శనివారం 23 జనవరి 2021
Sangareddy - Dec 04, 2020 , 00:15:36

ఆ బిల్లు వద్దే వద్దు

ఆ బిల్లు వద్దే వద్దు

  • కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు రైతుల డిమాండ్‌
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు
  • కలెక్టరేట్‌ ఎదుట నిరసనలు
  • రోజురోజుకూ తీవ్రమవుతున్న ఆందోళనలు
  • రైతు ఉద్యమానికి సీఎం కేసీఆర్‌ నాయకత్వం వహించాలి పాకాల శ్రీహరిరావు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై అన్నదాతల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. కొద్ది రోజులుగా ఢిల్లీ శివారులో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ నిరసనలు ఇప్పుడు మెతుకు సీమకు విస్తరించాయి. రైతు చట్టాలను తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాలు, రైతులు మూకుమ్మడిగా ఈ ఆందోళనలు చేపడుతున్నారు. రైతాంగాన్ని ఆగం చేసే చట్టాలు ఎందుకు తీసుకువస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతు ఉద్యమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారథ్యం వహించాలని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ ఉపశమన కమిషన్‌ సభ్యుడు, రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు రెండు పేజీల లేఖను సీఎం కేసీఆర్‌కు రాసి పంపినట్లు ఆయన ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. 

ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు...

కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉప సంహరించుకోవాలని రైతు సంఘాలు, రైతులు, ప్రజా సంఘాలు గురువారం ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. వారం రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాకేంద్రంలో ప్రభుత్వం అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్‌ వరకు వందలాది రైతులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. బస్టాండ్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను రైతులు దహనం చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌ ఎదుట రైతులు నిరసన  చేపట్టారు. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు, ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలతో మరింత ఆగం చేస్తుందని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లో వివిధ రాజకీయ పార్టీలు, రైతుల ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పుల్కల్‌ మండలం శివ్వంపేట వద్ద రహదారిపై రైతులు ఆందోళన చేశారు. చేర్యాల పట్టణంలో రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. రైతు చట్టాలను ఉప సంహకరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి మూడు జిల్లాలోని అన్ని చోట్ల ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా పాకాల శ్రీహరిరావు ముఖ్యమంత్రికి రాసిన లేఖలోని అంశాలు ఇవి..

- జాతీయ ఉపాధిహామీ పథకాన్ని రైతు 50 శాతం ఖర్చు భరించే విధంగా వ్యవసాయ పనులకు అనుసందానం చేయాలి.

-ఉపాధి హామీ పథకం ప్రస్తుతం అమలవుతున్న విధానాలతో రైతులు పండిస్తున్న పంటలపై ఎకరానికి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టం వస్తుంది. ఈ కష్టాల నుంచి రైతు బయటపడాలంటే పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలని రైతులు కోరుతున్నప్పటికీ, కేంద్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేశాయి, అయినప్పటికీ గతంలోని కాంగ్రెస్‌, ఇప్పటి బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

-వ్యవసాయ రంగం బాగుపడాలంటే డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సూచనలు పాటించాలి. కానీ, కేంద్రం ఆ సూచనలను తుంగలో తొక్కింది. 

-కేంద్రం ప్రకటించినట్లుగా రైతు ఆదాయం 2022 వరకు రెట్టింపు కావాలంటే  రైతులు పటిస్తున్న ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.600పైగా ప్రతి ఏటా పెంచాలి.

-పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని కేంద్రమే భరించి, రైతుకు నష్టం జరిగినప్పుడు నిర్ణీత సమయంలో నష్టపరిహారం చెల్లించాలి. పంటల బీమాను అమలు చేయడంలో  కేంద్రంలోని గత కాంగ్రెస్‌, ఇప్పటి బీజేపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయి.

-రైతులు, రైతు కూలీలు అందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం అలాగే ఇంటి నిర్మాణానికి, పిల్లల విద్యకు, పెండ్లిలకు, ప్రైవేట్‌ అప్పులు తీర్చడానికి వారి సొంత పూచీకత్తుపై రూ.10 లక్షల వరకు బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక రుణాలు అందించాలి.

-రైతులు పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్న డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు తగ్గించి అన్నదాతలకు అండగా నిలవాలి.

-రైతులు, రైతు కూలీల కుటుంబాలకు నాణ్యమైన కార్పొరేట్‌ వైద్య సదుపాయాలు అందించాలి.   

కార్పొరేట్లకు కేంద్రం వత్తాసు...

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు రైతులు పండించిన పంట ఉత్పత్తులను అప్పగించే ప్రయత్నంలో రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను తెచ్చింది. కార్పొరేట్ల కొమ్ముకాస్తూ వత్తాసు పలుకుతున్నది. వారం రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో చలికి వణుకుతూ శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్ధ్దంగా రైతులు తమ నిరసనను తెలియజేస్తుంటే, మోడీ సర్కారు రైతులపై తీవ్రమైన నిర్బంధాన్ని మోపుతూ లాఠీచార్జి చేయడం దారుణం. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులతో కార్పొరేట్లకే లాభం జరుగుతుంది. ఈ చట్టాల్లో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు ఎలాంటి నిర్ణయం పొందుపర్చకపోవడం దారుణం. కేంద్ర తీసుకువచ్చిన చట్టాలను రద్దుచేసే వరకు రైతుల పక్షాన సీఐటీయూ పోరాటం చేస్తుంది. 

-చుక్క రాములు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు

అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవాలి.

జాతీయ స్థాయిలో రైతుల ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఎన్నో ప్రధాన సమస్యలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొట్ట చట్టాలను తీసుకువచ్చి రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రైతుకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడానికి కేంద్రంపై ఉద్యమించడానికి బలమైన నాయకత్వం కావాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల తరపున నాయకత్వం వహించాలి. కేంద్రాన్ని ఒప్పించి రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర రైతు రుణ ఉపశమన కమిషన్‌ సభ్యుడు పాకాల శ్రీహరిరావు విజ్ఞప్తి చేశారు. 

-పాకాల శ్రీహరిరావు రాష్ట్ర రైతు రుణ ఉపశమన కమిషన్‌ సభ్యుడుlogo