శుక్రవారం 27 నవంబర్ 2020
Sangareddy - Oct 28, 2020 , 00:05:32

యాసంగి సాగుకు అన్నదాత రెడీ

యాసంగి సాగుకు అన్నదాత రెడీ

పంటల ప్రణాళికను తయారు చేసిన వ్యవసాయ శాఖ  అధికారులు 

ఆరుతడి పంటల సాగుకు రైతుల ఆసక్తి

14,032 ఎకరాల్లో శనగ పంట సాగుకు 3,508 టన్నుల విత్తనాలు అందజేత

1,270.9 మెట్రిక్‌ టన్నుల యూరియా, 604.45 మెట్రిక్‌ టన్నుల డీఏపీ  సిద్ధం

తెల్ల జొన్న 2,408 ఎకరాలు.. ఆలుగడ్డ 3,390 ఎకరాల్లో సాగుకు రెడీ

జహీరాబాద్‌ :  వానకాలం వేసిన పంటలు మంచి దిగుబడులు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, యాసంగి పంటలు సాగు చేసేందుకు సర్కారు రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేసింది. రైతుల అవసరాలకు అనుగుణంగా అధికారులు శనగ విత్తనాలు సరఫరా చేశారు. యాసంగిలో రైతులు పంటలు సాగు చేసేందుకు సర్కారు ప్రణాళిక సిద్ధం చేసింది. జహీరాబాద్‌ డివిజన్‌లో ఆలుగడ్డ 3390 ఎకరాలు, కూరగాయలు 1409, చెరుకు 1308, జొన్న 2408, ఇతర పంటలు 2321 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జహీరాబాద్‌ డివిజన్‌లో 10443 వ్యవసాయ బావులు, బోరులు ఉన్నాయని, వాటి ద్వారా ఆరుతడి పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. చిన్న నీటి వనరులు 78 ఉన్నాయని, వాటి ద్వారా సాగు చేసే ఆవకాశం ఉందని తెలిపారు. యాసంగిలో రైతులకు యూరియా 1270.9 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 604.45 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువు 604.45 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 604.45 మెట్రిక్‌ టన్నులు పంపిణీకి సిద్ధంగా ఉంచారు. జహీరాబాద్‌ డివిజన్‌లో అధికంగా రైతులు యాసంగిలో శనగ పంట సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతులు అధికంగా శనగ విత్తనాలు సాగు చేసేందుకు ఆసక్తి చూపడంతో వ్యవసాయ శాఖ అధికారులు అవసరమైన విత్తనాలు పంపిణీ చేశారు. జహీరాబాద్‌, మొగుడంపల్లి, కోహీర్‌, న్యాల్‌కల్‌, ఝరాసంగం మండలంలోని ప్రధాన గ్రామాల్లో శనగ విత్తనాలు పంపిణీ చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. ఇటీవల వర్షాలు కురవడంతో  యాసంగి పంటలు సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. వానకాలంలో రైతులు సాగు చేసిన పెసర, మినుము, సోయా పంటలు సాగు చేశారు. యాసంగిలో శనగ, తెల్లజొన్నతోపాటు ఇతర ఆరుతడి పంటలు సాగు చేసేందుకు భూములు సిద్ధం చేసుకుంటున్నారు. వానకాలంలో సాగు చేసిన పంటలు రైతులకు మేలు చేయడంతో యాసంగిలో అధికంగా పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. యాసంగి సాగుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసి వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు, ఎరువులు ముందుగానే సరఫరా చేశారు.  

రైతులకు శనగ విత్తనాల అందజేత..

జహీరాబాద్‌ వ్యవసాయ శాఖ సబ్‌ డివిజన్‌లోని జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌, కోహీర్‌, ఝరాసంగం మండలంలో రైతులకు అధికారులు శనగ విత్తనాలు పంపిణీ చేశారు. జహీరాబాద్‌ ప్రాంతంలో రైతులు యాసంగిలో అధికంగా శనగ పంటను సాగు చేస్తారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ల కేంద్రాల్లో రైతులకు విత్తనాలు అందజేశారు. వానలు పుష్కలంగా కురువడంతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలో నీరు నిల్వ ఉంది. మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడంతో వ్యవసాయ బావుల్లో సైతం నీటిమట్టం భారీగా పెరిగింది. వ్యవసాయ బావులు, బోర్లకు జలకళ సంతరించుకుంది. ఈ ఏడాది యాసంగి పంటలు సాగు చేసేందుకు రైతులకు నీటి సమస్య లేకుండా పోయింది. యాసంగిలో వ్యవసాయ పంటలు సాగు చేసే రైతులకు కరెంట్‌ సమస్య లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రైతులకు 24 గంటల కరెంట్‌ సరఫరా చేయడంతో వ్యవసాయ బావులు, బోరుల వద్ద పంటలు సాగు చేసేందుకు భూములు సిద్ధం చేస్తున్నారు. 

జహీరాబాద్‌ డివిజన్‌లో యాసంగిలో శనగ సాగు ప్రణాళిక

మండలం        శనగ పంట సాగు         విత్తనాలు 

            (ఎకరాల్లో)       (టన్నులు)

----------------------------------

ఝరాసంగం          1406        351.1

కోహీర్‌                 7350                  1837.5

మొగుడంపల్లి         1560                  390

న్యాల్‌కల్‌              2616                  654

జహీరాబాద్‌          1100                  275

-----------------------------------

మొత్తం                 14032       3508

అందుబాటులో విత్తనాలు, ఎరువులు 

రైతులకు అవసరమైన విత్తనాలను అందజేశాం. యాసంగిలో రైతులకు ఎలాంటి విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం సీజన్‌కు ముందుగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేసింది. ప్రతి మం డలంలో అందుబాటులో విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాం. ఎక్కడా విత్తనాలు, ఎరువుల కొ రత లేకుండా ప్రభుత్వం సరఫరా చేసింది. వర్షాలు పుష్కలంగా కురువడంతో పంట సాగు పెరిగే అవకాశం ఉంది. 

- భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్‌ 

యాసంగి సాగుకు సిద్ధం..

యాసంగిలో పంటలు సాగు చేసేందుకు సర్కారు శనగ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచింది. వానకాలంలో అంతర్‌ పంటగా కంది సాగు చేసిన. సర్కారు శనగ విత్తనాలు సరఫరా చేయడంతో సాగుకు భూమిని సిద్ధం చేశా. పంటల సాగుకు ప్రభుత్వం రైతుబంధు డబ్బులతోపాటు విత్తనాలు, ఎరువులు అందజేసింది. పంటలు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించింది. 

- నారాయణ, రైతు, అనెగుంట 

సర్కారు సహాయంతో రెండు పంటలు..

యాసంగిలో పంటలు సాగు చేసేందుకు భూములు సిద్ధం చేశాం. సర్కారు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతో ఎలాంటి ఇబ్బందులు లేవు. సర్కారు రైతుల కోసం అమ లు చేస్తున్న పథకాలతో రెండు పంటలు పండిస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్‌తో రైతులకు ఎంతో మేలు కలుగుతోంది. ఈ ఏడాది వర్షాలు బాగా కురిశాయి. వ్యవసాయ బావులు, బోర్లలో పుష్కలంగా నీరు ఉంది. 

- విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు, పస్తాపూర్‌