శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sangareddy - Oct 23, 2020 , 01:14:32

చెరుకు రైతుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

చెరుకు రైతుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

  • కార్మికులకు జీతాలు ఇవ్వాలని ఆమరణ దీక్ష
  • ఆమరణ దీక్ష చేస్తున్న టీఆర్‌ఎస్‌ నేత నామ రవికిరణ్‌, కార్మిక సంఘం నాయకుడు జగదీశ్వర్‌
  • దీక్షకు పలు సంఘాలు, రైతుల మద్దతు
  • రెండో రోజుకు చేరిన ఆమరణ దీక్ష

జహీరాబాద్‌ : చెరుకు రైతులకు పెండింగ్‌ బకాయిలు చెల్లించి, కార్మికుల పెండింగ్‌ జీతాలు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ కౌన్సిలర్‌ నామ రవికిరణ్‌, కార్మిక నాయకులు జగదీశ్వర్‌లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. గురువారం జహీరాబాద్‌ మండలంలోని కొత్తూర్‌(బీ) ట్రైడెంట్‌ చక్కెర పరిశ్రమ గేటు ఎదుట రైతులు, కార్మికుల మద్దతుతో టీఆర్‌ఎస్‌ నాయకులు నామ రవికిరణ్‌, కార్మికుడు జగదీశ్వర్‌ రెండు రోజులుగా దీక్ష చేస్తున్నారు. దీక్ష చేస్తున్న వారికి పలు పార్టీల నాయకులు, రైతులు, ఉద్యోగులు, కుల సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. గతేడాది ట్రైడెంట్‌ చక్కెర పరిశ్రమకు చెరుకు సరఫరా చేసిన రైతులకు యాజమాన్యం రూ.12 కోట్లకు పైగా డబ్బులు చెల్లించాలన్నారు. ఏడాది గడిచినా యాజమాన్యం  డబ్బులు చెల్లించలేదన్నారు. యాజమాన్యానికి మంత్రి హరీశ్‌రావు, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, కలెక్టర్‌ హనుమంతరావులతో సమావేశాలు నిర్వహించి పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. రైతులు, కార్మికుల సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేస్తామని ప్రకటించారు. దీక్షకు జహీరాబాద్‌, న్యాల్‌కల్‌, మొగుడంపల్లి, కోహీర్‌, ఝరాసంగం మండలాలకు చెందిన రైతులు, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.

దీక్ష చేస్తున్నవారికి వైద్య పరీక్షలు...

టీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ కౌన్సిలర్‌ నామ రవికిరణ్‌, కార్మిక నాయకుడు జగదీశ్వర్‌కు జహీరాబాద్‌ ఏరియా వైద్యులు సునీల్‌కుమార్‌ వైద్య పరీక్షలు చేశారు. దీక్ష శిబిరం వద్ద ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండో రోజు దీక్షకు రైతులు, కుల సంఘాలు, కార్మికులు మద్దతు తెలుపుతూ భారీగా తరలివచ్చారు. 

ట్రైడెంట్‌ వాహనాలను సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు..

కొత్తూర్‌(బీ) గ్రామంలోని ట్రైడెంట్‌ చక్కెర పరిశ్రమ వాహనాలను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. రైతులకు పెండింగ్‌ బిల్లులు, కార్మికులకు జీతాలు చెల్లించాలని నోటీసులు జారీ చేసినా యాజమాన్యం స్పందించకపోవడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు జహీరాబాద్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నందకిశోర్‌ వాహనాలను సీజ్‌ చేసి, తహసీల్‌ కార్యాలయానికి తరలించారు.