మన మెడలో ఎన్ని బంగారు నగలున్నా.. వాటిలో వజ్రం ఒక్కటుంటే చాలు.. లుక్కే వేరవుతుంది. చేతి వేలికి ఒక్క వజ్రపుటుంగరం ఉన్నదంటే మన విలువే మారిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో వేల రూపాయలు మొదలుకొని కోట్ల విలువ చేసే వజ్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల బోట్స్వానాలో జరిపిన తవ్వకాల్లో ప్రపంచంలోనే మూడో అతిపెద్దదిగా భావిస్తున్న వజ్రం బయటపడింది. 1098 క్యారెట్ల బరువున్న ఈ వజ్రాన్ని.. వజ్రాల సంస్థ డెబ్స్వానా.. బోట్స్వానా అధ్యక్షుడు మోగ్వీట్సీ మాసిసికి అది దొరికిన రెండు వారాల తర్వాత బుధవారం చూపించింది. 50 సంవత్సరాల తమ కార్యకలాపాల చరిత్రలో డెబ్స్వానా కనుగొన్న అతి పెద్ద వజ్రం ఇదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లినెట్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్తున్నారు.
ఈ వజ్రం దాదాపు 73 మి.మీ పొడవు, 52 మి.మీ వెడల్పు , 27 మి.మీ మందంతో ఉన్నది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వజ్రం ‘లెస్డి లా రోనా’ కన్నా కొంచెం తక్కువ బరువు కలిగి ఉన్నది. రెండో అతిపెద్ద వజ్రాన్ని కూడా 2015 లో బోట్స్వానాలోనే కనుగొన్నారు. ఇప్పటివరకు వెలికితీసిన అతిపెద్ద వజ్రం 1905 లో దక్షిణాఫ్రికాలో స్వాధీనం చేసుకున్న 3106 క్యారెట్ల బరువున్న కుల్లినన్ రాయిగా చెప్తుంటారు.
ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా దీనిని ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రంగా భావిస్తున్నారు. దీనిని డీ బీర్స్ ఛానల్ ద్వారా లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని ఒకావాంగో డైమండ్ కంపెనీ ద్వారా విక్రయించాలనే దానిపై డెబ్స్వానా సంస్థ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ వజ్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. వజ్రం యొక్క ఖరీదును ఇంకా అంచనా వేయలేదు.
డెబ్స్వానా అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో 80 శాతం డివిడెండ్, రాయల్టీ, పన్నుల ద్వారా బోట్స్వానా ప్రభుత్వం పొందుతుంది. కరోనా వైరస్ మహమ్మారి 2020 లో వజ్రాల ఉత్పత్తి, డిమాండ్ రెండింటినీ ప్రభావితం చేసింది. డెబ్స్వానాలో ఉత్పత్తి 29 శాతం తగ్గి 16.6 మిలియన్ క్యారెట్లకు, అమ్మకాలు 30 శాతం పడిపోయి 2.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. నష్టాల నుంచి బయటపడేందుకు ఈ ఏడాది డెబ్స్వానా సంస్థ 23 మిలియన్ క్యారెట్ల ప్రీ-పాండమిక్ స్థాయికి ఉత్పత్తిని 38 శాతానికి పెంచాలని యోచిస్తున్నది.
కరోనా పుట్టినిల్లు.. వుహాన్‌లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ?
యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాకరణ
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..
చరిత్రలో ఈరోజు.. ముంతాజ్ జ్ఞప్తిగా తాజ్‌మహల్ నిర్మాణం
కొత్తిమీర-పుదీనా పచ్చడితో 7 ఆరోగ్య ప్రయోజనాలు.. ఏవంటే..?
డబ్ల్యూటీసీ ఫైనల్ : ఒక్క మ్యాచ్‌తో విజేతను నిర్ణయించడం సరికాదు : సచిన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..