శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sangareddy - Oct 22, 2020 , 00:39:43

వరద బాధితులకు రూ.10 వేల ప్రభుత్వ సాయం

వరద బాధితులకు రూ.10 వేల ప్రభుత్వ సాయం

బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు : వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధితులకు రూ.10 వేల తక్షణ సాయాన్ని అందజేస్తోందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్‌చెరు డివిజన్‌లోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద వరద బాధితులకు రూ.10 వేల చొప్పున 12 కుటుంబాలకు డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వందేళ్ల క్రితం హైదరాబాద్‌ నగరంలో వరదలు ముంచెత్తాయని, ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ భారీ వరదలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని అరికట్టామన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ తక్షణ సాయం కింద రూ.550 కోట్లు విడుదల చేశారని చెప్పారు. వరదలతో నష్టపోయిన వారికి రూ.10 వేల చొప్పున ప్రాథమికంగా ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ చాలా వేగంగా స్పందించి ముందుగా నష్టపోయినవారికి ఆర్థిక సాయం అందజేస్తున్నారన్నారు. నష్టపోయిన ప్రతి పౌరుడికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పార్టీలకతీతంగా అందరూ హైదరాబాద్‌ వాసులకు అండగా నిలుద్దామన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఆస్తి నష్టం, ఆర్థిక నష్టం జరిగిందన్నారు. మానవతావాదులు స్పందించి నష్టపోయినవారికి సాయం చేయాలని కోరారు. ఆయన వెంట ఆర్సీపురం మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు విజయ్‌కుమార్‌, ఆదర్శ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, దశరథరెడ్డి, మెట్టు కుమార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

రామచంద్రాపురంలో..

రామచంద్రాపురం : వరద బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్‌లో వరద బాధితులకు రూ.10 వేల చొప్పున ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా నీట మునిగిన కాలనీవాసులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఇల్లు కూలిన వారికి రూ.లక్ష, పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న వారికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ అంజయ్య, నాయకులు పరమేశ్‌యాదవ్‌, ఆదర్శ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సత్తిరెడ్డి, ఐలేశ్‌, ఉపకమిషనర్‌ బాలయ్య తదితరులు ఉన్నారు. 

గ్రామాల అభివృద్ధే లక్ష్యం 

గుమ్మడిదల : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని దోమడుగులో రూ.34 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో మంచినీటి ట్యాంక్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం రూ.రెండున్నర లక్షల జీపీ నిధులతో అండ్‌గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజశేఖర్‌, ఎంపీపీ ప్రవీణాభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, ఎంపీటీసీ గోవర్ధన్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.