మంగళవారం 26 జనవరి 2021
Sangareddy - Dec 05, 2020 , 00:06:31

పాడి పశువులకు బీమా

పాడి పశువులకు బీమా

  • సూలు జీవాలకు నట్టలతో నష్టం 
  • జిల్లాలో 4.86 లక్షల జీవాలు  
  • 128 గ్రామాల్లో జీవాలకు నట్టల నివారణ మందులు
  • 15 నుంచి జాతీయ వ్యాధి నిర్మూలన 
  • పశు సంవర్ధకశాఖ రాష్ట్ర సంచాలకుడు లక్ష్మారెడ్డి

సంగారెడ్డి: పాడి పశువులకు పశు బీమా పథకం త్వరలో ప్రారంభమవుతుందని, 75 శాతం ప్రభుత్వం, 25 శాతం రైతులు భరించాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకుడు లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్‌చెరు మండలం, ఇంద్రేశం గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేసే కార్యక్రమానికి హాజరయ్యారు.  అనంతరం జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఈ నెల 1 నుంచి 7 వరకు జీవాలకు నట్టల నివారణ మందులు తాగిస్తామన్నారు.  ముఖ్యంగా సూలు ఉన్న జీవాలకు నట్టలతో తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని, రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు తప్పని సరిగా నట్టల నివారణ మందులు తాగించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 4,86,167 గొర్రెలు, మేకలు ఉన్నాయని, ఇప్పటి వరకు 91, 295 జీవాలకు నట్టల నివారణ మందులు వేశామన్నారు. జిల్లాలో 72 టీంలు ఏర్పాటు చేసి మూగజీవాలకు నివారణ మందులు వేస్తున్నారని గుర్తుచేశారు. 128 గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు నట్టల నివారణ మందులు జీవాలకు వేస్తున్నారని వెల్లడించారు. 15వ తేదీ నుంచి జాతీయ వ్యాధి నిర్మూలన పథకం ప్రారంభమవుతుందని, అన్ని రకాల పశువులకు గాలికుంటు నివారణ టీకాలు చేస్తామన్నారు. ఈ నెల 10 నుంచి 14 వరకు అన్ని రకాల పశువులకు నట్టల నివారణ మందులు వేస్తామన్నారు.  రైతులు నట్టల నివారణ మందులు, గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని లక్ష్మారెడ్డి సూచించారు. 


logo