శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sangareddy - Oct 21, 2020 , 00:39:08

అన్నపూర్ణదేవీగా అమ్మవారు

అన్నపూర్ణదేవీగా అమ్మవారు

అందోల్‌ : దేవీ నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మండపాల్లో కొలువైన అమ్మవార్లు భక్తులచే ఘనంగా పూజలందుకుంటున్నారు. అందోల్‌-జోగిపేట మున్సిపాలిటీతోపాటు అందోల్‌, వట్‌పల్లి మండల్లాలో ప్రతిష్ఠించిన విగ్రహాల వద్ద భక్తులు దేవతామూర్తులకు భక్తిశద్ధలతో పూజలు చేస్తున్నారు. మంగళవారం అమ్మవారు అన్నపూర్ణదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఖాదీరాబాద్‌లో ప్రతిష్ఠించిన అమ్మవారిని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ గంగాధర్‌, ఎంపీడీవో గీత, నాయకులు పాల్గొన్నారు. 

రాయికోడ్‌లో..

రాయికోడ్‌ : మూమ్మదేవి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మండల కేంద్రమైన రాయికోడ్‌లో మూమ్మదేవి ఆలయంలో అమ్మవారిని ఆలయ నిర్వాహకులు పట్టువస్ర్తాలతో అందంగా అలంకరించారు. అమ్మవారు అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పూజల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 

అమీన్‌పూర్‌లో..

అమీన్‌పూర్‌ : మున్సిపాలిటీ పరిధిలోని కట్ట మైసమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తుమ్మల ప్రతాపరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రాజరాజేశ్వరీ అవతారంలో అలంకరించారు. అమీన్‌పూర్‌లో సుమారుగా 20 మంది వరకు భక్తు లు అమ్మవారి మాలలను ధరించి ప్రత్యేక పూజలు చేశారు.