సోమవారం 18 జనవరి 2021
Sangareddy - Nov 29, 2020 , 00:13:36

టీఆర్‌ఎస్‌తోనే నిరంతర విద్యుత్‌ సరఫరా

టీఆర్‌ఎస్‌తోనే నిరంతర విద్యుత్‌ సరఫరా

  • పరిశ్రమల్లో ఓటీలు కేసీఆర్‌ చలవే
  • ఇతర రాష్ర్టాల కార్మికుల సంక్షేమానికి కృషి
  • పటాన్‌చెరు అభివృద్ధిలో దూసుకుపోతున్నది : మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

పటాన్‌చెరు : టీఆర్‌ఎస్‌ పార్టీతోనే నిరంతర విద్యుత్‌ సరఫరా జరుగుతున్నదని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు డివిజన్‌ 113లోని బండ్లగూడలో పలు బూత్‌ల్లో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు బక్కి వెంకటయ్య, నర్రా భిక్షపతి టీఆర్‌ఎస్‌ పార్టీ 113 డివిజన్‌ అభ్యర్థి మెట్టుకుమార్‌ యాదవ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. చిన్నతరహా పరిశ్రమల్లోకి వెళ్లి ఓట్లు అడిగారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పటాన్‌చెరు డివిజన్‌ను అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 24గంటల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు. గతంలో వారంలో మూడు రోజులు కరెంట్‌ ఉండేది కాదని గుర్తు చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులకు అన్నం పెడుతున్న ప్రాంతం పటాన్‌చెరు అన్నారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. బండ్లగూడలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఇప్పటికే పటాన్‌చెరు ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. పెరుగుతున్న జనాభాకు సరిపోను వసతులను కల్పిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి డివిజన్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో పటాన్‌చెరు డివిజన్‌ గొప్పగా అభివృద్ధి చెందిందని కొనియాడారు. ప్రజలు అయోమయానికి గురికాకుండా టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలన్నారు. బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాసంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రచారంలో ఆర్సీపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఆఫ్జల్‌ అలీ, నర్రా సుధాకర్‌, ఎన్‌ శ్రీనివాస్‌, ఎన్‌.శ్రీనివాస్‌, వీరస్వామి, రవీందర్‌, దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.