శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sangareddy - Oct 21, 2020 , 00:39:08

వరద బాధితుల కోసం రూ.550 కోట్లు విడుదల

వరద బాధితుల కోసం రూ.550 కోట్లు విడుదల

కొత్త కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తాం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు : వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని, సీఎం కేసీఆర్‌ వరద బాధితులను ఆదుకునేందుకు రూ.550 కోట్లు విడుదల చేశారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్‌చెరు జీహెచ్‌ఎంసీ డివిజన్‌ పరిధిలో నూతనంగా ఏర్పాటైన పలు కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా నందన్‌ హోమ్స్‌, రతన్‌ హోమ్స్‌, సింఫానీ హోమ్స్‌ కాలనీల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన ఇండ్లను పరిశీలించారు. రియల్టర్ల తప్పిదాలకు తాము మూల్యం చెల్లించుకుంటున్నామని కాలనీవాసులు  వాపోయారు. మౌలిక వసతులను రియల్టర్లు కల్పించకపోవడంతో కాలనీల్లో ముంపు సమస్య తలెత్తిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త కాలనీల్లోకి వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటామన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అందరం కలిసికట్టుగా పోరాడుదామని సూచించారు. ప్రతి డివిజన్‌లో నష్టపోయినవారిని ఆదుకుంటామన్నారు. వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు. మారుమూల గ్రామాలకు సైతం మౌలిక వసతులు కల్పించామని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రతి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామన్నారు.  కాలనీవాసుల సహకారంతోనే అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఆర్సీపురం మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు విజయ్‌కుమార్‌, అధికారులు, ఆయా కాలనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ప్లడ్‌ లైట్ల ఏర్పాటుతో రోడ్డు ప్రమాదాలకు చెక్‌ 

గుమ్మడిదల : జాతీయ ప్రధాన రహదారిపై ప్లడ్‌లైట్లు ఏర్పాటు చేయడంతో రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పెట్టవచ్చని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన గుమ్మడిదల, బొంతపల్లి, దోమడుగు, అన్నారం మీదుగా ఉన్న 765డీ జాతీయ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ప్లడ్‌ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. మూడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన జంక్షన్‌ బాక్స్‌లో స్విచ్చాన్‌ చేసి విద్యుత్‌ దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 765డీ జాతీయ రహదారితో గుమ్మడిదల మండలానికి కొత్తశోభ సంతరించుకుందన్నారు. మేజర్‌ గ్రామ పంచాయతీలు, పారిశ్రామిక వాడలు పట్టణాలుగా తలపిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణాభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, సర్పంచ్‌లు చిమ్ముల నర్సింహారెడ్డి, తిరుమలవాసు, ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, మమతావేణు రాజశేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, మండల యువత అధ్యక్షుడు నరహరి, ఆలయ కమిటీ చైర్మన్‌ గటాటి భద్రప్ప, నాయకులు తదితరులు పాల్గొన్నారు.