బుధవారం 25 నవంబర్ 2020
Sangareddy - Oct 22, 2020 , 00:36:57

దసరా ఇండ్లలోనే నిర్వహించుకోవాలి

దసరా ఇండ్లలోనే నిర్వహించుకోవాలి

కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలి

డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్‌ 

సంగారెడ్డి మున్సిపాలిటీ: దసరా సంబురాల్లో ప్రజలు కొవిడ్‌-19 సూచనలు పా టించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ మోజీ రాం రాథోడ్‌ తెలిపారు. బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలోని తన చాం బర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొవిడ్‌-19 నియంత్రణకు తీసుకోవాల్సిన తగు సూచనలు చేశారు. సాధ్యమైనంత వరకు ప్రజలు గుమికూడవద్దన్నారు. దసరా పండుగను ఇండ్లలోనే జరుపుకోవాలని తెలిపారు. పండుగను కొద్ది మందితో నిర్వహించుకోవాలని సూచించారు. ఆరు అడుగుల భౌతిక దూ రాన్ని పాటిస్తూ మాస్క్‌లు ధరించాలన్నారు. చేతులను తరచూ శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలని సూచించారు. బతుకమ్మ ఆడే మహిళలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని తెలిపారు.  రావణ దహనం సమయంలో ప్రజలు గుమికూడరాదని, తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. షమీ పూజ సమయంలో భౌతిక దూరం పాటిస్తూ పూజా కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. పండుగ రోజు సాయంత్రం ఒకరికొకరు ఆలింగనం చేసుకునే సాంప్రదాయాన్ని మానుకోవాలని సూచించారు. షమీ ఆకులను తీసుకుని ఇంటింటికీ తిరిగి శుభాకాంక్షలు తెలిపే పద్ధతిని ఈ సారి మానుకోవాలని స్పష్టం చేశారు. దుర్గామాత పూజా కార్యక్రమం, అమ్మవారి నిమజ్జన ఉత్సవాల్లో కొద్ది మంది మాత్రమే పాల్గొనాలన్నారు. వర్షాలు విస్తారంగా కురుస్తున నేపథ్యంలో  అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రజలు నీటిని వేడిచేసి చల్లారిన తర్వాత తాగాలని తెలిపారు. వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ఇంటి ఆవరణం, ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. దోమలు నిల్వకుండా  జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో తాగునీటి పైప్‌లైన్‌ లీకేజీలను మరమ్మతులు చేయించాలని సూచించారు. తాగునీటి ట్యాంకులను క్లోరినేషన్‌ తప్పనిసరిగా చేయాలని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటిస్తూ దోమల వ్యాప్తి చెందకుండా అరికట్టాలని తెలిపారు. ఆరోగ్య సమస్యలు వస్తే దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని డీఎంహెచ్‌వో సూచించారు.