ఆదివారం 29 నవంబర్ 2020
Sangareddy - Oct 31, 2020 , 00:16:20

రైతు వేదికలు సిద్ధం

రైతు వేదికలు సిద్ధం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 319 వ్యవసాయ క్లస్టర్లు

190 రైతు వేదికల నిర్మాణం పూర్తి

రైతుల సంఘటితానికి దోహదం

పలుచోట్ల ముందుకు వచ్చిన దాతలు

అన్ని సౌకర్యాలతో నిర్మాణం

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: 

రైతు వేదికల నిర్మాణం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వేగంగా కొనసాగుతున్నది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో రైతు వేదికలు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతు వేదికలను ప్రారంభించనున్న నేపథ్యంలో రైతాంగంలో ఆసక్తి నెలకొన్నది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలో మొత్తం 319 రైతు వేదికల నిర్మాణం చేపట్టారు. ఇందులో ఇప్పటి వరకు 190 వరకు పూర్తి కాగా, మిగతా వాటి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నావి. 5 వేల ఎకరాలను ఒక వ్యవసాయ క్లస్టర్లుగా విభజించి వ్యవసాయ విస్తరణ అధికారిని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. ఒక్కో వ్యవసాయ క్టస్టర్‌కు ఒక్కో రైతు వేదికను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మిస్తున్నది. 

సంగారెడ్డి జిల్లాలో...

సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రైతు వేదికల నిర్మాణం పూర్తి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ జిల్లాలో 116 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా, అన్నిచోట్ల రైతు వేదికల నిర్మాణం మొదలైంది. శుక్రవారం సాయంత్రం వరకు 100 వేదికల నిర్మాణం పూర్తయ్యింది. 


మెదక్‌ జిల్లాలో...

మెదక్‌ జిల్లాలో 76 వ్యవసాయ క్లస్టర్లలో 30 వేదికల నిర్మాణం పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కలెక్టర్‌ హన్మంతరావు రైతు వేదికల పూర్తిపై ప్రత్యేక దృష్టిసారించారు. శుక్రవారం ఆయన పలుచోట్ల పనులను సైతం పరిశీలించారు.

సిద్దిపేట జిల్లాలో...

సిద్దిపేట జిల్లాలో 127 వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం మొదలుకాగా, 60 చోట్ల పూర్తయ్యాయి. మిగతా చోట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. కలెక్టర్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఒక్కోటి రూ.22 లక్షలతో నిర్మాణం...

ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.22 లక్షలు వెచ్చిస్తున్నది. చాలా గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులకు తోడు మరిన్ని సొంత నిధులు చేర్చి చాలాచోట్ల అద్భుతమైన రీతిలో రైతు వేదికలను నిర్మిస్తున్నారు. ఈ వేదికల్లో వెయ్యి నుంచి పదిహే ను వందల మంది రైతులు కూర్చునే విధంగా విశాలమైన మీటింగ్‌ హాల్‌, వంటశాల, వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో) కార్యాలయం, పార్కింగ్‌ స్థలం ఉంటుంది. రైతు వేదికల నిర్మాణం పూర్తయిన తర్వాత క్లస్టర్‌ పరిధిలోని రైతులంతా ఒకే వేదికపై పంటల సాగు, విత్తనాల ఎంపిక, పంటలపై పురుగు మందుల పిచికారీపై వ్యవసాయ అధికారుల నుంచి అవగాహన పొందే వీలుంటుంది. ఎప్పటికప్పుడు రైతులకు సమావేశాలు ఏర్పాటు చేసి సాగు విధానాలు, పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేయనున్నారు. మొత్తంగా సీఎం కేసీఆర్‌ సారథ్యంలో నిర్మాణమవుతున్న రైతు వేదికలు అన్నదాతలకు ఉపయోగకరంగా మారనున్నాయి. రైతులకు ఒక వేదికను సమకూర్చి వారిని సంఘటితం చేయనున్నాయి.