మన ఊరికే గురుకులం

- విద్యార్థుల సొంతూరిలోనే పాఠ్యాంశాల బోధన
- షార్ట్ వీడియోల ద్వారా పాఠాలు
- విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్న టీచర్లు
- కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
- విలేజ్ లెర్నింగ్ కేంద్రాలు ఏర్పాటు
జహీరాబాద్ : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు ‘కరోనా’ సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థుల కోసం ‘మన ఊరికే గురుకులం’ (విలేజ్ లెర్నింగ్ సెంటర్)లు ఏర్పాటు చేయడంతో మంచి సత్ఫలితాలనిస్తున్నాయి. గ్రామ స్థాయిలో విద్యార్థులంతా ఒకేచోటుకు చేరి చదువుకునేలా చేస్తున్నారు. గురుకుల ఉపాధ్యాయులు విద్యార్థుల సందేశాలను నివృత్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 14 గురుకుల పాఠశాలల్లో 7,940 విద్యార్థులను ఉపాధ్యాయులు నేరుగా కలిసి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు (బాలురు, బాలికలు) చదువుకుంటున్న బాలికలు, బాలురు కోసం ‘మన ఊరికే గురుకులం’ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించలేకపోయింది. దీంతో గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఊరిలో చదువుపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రత్యేక చొరవతో స్వేరోస్ సహకారంతో గ్రామస్థాయిలో వీఎల్సీలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో సొంతూరిలో ఒకేచోట చదువుకునేలా ఏర్పాట్లు చేయించారు. నెలల తరబడి గురుకుల పాఠశాలలు తెరుచుకోకపోవడంతో విద్యార్థుల ధ్యాస మరలకుండా చూసేందుకు ‘మన ఊరికే గురుకులం’ ప్రారంభించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 21,120 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటిసారి రంజోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ‘మన ఊరికే గురుకులం’ అనే కార్యక్రమం ప్రారంభించారు. స్మార్ట్ఫోన్లు, టీవీలు అందుబాటులో లేక పేద విద్యార్థులు డిజిటల్ తరగతులు వినే పరిస్థితి లేదు. దీంతో గ్రామాల్లో వీఎల్సీ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేశారు. కేంద్రాలకు బ్లాక్ బోర్డులు, హ్వాంగింగ్, బోర్డులు, రోలింగ్ బోర్డులు, ఇతర సామగ్రి సరఫరా చేశారు. గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు వీడియోలు తయారు చేసి తమ పరిధిలోని వీఎల్సీ కేంద్రాలకు పంపించారు. తరగతుల వారీగా నోట్బుక్లు, పుస్తకాలు అందించారు. కేంద్రానికి వచ్చే విద్యార్థుల్లో పైతరగతిలో ఉన్న వారు కింది తరగతులకు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. గురుకుల ఉపాధ్యాయులు వారంలో రెండు సార్లు వారికి కేటాయించిన కేంద్రాలకు వెళ్లి టైం టేబుల్ రూపొందించారు. విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేస్తున్నారు. స్వేరోస్ కేంద్రాల్లో విద్యార్థులకు సహకారాలు అందిస్తున్నారు. రంజోల్ గురుకుల పాఠశాల పరిధిలో మొదటిసారి ఈనెల 9న దిగ్వాల్ గ్రామంలో నిర్వహించారు. 16న మొగుడంపల్లి, 23న కోహీర్‌లో ‘మన ఊరికే గురుకులం’ నిర్వహించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.
ప్రతి వారం ‘మన ఊరికే గురుకులం’..
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినుల కోసం ప్రతి వారం ఒక్కో మండలంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులను ఒక్కచోటుకు చేర్చిందుకు తాత్కాలిక వేదికను ఎంచుకుంటున్నారు. ఉపాధ్యాయులు నిర్ధేశించిన రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు కొనసాగిస్తున్నారు. విద్యార్థినులకు ప్రేరణ కల్పించడం, యూనిట్ టెస్టుల నిర్వహణ, పర్యవేక్షణ అసైన్మెంట్లు, ప్రాజెక్టుల కేటాయింపు చేస్తున్నారు. వివిధ రకాల ఆటలు ఆడించడంతోపాటు పెయింటింగ్, డ్రాయింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు.
విద్యార్థినులకు క్షేత్రస్థాయి అంశాలపై అవగాహన..
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు క్షేత్రస్థాయిలో వ్యాపారులు చేస్తున్న వారి అభిప్రాయలు తెలుపుతున్నారు. పోలీస్‌స్టేషన్‌లో విధి నిర్వహణ, ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నారు. శానిటైజర్, చేతుల శుభ్రతకు రసాయనలు అందుబాటులో ఉం చారు. మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, బయోగ్యాస్ ఎలా తయారు చేస్తారు.. క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశాలు.. కులవృత్తుల వారితో మాట్లాడుతున్నారు. రేషన్ బియ్యం పం పిణీ తీరు, రైతులతో మాట్లాడుతున్నారు. కొవిడ్‌పై అవగాహన, నివారణ చర్యలు గురించి తెలియజేస్తున్నారు.
ఊరిలో ఒకచోట చేరి చదువుకునేలా..
గురుకుల పాఠశాలలు తెరుచుకోకపోవడంతో విద్యార్థినులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ‘మన ఊరిలో గురుకులం’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పాఠశాలలు తెరుచుకోక చాలా మంది విద్యార్థులు సెల్ఫోన్లు, ఇతర వ్యాపకాల వైపు ఆకర్షితులవుతున్నారు. వారి దృష్టి మరలకుండా ఉండేందుకే వీఎల్సీ విధానాన్ని ప్రారంభించాం. గ్రామంలోని గురుకుల విద్యార్థులంతా ఒక్కచోట చేరి చదువుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ఉపాధ్యాయులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయిస్తున్నాం. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేంద్రాలకు సామగ్రి అందిస్తున్నాం.
- లలితమ్మ, ప్రిన్సిపాల్,
రంజోల్ గురుకుల పాఠశాల
నిత్యం పాఠాలు చదువుతున్నాం..
కరోనాతో గురుకుల కళాశాల తెరుచుకోకపోయినా చదువుకు దూరం కాలేదు. ప్రతిరోజూ పాఠా లు చదువుతున్నాం. ఉపాధ్యాయులు (సార్లు) వారంలో రెండు సార్లు వచ్చి మా డౌట్స్‌ను క్లియర్ చేస్తున్నారు. మా గురుకుల పాఠశాలలో కింది తరగతుల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మేమే పాఠాలు చెబుతున్నాం.
- రచన, ఇంటర్, రంజోల్ గురుకుల పాఠశాల
తాజావార్తలు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..