బుధవారం 25 నవంబర్ 2020
Sangareddy - Nov 01, 2020 , 00:37:25

ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాము

ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాము

ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ రాజర్షి షా

సంగారెడ్డి మున్సిపాలిటీ : ప్రతి వార్డులోని ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి అధ్యక్షతన మున్సిపల్‌ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 27వ వార్డు సభ్యురాలు మంజులతానాగరాజుగౌడ్‌ మాట్లాడుతూ వార్డుల్లో నూతన విద్యుత్‌ పోల్స్‌ వేయించాలన్నారు. 18వ వార్డు కౌన్సిలర్‌ అశ్విన్‌కుమార్‌, 29 వార్డు కౌన్సిలర్‌ పవన్‌నాయక్‌ మాట్లాడుతూ వార్డుల్లో సకాలంలో చెత్త బండ్లు రావట్లేదని, వార్డుల్లోని పలు ప్రాంతాల్లో చెత్తను తొలిగించాలని కోరారు. వార్డుల్లో పైప్‌లైన్‌ వేయించాలని, గణేశ్‌నగర్‌, మోర్‌ సూపర్‌ మార్కెట్‌ వెనకాల చెత్తను తొలిగించాలని తెలిపారు. 26వ వార్డు కౌన్సిలర్‌ మాట్లాడుతూ టెండర్లు వేయకుండానే మున్సిపల్‌ సిబ్బంది తాయ్‌బజార్‌ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. వార్డుల్లో బోర్లకు మరమ్మతులు చేయించాలన్నారు. 34వ వార్డు కౌన్సిలర్‌ షమీ మాట్లాడుతూ వార్డుల్లో కొంతకాలంగా మంజీర తాగునీరు రావడంలేదని తెలిపారు. అనంతరం ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జేసీబీ, ట్రాక్టర్లు డంపింగ్‌యార్డు నిర్మాణ పనుల్లో ఉన్నాయని, అందుకే కొంత ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. అనంతరం ఏజెండాలోని అంశాలను వివరించడంతో సభ్యులు అంగీకారం తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ శంకరి లతావిజయేందర్‌రెడ్డి, కౌన్సిల్‌ సభ్యులు, టీపీవో లక్ష్మీనారాయణ, ఏఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.