూ చేతిపనులే చాలా కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకున్నాయన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామీణ భారతదేశం బలపడాలని తాము పనిచేస్తున్నామన్నారు. 

మంజీర బ్రాండ్‌తో ముందుకు : శ్రీనివాసరావు, డీఆర్డీవో

జిల్లా మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మంజీర బ్రాండ్‌తో ముందుకు తీసుకెళ్తున్నామని డీఆర్‌డీవో శ్రీనివాస్‌రావు అన్నారు. జిల్లాలో డ్వాక్రా మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. రుణాలు తీసుకోవడంతో తిరిగి రుణాలను తీర్చడంలో ముందున్నారని కొనియాడారు. రుణాలు తీసుకొని మహిళలు తయారు చేసిన పలు ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ వచ్చిందన్నారు. ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌లతో ఇతర సంస్థలతో మహిళలకు ఉచిత శిక్షణను ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటికే రూ. 375కోట్ల రుణాన్ని 17వేల స్వయం సహాయక గ్రూపులకు అందజేశామన్నారు. జిల్లాలో 1.80 లక్షల మంది మహిళలు సంఘాల్లో చురుకుగా ఉన్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో వడ్డీలేని రుణాలను ఇస్తున్నామన్నారు. నారాయణ్‌ఖేడ్‌లో రూరల్‌ స్టార్టప్‌ద్వారా వ్యాపార వెత్తలుగా మహిళలు ఎదిగేందుకు రూ. 5.45కోట్లతో ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మహిళలు తమ ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్‌ చేస్తున్నారో వివరించారు. కార్యక్రమంలో ఎస్‌పీఎం-ఎన్‌ఎఫ్‌, ఎస్‌ఎంఎంయూ శ్రావణ్‌కుమార్‌, అడిషనల్‌ డీఆర్‌డీవో సుర్యారావు, డీపీఎం-ఎన్‌ఎఫ్‌ జయశ్రీ, డీపీఎం ఫైనాన్స్‌ కొమరయ్య, ఏపీఎంలు శ్రీనివాస్‌రావు, శివకుమార్‌, నర్సింలు, విశ్వేశ్వర్‌, అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo