బుధవారం 20 జనవరి 2021
Sangareddy - Nov 19, 2020 , 00:14:22

భూ సేకరణ వేగవంతం చేయాలి

భూ సేకరణ వేగవంతం చేయాలి

సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు

సంగారెడ్డి టౌన్‌ : జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో నిమ్జ్‌, టీఎస్‌ఐఐసీ, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ రహదారులు, కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వకు సంబంధించి భూసేకరణ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కాళేశ్వరం మెయిన్‌ కాల్వకు సంబంధించి భూ సేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. బైపాస్‌ రోడ్లు, రోడ్డు డివైన్డింగ్‌, గ్రిడ్‌ రోడ్‌, కనెక్టెడ్‌ రోడ్లకు సంబంధించి భూ సమస్యలు ఉంటే పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. టీఎస్‌ఐఐసీ ప్రాజెక్టులకు భూసేకరణ వివరాలను సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించగా, పనులు వేగవంతం చేయాలని చెప్పారు. జాతీయ రహదారులకు సంబంధించి భూ సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఆర్డీవోలను ఆదేశించారు. ఆయా భూముల్లో ఏమైనా సర్వే పనులను వెంటనే పూర్తి చేయాలని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అధికారులకు సూచించారు. భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడంలో ఆయా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, నిమ్జ్‌, నేషనల్‌ హైవే అథారిటీ, ఆర్‌అండ్‌బీ, టీఎస్‌ఐఐసీ, కాళేశ్వర్‌, సింగూర్‌ నీటి పారుదల శాఖ అధికారులు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు. 


logo