ఆదివారం 17 జనవరి 2021
Sangareddy - Dec 01, 2020 , 01:02:08

పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత

పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత

  • శాంతిభద్రతల విషయంలో రాజీ పడం
  • సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి

పటాన్‌చెరు: శాంతి భద్రతల విషయంలో రాజీపడబోమని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్‌ మూడు డివిజన్లలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్‌ 113 లోని ఎస్‌వీఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో ఎన్నికల విధులకు హాజరవుతున్న పోలీస్‌ సిబ్బందితో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. రాజకీయ పార్టీలు, ఇతరులు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 144 సెక్షన్‌ ఉన్నందుకు నలుగురు గుమిగూడకుండా చూడాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, పోలీస్‌ సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయం ప్రాంతం, శ్రీవాణి స్కూల్‌, జేపీ కాలనీలోని పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. ఎన్నికల కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం చందానగర్‌లోని పీజేఆర్‌ స్టేడియంలోని స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ హాల్‌ను సందర్శించారు. ఈ ఎన్నికల్లో 13మంది సీఐలు, 22 మంది ఎస్సైలు, 15మంది ఏఎస్సైలు, 180మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, సాయుధ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఎన్నికల కేం ద్రాలకు రక్షణ కల్పించడంతోపాటు పోలింగ్‌ శాంతియుతంగా జరిగేలా చూస్తామన్నారు. ప్రజలు ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేలా సహకరించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.