సోమవారం 08 మార్చి 2021
Sangareddy - Jan 20, 2021 , 00:11:02

హరిత మొక్కలకు సేంద్రియ ఎరువు

హరిత మొక్కలకు సేంద్రియ ఎరువు

పల్లెల్లో వేరువేరుగా తడి, పొడి చెత్త సేకరణ

తడి చెత్తతో డంపింగ్‌ యార్డుల్లో సేంద్రియ ఎరువు తయారీ..!

సంగారెడ్డి జిల్లాలో 100 శాతం పూర్తైన యార్డుల నిర్మాణం

జనవరి 31వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో తయారు చేసేందుకు చర్యలు

భవిష్యత్తులో సుమారు 250-300 టన్నులు ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు

చెత్త నుంచి శాశ్వత విముక్తి కల్పించే దిశగా అడుగులు

తగ్గనున్న వాయుకాలుష్యం  

పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్‌ హనుమంతరావు 

గ్రామాల్లో సేకరించిన చెత్త.. హరితహారం మొక్కలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడనున్నది. ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను స్థానిక డంపింగ్‌ యార్డుకు తరలించి అక్కడ తడి, పొడిగా వేరుచేసి ఎరువును తయారు చేయనున్నారు. ఇందుకోసం గతంలోనే పంచాయతీ సిబ్బందికి అవగాహన కల్పించారు. సంగారెడ్డి జిల్లాలోని 647 గ్రామాల్లో ఇప్పటికే 100శాతం డంపింగ్‌ యార్డులను ప్రభుత్వం నిర్మించగా, ఈ నెల 31 వరకు అన్ని చోట్లా ఈ ప్రక్రియను అమలు చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు పంచాయతీ అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. భవిష్యత్తులో జిల్లాలో సుమారు 250-300 టన్నుల ఎరువు ఉత్పత్తి చేసే అవకాశం ఉండడంతో హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు ఈ ఎరువును వినియోగించనున్నారు. దీంతో మొక్కలు కూడా ఏపుగా పెరిగే అవకాశమున్నది. మరోవైపు ఈ విధానంతో చెత్తను తగులబెట్టడం, దుర్గంధం వెదజల్లడంలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నది.

- సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 19 (నమస్తే తెలంగాణ)  

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రోజురోజుకూ జఠిలంగా మారుతున్న చెత్తకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సంగారెడ్డి జిల్లాలోని పల్లెలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. జిల్లాలోని 647 గ్రామాల్లో 100 శాతం డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఇక నుంచి ప్రతి గ్రామంలో తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చేందుకు సిద్ధమైంది. ఇప్పటి పలు గ్రామా ల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, జనవరి 31వ తేదీ నాటికి జిల్లాలోని 647 గ్రామాల్లో చెత్త నుంచి సేంద్రియ ఎరువుగా మార్చే ప్రక్రియ 100శాతం అమలు చేయాలని  కలెక్టర్‌ హనుమంతరావు పంచాయతీ అధికారులకు ఆదేశాల జారీ చేశారు. ఈ క్రమంలోనే జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌ మోహన్‌ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు చెత్త నుంచి సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేసే అంశంపై ప్రత్యేకంగా సర్క్యులర్‌ జారీ చేశారు. 

సేకరణ సమయంలోనే..

జిల్లాలోని 647 గ్రామాల్లో (ఒక్కో గ్రామం లో రూ.5 నుంచి 8లక్షల వరకు వెచ్చించి) 100 శాతం డంపింగ్‌ యార్డులను నిర్మించడంతో పాటు ఇంటింటికీ తడి, పొడి చెత్తను వేరు వేసేందుకుగాను గ్రామ ప్రజలకు డస్ట్‌బిన్‌లను అందించి ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించనున్నారు. ఇందులో తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మారుస్తుండగా, పొడి చెత్తను (ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ కొరకు) క్వింటాళ్ల లెక్క విక్రయించి పంచాయతీకి నిధులు సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో ప్రధానంగా గ్రామంలో సేకరించిన చెత్తను ‘చెత్త సేకరణ కేంద్రం’ (డంపింగ్‌ యార్డు)కు తరలించి, అక్కడ తడి, పొడి చెత్తను, ప్లాస్టిక్‌ వ్యర్థాలను పూర్తిస్థాయిలో వేరు చేస్తారు. ఇలా ఏ రోజుకు ఆ రోజు తరలించిన చెత్తను రీసైక్లింగ్‌ చేసి తడి చెత్తను సేంద్రియ ఎరువుగా, విద్యుత్‌ ఉత్పత్తికి, పొడి చెత్తను సిమెంట్‌ పరిశ్రమలకు, ప్లాస్టిక్‌ ఉత్పత్తుల పరిశ్రమలకు విక్రయించనున్నారు. చెత్త ద్వారా సమకూరిన నిధులను గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసి చెత్త సేకరణలో, తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు నియమించిన సిబ్బందికి వేతనాలను ఇవ్వడంతో పాటు గ్రామాభివృద్ధి  పనుల కోసం  వెచ్చించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. 

ప్రతి మొక్క దక్కేలా..

ప్రభుత్వం అన్ని గ్రామాలు, పట్టణాల్లో తెలంగాణకు హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలను నాటుతున్నది. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలనే సంకల్పంతో గ్రామంలో సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చి హరితహారంలో నాటిన మొక్కలకు వేయాలని అధికారులు నిర్ణయించారు. స్వచ్ఛమైన సేంద్రియ ఎరువులను మొక్కలకు సరఫరా చేయడంతో పాటు క్రమం తప్పకుండా పంచాయతీ సిబ్బంది ద్వారా నీరు సరఫరా చేయడంతో  మరింత ఏపుగా పెరుగుతాయని పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్క దక్కే అవకాశం ఉండటంతో ప్రతి గ్రామంలోనూ చెత్త నుంచి సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేయాలని సూచించారు.  

తగ్గనున్న వాయు కాలుష్యం..

కొద్ది రోజుల కిందటి వరకు గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది సేకరించిన చెత్తను గ్రామ శివారులో ఏర్పాటు చేసిన గ్రామ డంపింగ్‌ యార్డులో వేసేవారు. అయితే ఇది పూర్తిగా నిండగానే ఆ చెత్తకు నిప్పు పెట్టి తగులబెట్టేవారు. దీంతో ప్రతిరోజు చెత్త నుంచి వెలువడే దుర్గంధంతో పాటు పొగ కారణంగా తీవ్రంగా వాయుకాలుష్యం ఏర్పడటంతో ప్రజలు సతమతం అయ్యేవారు. ఇక నుంచి సంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుండవని, గ్రామాల్లో వాయుకాలుష్యం పూర్తిగా తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గాలిదుమారం వచ్చినప్పుడు డంపింగ్‌ యార్డుల్లోని చెత్త వచ్చి కాలనీ రోడ్లపై ఇండ్ల ముంగిట పడుతుండటంతో పారిశుధ్య సమస్యలు నిత్యాకృత్యం అయ్యోయి. గ్రామంలో చెత్తను ఏ రోజుకారోజు తరలిస్తుండటంతో అసలు గ్రామంలో చెత్త సమస్యే ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. 

చెత్త నుంచి శాశ్వత విముక్తి

ప్రభుత్వ ఆదేశాలు, కలెక్టర్‌ హనుమంతరావు సూచనల మేరకు గ్రామాల్లోని చెత్తకు శాశ్వత విముక్తి లభించేలా ప్రణాళికలను సిద్ధం చేశాం. ఈ క్రమంలోనే గ్రామాల్లో ప్రత్యేకంగా డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేయడంతో పాటు చెత్త సేకరణ సమయంలోనే తడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువు ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సేంద్రియ ఎరువు తయారీపై గతంలోనే పంచాయతీ సిబ్బందికి అవగాన కల్పించాం. సమీప భవిష్యత్‌లోనే సంగారెడ్డి జిల్లాలో చెత్త నుంచి సుమారు 250-300 టన్నుల సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతున్నది. ఈ ఎరువును జిల్లాలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. 

సురేశ్‌ మోహన్‌, సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి 

VIDEOS

logo