మంగళవారం 26 జనవరి 2021
Sangareddy - Dec 03, 2020 , 00:24:25

ప్రజల్లో పెరిగిన చైతన్యం

ప్రజల్లో పెరిగిన చైతన్యం

  • గతేడాదిలో మెదక్‌ రేంజ్‌లో 8 ఏసీబీ కేసులు  
  • ఈ ఏడాది తగ్గిన అవినీతి నిరోధక కేసులు
  • అవినీతి కేసుల్లో అత్యధికం రెవెన్యూ శాఖవే.. 
  • కొవిడ్‌-19తో ర్యాలీలు, సదస్సులు రద్దు  
  • నేటి నుంచి 12 వరకు వారోత్సవాలు

ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కావాలంటే చేయి తడపనిదే పైలు ముందుకు కదలని పరిస్థితి ఉండేది. అవినీతిపై ప్రజల్లో చైతన్యం, అవగాహన పెరగడంతో కేసుల నమోదు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 8 కేసుల్లో అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులు పట్టుబడగా, ఈ సంవత్సరంలో కేవలం మూడు కేసులు నమోదు కావడం విశేషం. అవినీతిని అంతమొందించాలని అవినీతి నిరోధకశాఖ అధికారులు ఏటా ప్రజలకు  అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలతో జనంలో చైతన్యం పెరుగుతున్నది.                                                    

- సంగారెడ్డి

ఈ సంవత్సరం కొవిడ్‌-19 కారణంగా విద్యార్థుల ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు లంచగొండి తనంతో ప్రజలను విసిగించి డబ్బులు డిమాండ్‌ చేయడం, ముందుగా ముట్టజెబితే కాని పనిచేయని సందర్భాలకు విసిగిపోయిన బాధితులు, అవినీతి నిరోధకశాఖ అధికారులను సంప్రదించి లంచగొండులను పట్టించిన సందర్భాలు ఉన్నాయి. అధికంగా గతేడాది రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అధికారులు అవినీతి నిరోధకశాఖ దాడుల్లో పట్టుబడ్డారు. వీఆర్వోల నుంచి తహసీల్దార్లు, అదనపు కలెక్టర్‌ స్థాయి అధికారులు పట్టుబడ్డ విషయం తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే అధికారులు కూడా అవినీతి కేసుల్లో పట్టుబడ్డ సంఘటనలు ఉన్నాయి. లంచం అనే పదం కార్యాలయాల్లో వినబడకుండా చేయడం కోసం అవినీతి నిరోధకశాఖ అధికారులు ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, ప్రధాన కూడళ్లలో ప్రజలకు కరపత్రాలు, గోడలకు స్టిక్కర్లు అతికిస్తూ చైతన్యం కల్పిస్తున్నారు.  

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో

నమోదైన కేసుల వివరాలు...

సంగారెడ్డి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. సిదిపేట జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లు బాధితుల నుంచి లంచం డిమాండ్‌ చేసిన కేసులో అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. జోగిపేట, రామచంద్రాపురం, మొగడంపల్లి వీఆర్వోలు ఏసీబీకి దొరికారు. ఈ ఏడాదిలో మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ఆస్తులకు మించిన ఆదాయం కేసులో అవినీతి నిరోధకశాఖ అధికారులు పట్టుకున్నారు. మెదక్‌ జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌, శివ్వంపేట పీహెచ్‌సీలో పని చేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌, ఈ ఏడాదిలో సిద్దిపేట ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారుల చేతికి చిక్కారు. వీరితో పాటు జోగిపేట కోశాధికారి కార్యాలయ అధికారి, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు అవినీతికి పాల్పడి ఏసీబీ అధికారులకు దొరికారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లిలో విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న లైన్‌మెన్‌ అవినీతి కేసులో పట్టుబడ్డారు.  

లంచమడిగితే సమాచామివ్వండి...

ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు ప్రజలను లంచం అడిగితే వెంటనే అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులకు సమాచారమివ్వాలి. లంచం అడిగినా నేరమే, ఇచ్చినా నేరమే. తీసుకున్న వారిపై ఎలాంటి కేసు నమోదవుతుందో ఇచ్చిన వారికి కూడా అదే వర్తిస్తుంది. ఈ విషయం గుర్తించి లంచాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రజలు ముందుకు రావాలి. ఇందుకోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 1064కు కాల్‌ చేయాలి. అవినీతిని నిర్మూలించించేందుకు ప్రజల్లో చైతన్యం కలుగాలి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఈ ఏడాది ఏసీబీ కేసులు తగ్గాయి. ప్రజల్లో అవగాహన పెరిగింది. కొవిడ్‌-19 నేపథ్యంతో ఈసారి వారోత్సవాలు సందర్భంగా ఎలాంటి ర్యాలీలు, సదస్సులు, చర్చాగోష్టిలు నిర్వహించడం లేదు. 

- ఆనంద్‌ కుమార్‌, ఇన్‌చార్జి డీఎస్పీ, ఏసీబీ 

వారోత్సవాల షెడ్యూల్‌

నేటి నుంచి ప్రారంభం కానున్న అవినీతి నిరోధక వారోత్సవాల తొలిరోజు గురువారం ఎన్జీవోస్‌, ఆర్టీఐ కార్యక్రమాలతో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడం, పాల్గొన్న వారితో చర్చాగోష్టి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

రెండో రోజు 4న శనివారం ప్రధాన పట్టణాల్లో ఊరేగింపులు నిర్వహిస్తారు.

మూడో రోజున 5న ‘అవినీతి నిర్మూలనలో ప్రజల పాత్ర’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు పాఠశాల, కళాశాలల విద్యార్థులతో నిర్వహిస్తారు. 

నాలుగో రోజు ‘అవినీతి నిర్మూలనలో ప్రజలు పాత్ర’ అనే అంశంపై డిగ్రీ కళాశాలల విద్యార్థులతో పోటీలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. 

ఐదోరోజున వ్యాసరచన పోటీల ముల్యాంకనం ఉంటుంది.

ఆరో రోజున వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం, అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించి, ఏసీబీ కేసుల ఫిర్యాదుదారులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కరోనాను దృష్టిలో పెట్టుకుని అవినీతి నిరోధకశాఖ అధికారులు ర్యాలీలు, సదస్సులు, చర్చాగోష్టిలు నిర్వహించకుండా కరపత్రాలు, గోడలకు స్టిక్కర్లు అంటిస్తూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకున్నారు.logo