గురువారం 28 జనవరి 2021
Sangareddy - Nov 29, 2020 , 00:13:30

నేటితో ప్రచారానికి తెర

నేటితో ప్రచారానికి తెర

  • సభలకు టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు
  • మూడు డివిజన్లలో పాల్గొననున్న మంత్రి హరీశ్‌రావు
  • ఉత్సాహంగా కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రచారం
  • నేటి సాయంత్రం నుంచి 1న సాయంత్రం  వరకు వైన్స్‌లు, బార్లు బంద్‌

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రచారం ఆదివారం(నేటి) సాయంత్రంతో ముగియనున్నది. పోలింగ్‌ 1న మంగళవారం జరగనుంది. వారం రోజులుగా మారుమోగిన స్పీకర్లన్నీ మూగబోనున్నాయి. చివరి రోజు కావడంతో ఆదివారం జిల్లా పరిధిలోని భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు మూడు డివిజన్లలో బహిరంగ సభల నిర్వహణకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది. మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. వారం రోజులుగా మూడు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. రోజు వారీగా మంత్రి హరీశ్‌రావు సభలు, సమావేశాలు, రోడ్‌షోల్లో పాల్గొంటూ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడీయంలో జరిగిన ముఖ్యమంత్రి సభకు మూడు డివిజన్ల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. చివరి రోజు పార్టీ కార్యక్రమాలకు ఏర్పాట్లు బాగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు నాయకులుకు సూచించారు. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి 1న సాయంత్రం 5 గంటల వరకు వైన్స్‌లు, బార్లు మూసి ఉండనున్నాయి. 

నేడు మూడు చోట్ల ప్రచార సభలు...

ఆదివారం ప్రచారానికి చివరి రోజు కావడంతో రాజకీయ పార్టీలు ప్రచార ఏర్పాట్లు చేసుకున్నాయి. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు మూడు డివిజన్లలో ప్రచార సభలకు ఏర్పాట్లు చేస్తున్నది. మూడు చోట్ల జరిగే సభలకు ఆయా డివిజన్ల నుంచి పార్టీ శ్రేణులను తరలివచ్చేలా నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు హాజరుకానున్నారు. శనివారం కూడా రామచంద్రాపురం, పటాన్‌చెరులో మైనార్టీల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చివరి రోజు సభలు సక్సెస్‌ కావాలని ఆయా డివిజన్ల పరిధిలో స్థానికులు హాజరయ్యేలా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పటాన్‌చెరులో పాత వ్యాయామశాల సమీపంలో భారతీనగర్‌ మీటింగ్‌ రామచంద్రాపురం ఫంక్షన్‌హాలులో, రామచంద్రాపురం డివిజన్‌ మీటింగ్‌ సండే మార్కెట్‌ ప్రాంతంలో ఉంటుందని పార్టీ నాయకులు తెలిపారు. 

టీఆర్‌ఎస్‌ ప్రచారానికి అపూర్వ స్పందన...

వారం రోజులుగా మూడు డివిజన్లలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రచారానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. భారతీనగర్‌ నుంచి సింధూ ఆదర్శరెడ్డి, రామచంద్రాపురం నుంచి పుష్పా నగేశ్‌, పటాన్‌చెరు డివిజన్‌ నుంచి మెట్టుకుమార్‌ యాదవ్‌ టీఆర్‌ఎస్‌ నుంచి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు రోజువారీగా విస్త్రతంగా ప్రచారం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమాన్ని చూసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ వివరించడంతో కార్యకర్తలు సక్సెస్‌ అయ్యారని చెప్పుకోవచ్చు. అభ్యర్థులతో కలిసి మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, ఫరీదుద్దీన్‌, మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, సత్యనారాయ ణ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి,  వెంకటయ్య, ఇతర నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.

నేటి నుంచి వైన్స్‌లు బంద్‌...

ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్‌ పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు మూసి వేయనున్నారు. పటాన్‌చెరు పరిధిలో భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు డివిజన్లలో వైన్‌ షాపులు మూసి ఉండనున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రయ్య ‘నమసే ్తతెలంగాణ’కు తెలిపారు. 29న సాయంత్రం 6గంటల నుంచి 1న సాయంత్రం 6 గంటల వరకు వైన్స్‌లు, బార్లు మూసి ఉంటాయి. ఎన్నికల నేపథ్యంలో మద్యం తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మందు పంపిణీ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన రాజకీయ పార్టీల నాయకులకు హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ పూర్తి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 


logo