ఆదివారం 29 నవంబర్ 2020
Sangareddy - Oct 28, 2020 , 00:05:27

కొనుగోలు కేంద్రం వద్ద వివరాల ఫ్లెక్సీలు పెట్టాలి

కొనుగోలు కేంద్రం వద్ద వివరాల ఫ్లెక్సీలు పెట్టాలి

రైస్‌ మిల్లుల్లో సిట్టింగ్‌ అధికారులతో పర్యవేక్షణ

కేంద్రాల్లో యంత్రాలు, టార్పాలిన్లు ఉండాలి

అదనపు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

మొక్కజొన్న సాగు వివరాలను సిద్ధం చేయండి

రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలి

కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 

సంగారెడ్డి : రైతులు కష్టపడి పండించిన ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం బాధ్యతలు తీసుకున్న అనంతరం అదనపు కలెక్టర్లతో కలిసి అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకు ముందు పుల్కల్‌ మండల ఏఈవోలతో ఫోన్‌లో మాట్లాడి సంబంధిత ఏఈవో పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి.. ఆ గ్రామాల్లో ఎంత మంది రైతులు ఉన్నారు.. ఎన్ని ఎకరాలు సాగవుతున్నది. వరి సాగు ఎంత.. కోతకు వచ్చాయా.. ఎన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు... వసతులన్నీ ఉన్నాయా.. అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్లస్టర్‌ వారీగా సాగైనా పంట వివరాలు, రైతుల వివరాలు ప్రతి ఏఈవో దగ్గర ఉండాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన అవసరాలపై ముందస్తు ప్రణాళికలతో ఉన్నతాధికారులను మండలాల వారీగా నియమిస్తూ,  రైతుల సంఖ్య, విస్తీర్ణం, రైతు బ్యాంకు ఖాతాల ఆధారంగా ఆయా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆర్డీవోలు, జిల్లా అదనపు కలెక్టర్లు,  అధికారులు రోజు వారీగా కొనుగోలు కేంద్రాల్లో పర్యవేక్షణ చేస్తూ తేదీ, సమయం, రైతుకు బ్యాంకు ఖాతాలో డబ్బు జమయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోని రైస్‌ మిల్లుల్లో సిట్టింగ్‌ అధికారులు లారీలో ఎంత లోడు, అన్‌లోడు అవుతున్నదో నమోదు చేసుకోవాలన్నారు. హమాలీల సమస్య, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమస్యలు లేకుండా చూడాలన్నారు. వారం రోజులకు నిల్వ ఉండేలా గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. 

కేంద్రాల  వద్ద యంత్రాలు, టార్పాలిన్లు..

కొనుగోలు కేంద్రాల వద్ద తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, వేయింగ్‌ మిషన్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులకు         సూచించారు. క్షేత్రస్థాయిలో ఆర్డీవోలు, జిల్లాస్థాయి అధికారులు, అదనపు కలెక్టర్లు నిత్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ధాన్యం నిల్వకు ట్యాగ్‌ చేయాలని, ఆర్డీవోలు సిట్టింగ్‌ అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. అవసరమైతే జిల్లాలో పది నుంచి పదిహేను కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఏఈవో క్లస్టర్‌ వారీగా సాగైన ఏరియా వివరాల మేరకు కొనుగోలు కేంద్రాలు ఉండేలా చూడాలన్నారు. ఎంపీడీవో, ఏపీఎం, మండల వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లకు కొనుగోలు కేంద్రాలను కేటాయించి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలన్నారు. మిల్లర్లకు అవగాహన కల్పిస్తూ చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని, ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. మొక్కజొన్న సాగు వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, రైతుల వివరాలను సేకరించాలని తెలిపారు. 

రైతు వేదికలను పూర్తి చేయాలి.. 

 క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.  సంబంధిత ఈఈని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేదికలకు వాటర్‌ కనెక్షన్‌, విద్యుత్‌, ప్రహరీ, మొక్కలు నాటడం వంటి పనులన్నీ  పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలు తుది దశలో ఉన్నవాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, డీఆర్వో రాధిక రమణి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నర్సింగరావు, డీఆర్డీవో శ్రీనివాస్‌ రావు, ఆర్టీవో శివలింగయ్య, డీసీవో ప్రసాద్‌, డీఏసీవో శ్రీకాంత్‌రెడ్డి, డీఎం సివిల్‌ సప్లయ్‌ అధికారి సుగుణా బాయ్‌, ఆర్డీవోలు పాల్గొన్నారు.

సంగారెడ్డి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్రామ్‌రెడ్డి

సంగారెడ్డి : బదిలీపై వచ్చిన కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మంగళవారం ఉదయం 12 గంటలకు సంగారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్‌ బృందం సభ్యులు తరలివచ్చి కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సన్మానాల వంటివి లేకుండా సాదాసీదాగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్‌ సభ్యులు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.