శనివారం 28 నవంబర్ 2020
Sangareddy - Nov 22, 2020 , 00:21:35

టీఆర్‌ఎస్‌కే కార్మికలోకం జై..

టీఆర్‌ఎస్‌కే కార్మికలోకం జై..

  • కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మికుల ఆగ్రహం
  • ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని ఆందోళన
  • తెలంగాణ సర్కారు ప్రభుత్వ సంస్థలను పరిరక్షిస్తుందని కితాబు
  • మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సంఘీభావం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 
  • టీఆర్‌ఎస్‌కు మద్దతు  ప్రకటించిన బీహెచ్‌ఈఎల్‌ కార్మికులు

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ సంస్థలు, కార్పొరేట్‌ శక్తుల కోసం ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని, కేంద్రం కార్మికుల పొట్టకొట్టేలో నడుచు కుంటున్నదని కార్మిక లోసం గుర్రుగా ఉన్నది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తామంతా టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామని కార్మికులు సంఘీభావం, మద్దతు తెలుపుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సర్కారు సంస్థలను కాపాడుతున్నదని, భెల్‌ వంటి సంస్థలకు వేల కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చి వాటి బలోపేతానికి, కార్మికుల అభ్యున్నతికి పాటుపడుతున్నదని కార్మిక నేతలు అంటున్నారు. అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నామని కార్మిక నేతలు తెలిపారు.

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పక్కా ప్రణాళిక ప్రకారం కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్‌ను ప్రోత్సహిస్తున్నదని, మోడీ సర్కారు కార్మిక వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తున్నదని కార్మికులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో కార్మికులకు అండగా ఉంటున్న టీఆర్‌ఎస్‌ పార్టీకే గ్రేటర్‌ ఎన్నికల్లో కార్మికులు మద్దతు ప్రకటిస్తున్నారు. బీహెచ్‌ఈఎల్‌ వంటి పేరుపొందిన సంస్థలను కేంద్ర సర్కారు ఘోరీ కట్టడానికి చూస్తే, సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం భెల్‌కు రూ.30 కోట్ల ఆర్డర్లు ఇచ్చి ఉద్యోగ, కార్మిక కుటుంబాలకు అండగా నిలిచిందని కార్మికులు పేర్కొంటున్నారు. కేంద్ర సర్కారు వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కార్మికులు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు. బీహెచ్‌ఈఎల్‌ కార్మికులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సంఘీభావం ప్రకటించారు. టీఆర్‌ఎస్‌కు ఉద్యోగ, కార్మికుల మద్దతుతో బీజేపీ నాయకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 

టీఆర్‌ఎస్‌కు ఉద్యోగ, కార్మికుల మద్దతు...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఉద్యోగ, కార్మికులమైన తాము అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు బీహెచ్‌ఈఎల్‌ కార్మికులు ప్రకటించారు. బీహెచ్‌ఈఎల్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షుడు జి.ఎల్లయ్య టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, కార్మికులంతా టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉన్నారన్నారు. పరిశ్రమల కార్మికులకు అండగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు సంబంధించిన రూ.30 కోట్ల పనులను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించడాన్ని ఆయన ప్రత్యేకంగా సీఎం కేసీఆర్‌ను అభినందించారు. కేంద్రం ప్రభుత్వ సంస్థలను ఆగం చేస్తుంటే, టీఆర్‌ఎస్‌ సర్కారు అండగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌కు సంఘీభావం ప్రకటించారు. బీహెచ్‌ఈఎల్‌ అధికార యూనియన్‌ ఐఎన్‌టీయూసీ కూడా టీఆర్‌ఎస్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెహమాన్‌, దామోదర్‌రెడ్డి మంత్రి సమక్షంలో మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలను టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని వారు తెలిపారు.

కార్మిక సంఘాలతో మంత్రి సమావేశాలు...

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు మూడు డివిజన్లకు మంత్రి హరీశ్‌రావు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యేకంగా కార్మిక సంఘాల నాయకులతో సమావేశం అవుతున్నారు. బీహెచ్‌ఈఎల్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షుడు ఎల్లయ్యను గురువారం మంత్రి హరీశ్‌రావు మర్యాద పూర్వకంగా కలిశారు. స్వయంగా వెళ్లి కలవడంతో ఎల్లయ్య సంతోషం వ్యక్తం చేశారు. మా ఉద్యోగ, కార్మికులు మీకు అండగా ఉంటామని మంత్రికి హామీ ఇచ్చారు. శుక్రవారం ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం నాయకులతో కూడా మంత్రి సమావేశమయ్యారు. మీకు సర్కారు అండగా ఉన్నదని, సర్కారుకు మీరు అండగా ఉండాలని కోరడంతో నాయకులు, కార్మికులు జై టీఆర్‌ఎస్‌ అంటూ మద్దతు తెలిపారు. ఏ అవసరం ఉన్నా టీఆర్‌ఎస్‌ సర్కారు ఉంటుందని కార్మికులకు మంత్రి భరోసా ఇచ్చారు.

పరిశ్రమలకు 24గంటల విద్యుత్‌ 


ఆసియా ఖండంలోనే పటాన్‌చెరు అతిపెద్ద పారిశ్రామికవాడ. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోనే 3 వేల వరకు భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో దేశంలోని అన్నీ రాష్ర్టాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. వేలాది మంది ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్‌ కోతలతో ఎన్నో పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు. వారానికి మూడు రోజుల పాటు పవర్‌ హాలీడేలు ఉండేవి. కార్మికులు పనిలేక రోడ్డున పడిన సందర్భాలు ఉండేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని పటిష్టం చేసింది. ప్రస్తుతం 24గంటల విద్యుత్‌ సరఫరాతో పరిశ్రమల్లో కార్మికులు ఓటీలు చేసుకుంటున్నారు. గతంలో కరెంట్‌ కోసం ధర్నాలు చేశామని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పుడు మూడు షిప్టుల్లో కంపెనీలు పనిచేస్తున్నాయని, ఈ నేపథ్యంలో కార్మికులకు పని దొరుకుతుందంటున్నారు. కరోనా సమయంలో వారివారి ప్రాంతాలకు వెళ్లిపోయిన కార్మికులు తిరిగి వచ్చి మళ్లీ పనుల్లో చేరిపోయారు. దేశంలోనే అనేక రాష్ర్టాలకు చెందిన వారు పటాన్‌చెరు ప్రాంతంలోని పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. కరోనా సమయంలో ఇతర రాష్ర్టాలకు చెందిన కార్మికులకు సైతం ప్రభుత్వం ఉచితంగా బియ్యం, ప్రతి ఒక్కరికి రూ.1500 చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఏ ప్రాంతం అని చూడకుండా కార్మికులకు టీఆర్‌ఎస్‌ సర్కారు అండగా నిలిచిందని కార్మికులు గుర్తుచేస్తున్నారు.