ఆదివారం 29 నవంబర్ 2020
Sangareddy - Oct 29, 2020 , 00:08:43

గీతం విద్యార్థుల జాక్‌పాట్‌

గీతం విద్యార్థుల జాక్‌పాట్‌

టీసీఎస్‌కు 37 మంది ఎంపిక, 

డిజిటల్‌ వార్షిక వేతనం రూ.7లక్షలు

పటాన్‌చెరు : టీసీఎస్‌కు 37మంది గీతం విద్యార్థులు ఎంపికయ్యారని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ టీసీఎస్‌ డిజిటల్‌ ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 37మంది గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఎంపికైనట్లు వారు తెలిపారు. టీసీఎస్‌తో ‘గీతం’కు ఉన్న విద్యా సంబంధాలు, ప్రత్యేక అవగాహన వల్ల ఇది సాకారమైనట్లు తెలిపారు. ఈ నియామకాల్లో 10మంది టీసీఎస్‌ డిజిటల్‌, 27మంది టీసీఎస్‌ నింజాకు ఎంపికయ్యారన్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో ప్రీ ప్లేస్మెంట్‌ టాక్‌, కోడింగ్‌లో ఆన్‌టైన్‌ పోటీ పరీక్షల తరువాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు వివరించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది పలు నియామకాలు ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతున్నాయన్నారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌, కృత్రిమ మేథ, మెషిన్‌ లెర్నింగ్‌, బిగ్‌ డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, రోబోటిక్స్‌ వంటి పలు అత్యాధునిక సాంకేతికలతో కూడిన ప్రాజెక్టుల్లో ఎంపికైన విద్యార్థులు పని చేస్తారన్నారు. టీసీఎస్‌ డిజిటల్‌కు ఎంపికైన బీటెక్‌ విద్యార్థులు రూ.7లక్షలు, పీజీ విద్యార్థులకు రూ.7.33లక్షల వార్షిక వేతనం అందుకోబోతున్నారని గీతం ప్రతినిధులు తెలియజేశారు. గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎన్‌.శివప్రసాద్‌, రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, టీఅండ్‌పీ డైరెక్టర్‌ నాతి వేణుకుమార్‌ తదితరులు టీసీఎస్‌కు ఎంపికైన విద్యార్థులను అభినందించినట్లు పేర్కొన్నారు.