శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sangareddy - Oct 21, 2020 , 00:39:06

రైతు వేదికల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

రైతు వేదికల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి 

రైతు వేదికల నిర్మాణ పనులను 

పరిశీలించిన అదనపు కలెక్టర్‌, ఆర్డీవో విక్టర్‌ 

అందోల్‌ : రైతు వేదికల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి కాంట్రాక్టర్లకు సూచించారు. మంగళవారం వట్‌పల్లి మండలంలో నిర్మిస్తున్న రైతు వేదికలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తుందన్నారు. గడువు సమీపిస్తుండడంతో నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయించేందుకు అధికార యంత్రాంగం గ్రామాల్లో పర్యటిస్తున్నదన్నారు. ప్రతిరోజు అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నా.. పనులు మాత్రం ఆశించినంతగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. దసరా వరకు మిగిలిన పనులు పూర్తి కావాలని చెప్పారు. మరోవైపు అందోల్‌ మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులను అందోల్‌-జోగిపేట ఆర్డీవో విక్టర్‌ పరిశీలించారు. సంగుపేటలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనుల గురించి కాంట్రాక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరాలోపు రైతు వేదికలను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిర్మాణ పనుల్లో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. అవసరమైతే ఎక్కువ మంది కూలీలను పెట్టి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వారి వెంట వట్‌పల్లి ఇన్‌చార్జి తహసీల్దార్‌ గంగాధర్‌, ఎంపీడీవో గీత, అధికారులు, నాయకులు ఉన్నారు.

రైతు వేదికలను పరిశీలించిన ఆర్డీవో

పుల్కల్‌ : మండల పరిధిలోని పెద్దారెడ్డిపేట గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను జోగిపేట-అందోల్‌ ఆర్డీవో విక్టర్‌  పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ మురళి తదితరులు ఉన్నారు.