ఆదివారం 24 జనవరి 2021
Sangareddy - Nov 25, 2020 , 00:07:24

గ్రేటర్‌లో ఎగిరేది టీఆర్‌ఎస్‌ జేండానే

గ్రేటర్‌లో ఎగిరేది టీఆర్‌ఎస్‌ జేండానే

  • ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట వేస్తాం
  • ప్రభుత్వ కృషితోనే హైదరాబాద్‌కు పరిశ్రమల రాక
  • టీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధి, సంక్షేమం
  • సీఎం కేసీఆర్‌తోనే గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి
  • బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి
  • వరదలు వస్తే కేంద్రం హైదరాబాద్‌ను ఆదుకోలేదు..
  • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 
  • పటాన్‌చెరులో యువ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి 
  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని వినతి

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆరు నూరైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధిక స్థానాలు కైవసం చేసుకొని మేయర్‌ పీఠాన్ని అధిరోహిస్తుందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు డివిజన్లలో వేలాది మంది యువకులతో నిర్వహించిన బైక్‌ర్యాలీ, యువ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం పటాన్‌చెరు జీఎంఆర్‌ కన్వెన్షన్‌లో జరిగిన యువ సభలో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న సిందూ ఆదర్శరెడ్డి, పుష్పా నగేష్‌, మెట్టు కుమార్‌యాదవ్‌లు జనం మనుషులని, ప్రజా సేవ చేస్తున్న వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తప్పుడు ప్రచారాలతో బీజేపీ నేతలను ప్రజలను గందరగోళ పరుస్తున్నారని, ఆ ప్రచారాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీ యువతకు మంత్రి సూచించారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కృషి, సీఎం కేసీఆర్‌ సహకారంతో పటాన్‌చెరు ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, దీంతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. మోడీ సర్కారు ఐటీఐఆర్‌ రద్దు చేయడంతో గ్రేటర్‌ పరిధిలోని యువతకు 4 లక్షల ఉద్యోగాలు పోయాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వారం రోజులు కష్టపడి యువత పనిచేస్తే వచ్చే ఐదేండ్లు కార్పొరేటర్లు మీకు సేవ చేస్తారని, ఎక్కడికక్కడ బీజేపీ నేతల తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు యువతకు పిలుపునిచ్చారు. 

బండి సంజయ్‌ బడాయి మానుకోవాలి...

ఏదంటే అది ఇస్తామని జూఠా మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్య ఆ పార్టీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాటలతో సిగ్గుపడాలని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి నిధులు తేలేం అని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పడాన్ని మంత్రి గుర్తు చేశారు. బండి సంజయ్‌ మాత్రం కారు పోతే కారు, బైకు, సైకిల్‌ ఏది పోతే అది ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతోనైనా ‘బండి’ ఇక జూఠా మాటాలు మానుకోవాలని హరీశ్‌రావు హితవు పలికారు. వరదలతో నష్టపోయిన బెంగళూరుకు రూ.600 కోట్లు, గుజరాత్‌కు రూ.400 కోట్లు ఇచ్చిన కేంద్రం, హైదరాబాద్‌కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కారు, కేసీఆర్‌ అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అమ్మ పెట్టదు ఆడుక్కోనివ్వదన్నట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరదలకు నష్టపోయిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంటే, బీజేపీ నాయకులు అడ్డుకున్నారని మంత్రి ఆరోపించారు.   బీహెఈఎల్‌, ఓడీఎఫ్‌, ఎల్‌ఐసీ వంటి కేంద్ర సంస్థలను కేంద్రం ఆగం చేసిందని, బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 50 వేల ఉద్యోగాలు ఊడబీకారు. ఏడాది కోటి ఉద్యోగాలిస్తామని చెప్పిన మోడీ ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నాడని విమర్శించారు.  

స్థానికులకు ఉద్యోగావకాశాలు

సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ర్టానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పరిశ్రమల రాకతో యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి మనవాళ్లకు ఉద్యోగాలు లభించేలా చూస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.   

గ్రేటర్‌లో ఇక ఉచితంగా నీటి సరఫరా

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 20వేల లీటర్ల లోపు మంచినీరు వాడుకునే వారికి ఇక ఎలాంటి బిల్లు చెల్లింపులు ఉండవని మంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. ప్రజల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్‌ అద్భుత వరాలు కురిపించారన్నారు. నాయీబ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంట్‌ సరఫరా, 6 నెలల పన్ను రాయితోతో క్యాట్‌, ట్యాక్సీ డ్రైవర్లు ఎంతో సంతోషిస్తున్నారు. చిన్న పరిశ్రమలకు ఫిక్స్‌డ్‌ విద్యుత్‌ చార్జీలను కూడా సర్కారు రద్దు చేయడం శుభపరిణామం అన్నారు. చిన్న పరిశ్రమల యాజమాన్యాలకు ఈ ప్రకటన పెద్ద ఊరట అన్నారు. గ్రేటర్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్‌, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ యువ నాయకులు, కార్పొరేటర్‌ అభ్యర్ధులు సింధూ ఆదర్శ్‌రెడ్డి, పుషా నగేశ్‌ యాదవ్‌, మెట్టు కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. యువకులు వేలాది తరలిరావడంతో పటాన్‌చెరు మొత్తం జై తెలంగాణ, జై టీఆర్‌ఎస్‌ నినాదాలతో మారిమోగింది. 

మన యువకులకు ఉద్యోగాలు ఇప్పించుకుందాం 

-పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి 

పరిశ్రమల్లో మన యువతకు ఉద్యోగాలు ఇప్పించుకుందామని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. మంత్రి హరీశ్‌రావు కాళ్లు మొక్కి అయినా మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పించుకుందామన్నారు. గత ఆరేండ్లలో ఇప్పటి వరకు మూడు సార్లు ఉద్యోగ మేళాలు స్వయంగా ఏర్పాటు చేశామని, వీటితో దాదాపు 6వేల మంది యువతీ, యువకులకు ఉద్యోగాలు ఇప్పించినట్లు మహిపాల్‌రెడ్డి గుర్తు చేశారు. మున్నుందు కూడా మేళాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పటాన్‌చెరు ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడంతో సంతోషించదగ్గ పరిణామం అన్నారు. యువతకు కొలువులు రావాలంటే టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


logo