ఆదివారం 29 నవంబర్ 2020
Sangareddy - Oct 24, 2020 , 00:22:16

దసరా వేడుకలకు పరిశ్రమలు ముస్తాబు

దసరా వేడుకలకు పరిశ్రమలు ముస్తాబు

పండుగకు ఒకరోజు ముందు పూజలు

బోనస్‌తో పరిశ్రమల్లో సందడి

కనిపిస్తున్న కరోనా ప్రభావం

తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆశాజనకంగా ఉత్పత్తులు

పటాన్‌చెరు: దసరా వేడుకలు పరిశ్రమల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది విజయదశమికి ఒకరోజు ముందు పరిశ్రమలు కార్మికులతో కలిసి ఆయుధపూజ నిర్వహిస్తాయి. ఆనవాయితీ ప్రకా రం పరిశ్రమల్లో ఉన్న యంత్రాలు, కంప్యూటర్లు, ఇతర సామగ్రికి, వాహనాలకు పూజలు చేస్తారు. ఏడాదంతా ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా దుర్గామాత కాపాడాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మేరకు శనివారం పరిశ్రమల్లో పూజలు జరుగనున్నాయి. పరిశ్రమలను విద్యుత్‌ దీపాలు, పూలతో అలంకరించి వేడుకలు నిర్వహించేందుకు కార్మికులు, సిబ్బంది, యాజమాన్యాలు సన్నద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో  పం డుగకు పరిశ్రమలు బోనస్‌ ప్రకటించి ఇస్తాయి. శనివారం ప్రముఖ పరిశ్రమన్నీ బోనస్‌ అందిస్తున్నాయి. ఈ ఏడాది కొవిడ్‌-19 కారణంగా పరిశ్రమల్లో ఉత్పత్తులు తగ్గుముఖం పట్టాయి. లాక్‌డౌన్‌ సమయంలో కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కొవిడ్‌ కారణంగా పరిశ్రమలు మూతపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రోత్సాహాన్ని ఇచ్చింది. కార్మికులు సజావుగా పరిశ్రమలకు వెళ్లేలా పోలీసులు సహకరించారు. దీంతో పరిశ్రమలు తిరిగి ప్రారంభమయ్యాయి.

విద్యుత్‌ జిగేల్‌.. 

తెలంగాణ రాకముందు పరిశ్రమల్లో వేసవిలో కరెంట్‌ కోతలుండేవి. సమైక్య పాలనలో వారంలో మూడు రోజులు విద్యుత్‌కోత ఉండటం పరిశ్రమలు చవిచూశాయి. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్‌ కోతలే లేకుండా పోయాయి. నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తుండటంతో పరిశ్రమలు మూడు షిప్టులు ఉత్పత్తులు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో సమస్యలు ఎదుర్కొన్నా మిగతా సమయంలో పరిశ్రమలు పుంజుకుని ఉత్పత్తి చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకంతో ఆశాజనకమైన ఫలితాలే పరిశ్రమలు చూస్తున్నాయి. దీంతో కార్మికులకు బోనస్‌ ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో పరిశ్రమల్లో జోష్‌ ఉండబోతున్నది. ఇదే సందర్భంలో కొవిడ్‌-19 నిబంధన ప్రకారం కేవలం కార్మికులను మాత్రమే ఆహ్వానిస్తుండటం కనిపిస్తున్నది. గతంలో కుటుంబ సభ్యులతో సహా పరిశ్రమల్లోకి పిలిచి దసరా సంబురాలు నిర్వహించేవారు.