శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sangareddy - Oct 20, 2020 , 05:29:31

జలగండం

జలగండం

  • నీటికి బలైపోతున్నారు..
  • ప్రమాదవశాత్తూ కొందరైతే..
  • సరదా కోసం వెళ్లి మరి కొందరు..
  • ఇంట్లో విషాదాన్ని నింపుతున్న సంఘటనలు
  • సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు మృతి, ఇద్దరు గల్లంతు
  • వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన

కంది : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ర్టామంతటా కొద్ది రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గతంలో నీరు లేక ఎండిపోయిన చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వచ్చే వరద ధాటికి కొన్ని చెరువులు తెగిపోవడంతో ముప్పు వాటిల్లుతున్నది. సంగారెడ్డి జిల్లాలో అతి పెద్దదైన సింగూరు ప్రాజ్టెకు నీటితో నిండుకుండలా మారడంతో సంగారెడ్డి జిల్లాతో పాటు ఇతర జిల్లాలైన మెదక్‌, సిద్దిపేట, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల ప్రజలు ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. మొదట్లో చాలా మంది ఇక్కడికి వచ్చినవారు ప్రమాదకర సెల్ఫీలు దిగడం, గుంపులుగా చేరడంతో జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు ప్రాజెక్టు లోపలికి అనుమతి నిలిపివేయించారు. సంగారెడ్డి మండలం కల్పగుర్‌ వద్ద ఉన్న మంజీరా ప్రాజెక్టు వద్ద కూడా సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఇక్కడ కూడా ప్రాజెక్టు నీటితో నిండడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చిపోతున్నారు. వీటితోపాటు జిల్లాలోని ఇతర చెరువులు, అలుగులు పారుతున్న ప్రదేశాల వద్ద జనం వచ్చి సరదాగా ఫొటోలు దిగుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కొందరు వరద నీటి ప్రవాహాన్ని పట్టించుకోకుండా వెళ్తుండడంతో నీటికి బలైపోతున్నారు. ఇందులో ప్రమాదవశాత్తూ కొందరైతే.. సరదా కోసం వెళ్లి మరికొందరు కానరాని లోకాని వెళ్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో నలుగురు మృతి, ఇద్దరు గల్లంతు

సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు నీటిలో పడి నలుగురు మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. అమీన్‌పూర్‌లో ఒకరు, కర్దనూర్‌లో ఒకరు మృతి చెందగా, ఇంకొకరి ఆచూకీ ఇంకా లభించలేదు. జహీరాబాద్‌ మండలంలోని నారింజ ప్రాజెక్టులో పడి మరికొందరు మృతి చెందారు. వీరితో పాటు ఈ నెల 18న కంది మండలంలోని ఎర్దనూర్‌తండా శివారు చెరువులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహమైన తారాసింగ్‌ (15) లభ్యం కాగా,  వడ్డె పోచయ్య (80) జాడ ఇంకా కానరాలేదు. రెస్క్యూ టీమ్‌ తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్నది. తెలిసి తెలియక చేసిన చిన్న పొరపాటుతో ఏకంగా ప్రాణాలను కోల్పోతూ కుటుంబీకులకు తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి...

చెరువుల అలుగులు పారుతున్న చోట చాలా మంది సరదాగా గడపాలని అనుకుంటారు. ఇంటిల్లిపాది వెళ్లి అలుగు పారుతున్న చోట కాసేపు ఆనందించాలని ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ ఆనందం ఆవిరై ప్రాణాలమీదికొచ్చే ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నా నిర్లక్ష్యం చేసి నింగికేగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాల ప్రభావం ఇంకా ఉన్న కారణంగా చెరువులు, అలుగుల వద్దకు ప్రజలు వెళ్లకుండా ఉండడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. వరద నీటి ప్రవాహానికి చాలాచోట్ల చెరువు కట్టలు తెగిపోతున్నాయి. మరికొన్ని చోట్ల చెరువులకు గండిపడుతున్నాయి. రెండు రోజుల కింద కంది దేవుని చెరువుకు కూడా ఇలాగే గండి పడడంతో వరద నీరు దిగువకు జోరుగా పారి రోడ్లపైకి చేరింది. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులకు రాకపోకలకు అంతరాయం కలిగింది. సెల్ఫీలు దిగాలనే మోజులో, చేపలు పట్టాలనే కోరిక కలిగితే ప్రాణాలకే ముప్పువాటిళ్లే ప్రమాదం ఉంది.  ప్రజలు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఉండి వాటికి దూరంగా ఉంటే మంచిది. వర్షాలు వెనుకపట్టు పట్టేవరకు, నీటి ప్రవాహం తగ్గే వరకు ఎక్కడికి వెళ్లకుండా ఉంటే మంచిదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.