గురువారం 28 జనవరి 2021
Sangareddy - Oct 29, 2020 , 00:08:41

రైతు వేదికలను అందంగా తీర్చిదిద్దాలి

రైతు వేదికలను అందంగా తీర్చిదిద్దాలి

సంగారెడ్డి టౌన్‌ : జిల్లాలో రైతు వేదిక నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, అందంగా తీర్చిదిద్దాలని సంగారెడ్డి  కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డిలతో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్లతో రైతు వేదికల పనుల పురోగతిపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు సుమారు 80శాతం పూర్తయ్యాయన్నారు. రైతు వేదికలకు విద్యుత్‌ కనెక్షన్లు పూర్తి స్థాయిలో ఇవ్వాలని ఎస్‌ఈకి ఆదేశించారు. అదే విధంగా మిషన్‌ భగీరథ నీటి కనెక్షన్లు కూడా పూర్తి చేయాలన్నారు. రైతు వేదికల చుట్టూ పచ్చదనం సంతరించుకునే విధంగా మూడు వరుసల్లో గ్రీన్‌ వాల్‌ మాదిరి ప్లాంటేషన్‌ చేయాలని ఎంపీడీవోలకు సూచించారు. రైతు వేదికల చుట్టూ మట్టి నింపాలని, అందుకు గ్రామ సర్పంచ్‌, కాంట్రాక్టర్లతో అనుసంధానం చేసుకుని పని చేయాలన్నారు. ప్లాంటేషన్‌కు గ్రామపంచాయతీ గ్రీన్‌ బడ్జెట్‌ నుంచి నిధులను వినియోగించాలని, రైతు వేదికల్లో ఫర్నిచర్‌ ఏర్పాటుకు ప్రణాళిక చేయాలన్నారు. ఈ సమావేశంలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రవికుమార్‌, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో శ్రీనివాస్‌రావు, అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్‌ డీఈలు, వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు. 


logo