ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

- కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
- ప్రతిరోజు పౌర సరఫరాల అధికారి రైస్ మిల్లర్లతో మాట్లాడాలి
- 25,26న తుఫాన్ వచ్చే అవకాశం
-కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి: జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ నెల 25,26న రెండు రోజుల్లో తుఫాన్ ఉన్నదని, జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు కలెక్టర్ దిశా, నిర్దేశం చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసి కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ ఉంచకూడదన్నారు. ట్రాక్టర్లలో ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, టన్నుకు రూ. 180 రవాణా చార్జీలు చెల్లిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రతి రోజూ పౌర సరఫరాల అధికారులు రైస్ మిల్లుల యాజమాన్యంతో మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని, అదేవిధంగా వర్షాలకు ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రాల వద్ద గుంతలు ఉన్న ప్రాంతంలో ధాన్యం ఆరబోయకుండాచూడాలన్నారు. మార్కెట్ కమిటీ ఇచ్చే టార్పాలిన్లు సరిపోనందున, రైతులు కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లతో రావాలని, వర్షంతో తడవకుండా ధాన్యం కుప్పలకు టార్పాలిన్లు కప్పుకోవాలని సూచించారు. రైతుల ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే తీసుకురావాలని, ధాన్యాన్ని తమతమ కల్లాల్లోనే ఆరబెట్టుకుని, సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి అనుమతితో కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కలెక్టర్ రైతులను కోరారు. వర్షం సమయంలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకను నియంత్రించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఎక్కడైనా కొనుగోలు చేసిన ధాన్యం వర్షానికి తడిసినట్లయితే సంబంధిత కేంద్ర ఇన్చార్జి బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టంచేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలకులుగా నియమించిన ఆయా మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు కేంద్రాలను సందర్శించి, వర్షాలకు తడవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఐకెపీ, డీపీఎం, సహకార శాఖల అధికారులు విస్తృతంగా పర్యటించి కొనుగోలు కేంద్రాలలో తగు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. గోనే సంచుల కొరత రాకుండా, ఇండెంట్ వచ్చిన ఆరు గంటల్లోగా కేంద్రాలకు గోనేసంచులు పంపాలని జిల్లా పౌరసరఫరాల అధికారికి సూచించారు. సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలలో గోనె సంచుల కొరత లేకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే రైస్ మిల్లులకు చేరిన ధాన్యాన్ని లారీల నుంచి వెంటనే దించుకునేలా తగినంత మంది హమాలీలను నియమించుకోవాలని, ధాన్యం నిల్వ చేసేందుకు శాస్త్రీయ పద్ధతిలో ఏర్పాట్లు చేసుకోవాలని, ట్యాబ్‌లో వెంటనే నమోదు చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు రానున్న తుఫాన్‌ను దృష్టిలో పెట్టుకుని అదికారులను అప్రమత్తం చేయడానికి సూచించారు.
తాజావార్తలు
- గుంత కనిపిస్తే..అధికారులకు జీహెచ్ ఎంసీ కమిషనర్ సీరియస్ వార్నింగ్
- మొసలితో పరాచకాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
- నగరవాసుల యాదిలోకి మరోసారి డబుల్ డెక్కర్ బస్సు
- నేడు లాజిస్టిక్ పార్క్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- పెళ్లాం కదా అని కొడితే కటకటాలే...
- దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు
- శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ గిఫ్ట్..
- వార్తలలోకి 'మనం 2'.. ఆసక్తిగా గమనిస్తున్న ఫ్యాన్స్
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం
- ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు పునఃప్రారంభం