ఆదివారం 17 జనవరి 2021
Sangareddy - Dec 04, 2020 , 00:15:30

గెలుపు ధీమాలో ఎవరికి వారు

గెలుపు ధీమాలో ఎవరికి వారు

పటాన్‌చెరు : జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఎవరికి వారు గెలుపు ధీమాలో ఉన్నారు. ఓటరు దేవుళ్లు ఎవరిని కరుణించారో తెలియాలంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పోటీ పడ్డాయి. పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు శక్తిమేర పోరాడాయి. ప్రముఖ నాయకులను రంగంలో దించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్ల మనసుదోచి ఓటునే వేయించుకునేందుకు అన్ని రకాల వాగ్ధ్దానాలు చేశారు. కొందరు చేసిన పనులు, చేయబోతున్న అభివృద్ధిని తెలుపగా, మరికొందరు ఎదుటి రాజకీయ నాయకుల లోపాలను ఎత్తి చూపారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. అందరి ప్రచారాన్ని కళ్లారా చూసిన ఓటర్లు తమ నిర్ణయాలను ఓటు ద్వారా బ్యాలెట్‌ బాక్స్‌లో వేశారు. అధికారులు సీల్‌ చేసి బ్యాలెట్‌ బాక్స్‌లను చందానగర్‌లోని స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. పోలీసుల పహారాలో ప్రజాతీర్పు భద్రంగా ఉంది. నేడు ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. బరిలో ఎంతమంది నిల్చినా అంతిమంగా డివిజన్‌లో ఒక్కరికే విజయం ఉంటుంది. కొత్త కార్పొరేటర్‌ ఎవరంటూ ప్రజలతో పాటు రాజకీయ నాయకుల్లోనూ ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎవరికి ఓటేశారు. సమీకరణలు ఎక్కడైనా మారాయా.? ఎవరైనా తమ అనుచరులు హ్యాండ్‌ ఇచ్చారా.? ఇలా రాజకీయ పార్టీలు సమీక్షించుకుంటున్నాయి. ఇదే సమయంలో గట్టి నమ్మకం పెట్టుకున్న యువతరం ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొనకపోవడం పలు పార్టీల అంచనాలను తలకిందులు చేస్తాయని భావిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన రెండోరోజు కూడా పోలీసుల నిఘా, బందోబస్తు అన్ని డివిజన్లలో కొనసాగింది. ఎన్నికల వేడిలో గొడవలు కాకుండా పోలీసులు 144సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. 

సర్కిల్‌-22లో 65.09 శాతం పోలింగ్‌

జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-22 పరధిలోని భారతీనగర్‌ 111 డివిజన్‌, రామచంద్రాపురం 112 డివిజన్‌, పటాన్‌చెరు 113 డివిజన్‌లో 65.09శాతం పోలింగ్‌ నమోదైంది. గతంలో 2016 మున్సిపల్‌ ఎన్నికలతో పోల్చుకుంటే 7.38శాతం ఓట్లు అధికంగా పోలయ్యాయి. భారతీనగర్‌లో 61,71 శాతం, రామచంద్రాపురంలో 65.77శాతం, పటాన్‌చెరులో 65.09శాతం ఓట్లు పోలయ్యాయి. వీరిలో మహిళలు 63.78శాతం, పురుషులు 66.35శాతం ఓట్లేశారు. హైదరాబాద్‌ నగరంతో పోల్చుకుంటే సర్కిల్‌-22లో అధికంగా పోలింగ్‌ జరిగింది. పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే చాలా తక్కువగా పోలింగ్‌ శాతం నమోదైంది. పోలింగ్‌ను అధికారులు సజావుగా నిర్వహించడంతో రీపోలింగ్‌ ప్రస్తావనే రాలేదు. నగర వాతావరణం ఉండటంతో ఐటీ ఉద్యోగులు, ఫార్మా ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు అధికంగా ఉంటారు. వారు ఓటు హక్కును వినియోగంచుకోకపోవడం కనిపించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 80శాతం ఓటింగ్‌ జరిగితే ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, జీహెచ్‌ఎంసీ అధికారులు భావించారు. యువతరం, ఐటీ ఉద్యోగులు ఓటింగ్‌కు కదలక పోవడంతో సాధారణ ఓటింగ్‌ నమోదైంది.  పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సెకండ్‌ షిప్ట్‌ డ్యూటీల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడంతో సాయంత్రం సమయంలో పోలింగ్‌ శాతం పెరిగింది. సామాన్యుల్లో, కార్మికుల్లో, మహిళల్లో ఓటు వేయాలనే బాధ్యత కనిపించింది. 

అనుమానాలతో సతమతం..

పటాన్‌చెరు, భారతీనగర్‌, రామచంద్రాపురం డివిజన్లలో పోటీ చేసిన అభ్యర్థులు తమ విజయాలపై పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా, లోపల మాత్రం టెన్షన్‌ పడుతున్నారు. ముఖ్య అనుచరులు, తమ పార్టీ శ్రేణులతో మాట్లాడి ఎక్కడ ఏ మేరకు ఓటింగ్‌ జరిగింది. ఎవరెవరు అనుకూలంగా తమకు ఓటేశారు. ఎవరు వేయలేదు వం టి విషయాలను ఆరా తీస్తున్నారు. తమ విజయం ఖాయమని అన్ని పార్టీల అభ్యర్థులు వారి కార్యకర్తలు చెబుతూ ధీమా కల్పిస్తున్నారు. కొందరు తమకు వెన్నుపోటు పొడిచారని డబ్బు బాగా ఖర్చుపెట్టిన అభ్యర్థులు నిర్ధారణకు వస్తున్నారు. డబ్బు పోతే పోయింది, ఫలితాలు తమ కు అనుకూలంగా రావాలని వారు కోరుకుంటున్నారు. అదిగోపులి.. ఇదిగో పులి అన్నతీరుగా కొందరు అభ్యర్థులను ఫలితాలపై హడలెత్తిస్తున్నారని సమాచారం. ఓట్లు వచ్చిం ది లేనిది బ్యాలెట్‌బాక్స్‌లు ఓపెన్‌ చేస్తేనే తేలుతుంది. పోలింగ్‌ సమయంలో చిన్నపాటి ఘర్షణలు జరగడంతో పోలీసులు మూడు డివిజన్లపై నిఘా కొనసాగిస్తున్నారు. పోలీసు బందోబస్తును కొనసాగిస్తున్నారు. 144సెక్షన్‌ కొనసాగుతున్నది. శుక్రవారం ఓట్ల లెక్కింపులో ఫలితాలు తమకు అనుకూలంగా రావాలని అందరు అభ్యర్థులు తమ ఇష్టదైవాలకు ప్రార్థిస్తున్నారు.