శనివారం 16 జనవరి 2021
Sangareddy - Nov 26, 2020 , 00:15:48

బీజేపీకి ఓటేస్తే ..కార్పొరేటీకరణకు అంగీకరించినట్టే

బీజేపీకి ఓటేస్తే ..కార్పొరేటీకరణకు అంగీకరించినట్టే

  • ప్రభుత్వరంగ సంస్థలు ప్రమాదంలో పడ్డాయి  
  • ఉద్యోగుల భద్రతకు పెను ప్రమాదం
  • భెల్‌, బీడీఎల్‌, ఓడీఎఫ్‌ ఉద్యోగులతో ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు

పటాన్‌చెరు : బీజేపీకి ఓటేస్తే కార్పొరేటీకరణకు అంగీకరించినట్టే, మీ ఓటుతో మీ ఉద్యోగాల భద్రత ప్రశ్నార్థకం కావ చ్చు.. అంటూ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులతో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం రాత్రి పటాన్‌చెరులోని జీఎమ్మార్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో బీహెచ్‌ఈఎల్‌, ఓడీఎఫ్‌, బీడీఎల్‌ ఉద్యోగులతో మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ కార్పొరేట్‌ శక్తులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభు త్వ కుట్రలను తిప్పికొట్టేందుకు ఉద్యోగులందరూ సంఘటితంగా ఉద్యమించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల భూముల అమ్మకాలకు నిరసనగా సీఎం కేసీఆర్‌తో చర్చించి తీర్మానం చేస్తామన్నారు. మేకిన్‌ ఇండి యా అంటూ ప్రధాని మోడీ విదేశాలకు ఆర్డర్లు ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్‌ బీహెచ్‌ఈఎల్‌ సంస్థలకు రూ. 40వేల కోట్ల ఆర్డర్‌ ఇచ్చారన్నారు. బీజేపీకి ఓటేస్తే కార్పొరేటీకరణకు అంగీకరించినట్టేనని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచేందుకు ఐక్య ఉద్యమాలే శరణ్యం మంత్రి హరీశ్‌రావు అన్నారు. నవంబర్‌ 26న దేశవ్యాప్త సమ్మెకు టీఆర్‌ఎస్‌ భేషరతు మద్దతు ఇస్తుందని మంత్రి తెలిపారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మెట్టుకుమార్‌యాదవ్‌, పుష్పనాగేశ్‌, సింధూ ఆదర్శ్‌రెడ్డికి కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, వారి కుటుంబాలు, కాంట్రాక్టర్లు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఓట్లు వేసి గెలిపించుకోవాలని మంత్రి కోరారు. 

పార్లమెంట్‌లో గళమెత్తుతాం: మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం కాకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటులో గళం ఎత్తుతుందన్నారు.  నవరత్న సంస్థలను కాపాడేందుకు, రక్షణరంగ సంస్థల ప్రైవేటీకరణకు  పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ రంగసంస్థలను కాపాడుకునేందుకు ఆర్డర్లు ఇస్తున్నారని గుర్తు చేశారు. కేంద్రం తీరుతో ఇప్పటికే రైల్వే, ఎల్‌ఐసీ, రక్షణరంగ సంస్థలు ప్రమాదంలో పడ్డాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులతో కలిసి పోరాడేందుకు టీఆర్‌ఎస్‌ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని హామీనిచ్చారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గొంతుగా ఉంటానని ఎంపీ హామీనిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కె.సత్యనారాయణ, చింతా ప్రభాకర్‌, కార్మిక సంఘం నాయకులు ఎల్లయ్య, పలు కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.