శుక్రవారం 05 మార్చి 2021
Sangareddy - Jan 13, 2021 , 00:23:27

బర్డ్‌ ఫ్లూ.. డోంట్‌వర్రీ !

బర్డ్‌ ఫ్లూ.. డోంట్‌వర్రీ !

సంగారెడ్డి జిల్లాలో బర్డ్‌ ఫ్లూ భయం లేదు

ప్రజలు తీసుకునే ఆహారంతో వ్యాధి రాదు

మునిపల్లిలో కోళ్ల మృత్యువాతకుబర్డ్‌ ఫ్లూ కారణం కాదు 

మాంసం ఎక్కువగా ఉడికించడంతో బర్డ్‌ ఫ్లూ సోకదు

సూచిస్తున్న వైద్య నిపుణులు

సంగారెడ్డి టౌన్‌, జనవరి 12 : బర్డ్‌ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తుందన్న భయాందోళనకు ప్రజలు గురికావాల్సిన అవసరం లేదని, సంగారెడ్డి జిల్లాలో బర్డ్‌ ఫ్లూ వ్యాధి వ్యాపించే అవకాశం లేదని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తుండడంతో అపోహలు తలెత్తి చికెన్‌, గుడ్లు తినడాన్ని ప్రజలు  తగ్గిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ వ్యాధి ‘పారమిక్స్‌ వొవిలిడే’ అనే వైరస్‌ నుంచి వ్యాపిస్తుంది. ఇది అంటు వ్యాధి. ఎక్కువగా కోళ్లు, బాతులు, పావురాలు తదితర పక్షుల్లో వస్తుంది. దేశంలో ముఖ్యంగా వలస పక్షుల నుంచి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉన్నది. 1995లో మొదటి సారిగా భారత దేశంలో బర్డ్‌ ఫ్లూ వ్యాధిని గుర్తించారు. అటు తర్వాత 2005, 2006వ సంవత్సరం, తిరిగి 2011, 2012లో దేశంలో ఈ వ్యాధి విస్తరించింది. దీంతో అనేక కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ వ్యాధి ఎక్కువగా చలి కాలంలోనే విస్తరిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు ఆకస్మికంగా మరణిస్తాయి. ఒకవైపు తల, ముఖం, జుట్టు వాలిపోతుంది. ముక్కు, కండ్ల నుంచి నీరు కారుతుంది. ఇబ్బందికరంగా శ్వాస తీసుకుంటాయి. పచ్చటి, పలుచగా రెట్ట వేస్తాయి. గుడ్లు పెట్టే కోళ్లలో గుడ్ల సంఖ్య తగ్గుతుంది. మాంసం కోళ్లలో బరువు తగ్గుతుంది. ఇది ఎక్కువగా వలస పక్షులు, బాతుల ద్వారా వ్యాధి సోకుతుంది. 

జిల్లాలో 15లక్షల వరకు కోళ్ల పెంపకం..

సంగారెడ్డి జిల్లాలో 450 వరకు కోళ్ల ఫారాలు ఉన్నాయి. అందులో గుడ్లు పెట్టేవి, మాంసం కోళ్ల ఫారాల ద్వారా కోళ్లను పెంచి విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఈ ఫారాల్లో సుమారు 25 లక్షల వరకు కోళ్లను పెంచుతున్నట్లు అధికారులు వివరించారు. జిల్లాలోని కోళ్ల ఫారాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల వద్ద పెంచుకునే పెరటి కోళ్లల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాధి సోకిన దాఖలాలు లేవు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు, చికెన్‌ వండుకునే సందర్భంలో ఎక్కువగా ఉడికించి వంటను చేయడంతో వైరస్‌ సోకే అవకాశం లేదు. చికెన్‌లో వేసే మసాలా దినుసులతో కూడా వైరస్‌ వ్యాపించే అవకాశం ఉండదని పశుసంవర్ధ్దక శాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గతంలో కూడా ఎక్కడా బర్డ్‌ ఫ్లూ వ్యాధి వ్యాపించిన సంఘటనలు లేవు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. మామూలుగా పక్షులు చనిపోయినా ఎలాంటి ఇబ్బందులు లేవని, పక్షుల్లో నట్టలు, డ్రైనేజీ నీరు తాగడం, కొక్కెర తెగులు వచ్చి చనిపోతుంటాయి. బర్డ్‌ఫ్లూ పై జిల్లాలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాధి లక్షణాలను తెలుసుకుంటే సులభంగా నివారణ చర్యలు తీసుకునే వీలుంటుంది. 

నివారణ చర్యలు...

కోళ్ల ఫారాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కోళ్లఫారాల్లో మొత్తం ఫార్మాలిన్‌ ద్రావణాన్ని లీటరు నీటికి 50ఎంఎల్‌ కలిపి పిచికారీ చేయాలి. సున్నం, బ్లీచింగ్‌ పొడి సమపాళ్లలో కలిపి చల్లాలి. ఇతర ఫారాల నుంచి కోళ్లను తీసుకురావద్దు. చనిపోయిన కోళ్లను గుంత తీసి సున్నం, బ్లీచింగ్‌ వేసి పూడ్చివేయాలి. లేదా కాల్చివేయాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశుసంవర్ధ్దక శాఖ వైద్యులను సంప్రదించాలి.  

జిల్లాలో బర్డ్‌ ఫ్లూ వ్యాధి లేదు..

సంగారెడ్డి జిల్లాలో బర్డ్‌ ఫ్లూ వ్యాధి లేదు. జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితులు, ప్రజలు తీసుకునే ఆహార అలవాట్లతో వ్యాధి సోకే అవకాశం లేదు. ఈ వ్యాధి ఎక్కువగా వలస పక్షుల ద్వారా, గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు జిల్లాలో బర్డ్‌ ఫ్ల్యూ వ్యాధి సోకిన దాఖలాలు లేవు. మన వద్ద మాంసం ఎక్కువగా ఉడికించి తింటుంటారు. అందువల్ల ఆ వ్యాధిబారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇటీవల మునిపల్లిలో ఇటీవల చనిపోయిన కోళ్లు బర్డ్‌ ఫ్లూ వ్యాధితో చనిపోలేదు. కొందరు విషం కలుపడంతో చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.  చికెన్‌ ఎక్కువగా ఉడికించడంతో పాటు మసాల దినుసులు కలుపుకోవడంతో వ్యాధి దరిచేరదు. కోళ్లు, పక్షుల్లో నట్టలు ఉన్నా, డ్రైనేజీ నీరు తాగినా, కొక్కెర వ్యాధి సోకడంతో చనిపోతాయి. అంతే తప్పా జిల్లాలో ఇప్పటి వరకు బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు లేవు. ప్రజలు ఎవ్వరూ బర్డ్‌ ఫ్లూ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

- రవీంద్రప్రసాద్‌, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, సంగారెడ్డి 

VIDEOS

logo