ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sangareddy - Jan 14, 2021 , 00:03:23

ఒక్కో కేంద్రంలో 40 మందికి టీకాలు

ఒక్కో కేంద్రంలో 40 మందికి టీకాలు

మెదక్‌లో రెండు, సంగారెడ్డిలో ఆరు కేంద్రాల్లో ఏర్పాట్లు

16వ తేదీ నుంచి 22 వరకు టీకా పంపిణీ

కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌  ఏర్పాట్లు పూర్తి 

మొదటగా 1,567 మంది 

వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బందికి వాక్సిన్‌...

అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం : 

సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు

కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టే వ్యాక్సిన్‌ వచ్చేసింది. తొలుత వైద్య సిబ్బందికి తరువాత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన శానిటేషన్‌ సిబ్బంది, పోలీసులు, ఆర్మీ తదితర విభాగాల అధికారులకు, అనంతరం సాధారణ ప్రజలకు టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 13,365 మందిని గుర్తించగా, మొదటి విడుతగా 16వ తేదీ నుంచి 22 వరకు  1,567 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రెండు జిల్లాల్లో ఎనిమిది దవాఖానలను ఎంపిక చేశారు. ఇప్పటికే వైద్యసిబ్బంది వివరాలను సేకరించిన వైద్య ఆరోగ్య శాఖ వారికి సమాచారం సైతం అందించింది. కాగా, మొత్తం మెదక్‌ జిల్లాలో 4,030 మందికి, సంగారెడ్డి జిల్లాలో 9,335 మందికి టీకా వేయనున్నారు. వ్యాక్సినేషన్‌కు పూర్తి సిద్ధంగా ఉన్నామని, ఒక్కో కేంద్రంలో 40 మందికి టీకాలు వేస్తామని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు. 

- సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 12 (నమస్తే తెలంగాణ)

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌కు వేలైంది. ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ల సూచనల మేరకు ఈ నెల 16న వైద్య, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చేందుకు మెదక్‌, సంగారెడ్డి జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లాలో దిగ్వాల్‌ పీహెచ్‌సీ, పఠాన్‌చెరువు, జహీరాబాద్‌ ఏరియా దవాఖానలలో, సంగారెడ్డి ఎమ్మెన్నార్‌ మెడికల్‌ కాలేజ్‌లో, బాలాజీ మెడికవర్‌ దవాఖానలో, ఇంద్రానగర్‌ పీహెచ్‌సీల్లో కరోనా వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే, మెదక్‌ జిల్లాలో మెదక్‌ జిల్లా దవాఖానలో, నర్సాపూర్‌ ప్రాంతీయ దవాఖానలో ఏర్పాట్లు చేశారు. మొదటగా సంగారెడ్డి జిల్లాలో సుమారు ఐదు రోజుల పాటు 1,081 మంది వైద్య సిబ్బందికి, మెదక్‌లో 486 మందికి టీకాను ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్‌ అందజేసేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు. ఒక్కో కేంద్రంలో 40 మందికి టీకాలు వేస్తామని, తొలుత వైద్య సిబ్బందికి తరువాత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా వేయడం, దశల వారీగా ప్రజలందరికీ టీకాను అందించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు...

తొలివిడుతలో వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు రెండో విడుతలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన శానిటేషన్‌ సిబ్బందికి, పోలీసులకు, ఆర్మీ, తదితర విభాగాల అధికారులకు, 50 ఏండ్లు నిండిన వ్యక్తులకు కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. అనంతరం మూడో విడుతలో సాధారణ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు.

ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు...

తొలుత వైద్య సిబ్బందికి, తర్వాత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే వారి వివరాలను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సేకరించారు. మొత్తం 13,365 మందికి వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మెదక్‌ జిల్లాలో 4,030 (మెదక్‌ జిల్లాలోని 24 ప్రభుత్వ దవాఖానల్లో 3,264 మందికి, 76 ప్రైవేటు దవాఖానల్లో 766) మందికి, అలాగే సంగారెడ్డి జిల్లాలో మొత్తం 9,335 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. వీరిలో 49 ప్రభుత్వ దవాఖానల్లో 5,302 మంది, 206 ప్రైవేటు దవాఖానల్లో 4,000 మంది వైద్య సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో జిల్లా వైద్యాధికారులతో పాటు డిప్యూటీ వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, సూపర్‌వైజర్లు, స్టాఫ్‌నర్సులకు, నర్సులకు, ఆశవర్కర్లు ఉన్నారని, వీళ్లందరికీ ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, జిల్లాలో ఉన్న 13,365 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు ప్రత్యేకంగా అధికారులు టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, బుధవారం సాయంత్రం నగరం నుంచి ప్రత్యేక వాహనాలలో వ్యాక్సిన్‌ను జిల్లా కేంద్రాలను తరలించారు. వీటిని రెండు జిల్లాల్లో 58 స్టోరేజీ పాయింట్లలో నిల్వ చేయనున్నారు.

VIDEOS

logo