గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Oct 19, 2020 , 01:02:44

‘ధరణి’ రెడీ.. తహసీల్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మక రిజిస్ట్రేషన్లు

‘ధరణి’ రెడీ.. తహసీల్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మక రిజిస్ట్రేషన్లు

ఆదివారం అన్నిచోట్ల సాగిన ప్రక్రియ..తొలిరోజు విజయవంతం 

ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్లు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 72 మండలాలు

25న ‘ధరణి పోర్టల్‌' ప్రారంభం

ఆ రోజు నుంచి తహసీల్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ 

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఎప్పటిలాగే సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోనే.. 

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: 

‘ధరణి’ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈనెల 25న విజయదశమి రోజున ‘ధరణి పోర్టల్‌'ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి ఇక తహసీల్‌ కార్యాలయాల్లోనే ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. ఇందుకోసం తహసీల్‌ కార్యాలయా ల్లో తగు ఏర్పాట్లు చేశారు. కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, వెబ్‌ కెమరాలు, స్కానర్లు, ప్రింటర్లు ఇప్పటికే బిగించారు. ఆదివారం ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌లలోని 72 మండలాల తహసీల్‌ కార్యాలయాల్లో ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా టెస్ట్‌ రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. ఒక్కో ఆఫీసులో 10 వరకు టెస్ట్‌ రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు అన్నిచోట్ల ఈ టెస్టులు చేయగా, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు ఈ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లకు ఎలాంటి సమస్యలు లేకుండా తగు ఏర్పాట్లు చేశామని కలెక్టర్లు వెల్లడించారు. తహసీల్‌ కార్యాయాల్లోనే రిజిస్ట్రేషన్లు..ఇదో కొత్త అధ్యాయం అని వారు పేర్కొన్నారు. 25 నుంచి జరిగే రిజిస్ట్రేషన్లకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్లు తెలిపారు. 

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో...

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 9 రెవెన్యూ డివిజన్లు, 72 మండలాలు ఉన్నాయి. 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో వ్యవసాయ భూములు ఇక తహసీల్‌ కార్యాలయంలోనే ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. సోమవారం మరోసారి కో ఆర్డినేషన్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. ఎక్కడా లోపాలు లేకుండా మొదటగా టెస్ట్‌ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అన్నిచోట్ల బాగానే కొనసాగినట్లు కలెక్టర్లు చెబుతున్నారు. దీంతో 25వ తేదీ నుంచి అధికారికంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుకానున్నది. ఇక మీదట రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే మ్యుటేషన్‌ చేస్తారు. గతంతో రిజిస్ట్రేషన్‌ జరిగిన తర్వాత మ్యుటేషన్‌ కోసం రైతులు, ఇతరులు ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరిగేవారు. ఈ క్రమంలోనే అవినీతి, అక్రమాలు జరిగిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరుగాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. 

టెస్ట్‌ రిజిస్ట్రేషన్లను 

పరిశీలించిన కలెక్టర్లు...

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలో ఆదివారం అన్ని తహసీల్‌ కార్యాలయాల్లో ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా టెస్ట్‌ రిజిస్ట్రేషన్లు చేశారు. ఒక్కో కార్యాలయంలో 10 వరకు డమ్మీ రిజిస్ట్రేష న్లు చేయడం ద్వారా ఇబ్బందులు, సమస్యలు తెలిసిపోతాయనే ప్రభు త్వ సూచనల మేరకు అన్ని ఆఫీసు ల్లో ఈ ప్రక్రియ చేపట్టారు. 

  మూడు జిల్లాలో మొత్తం 72 మండలాలు ఉండగా, అన్నిచోట్ల టెస్ట్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతటా చేపట్టారు. ఈ ప్రక్రియను కలెక్టర్లు స్వయంగా వెళ్లి పరిశీలించారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మర్కూక్‌ తహసీల్‌ కార్యాలయంలో ప్రక్రియను పరిశీలించారు. ఆయనతో పాటు గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ తహసీల్‌ కార్యాలయం లో డమ్మీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కలెక్టర్‌ హనుమంతరావు పరిశీలించారు. అందోలు తహసీల్‌ కార్యాలయంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి టెస్ట్‌ రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో ఆర్డీవో శ్యామ్‌ప్రకాశ్‌ ధరణి పోర్టల్‌ టెస్ట్‌ను పరిశీలించారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీల వివరాలు

జిల్లా రెవెన్యూ డివిజన్లు మండలాలు పంచాయతీలు మున్సిపాలిటీలు

సంగారెడ్డి 4 27 647 8

సిద్దిపేట 3 24 499 5

మెదక్‌ 2 21 469 4

మొత్తం 9 72 1435 17

 అదే రోజు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌.. 

 భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇక కొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. విజయదశమి రోజు నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా తహసీల్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ఒకేరోజు రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్‌ పూర్తవుతుంది. అమ్మిన వారి వద్ద, కొన్నవారి వద్ద పాసుపుస్తకాలు ఉంటే వాటిలోనే మార్పులు, చేర్పులు చేసి ఇస్తాం. కొత్తవి ప్రింట్‌ అయిన తర్వాత వస్తాయి. జిల్లా వ్యాప్తంగా ఆదివారం అన్ని తహసీల్‌ కార్యాలయాల్లో డమ్మీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా..? అని పరిశీలించాం. సోమవారం తిరిగి సిబ్బందికి కో ఆర్డినేషన్‌ మీటింగ్‌ ఉన్నది. 25 నుంచి జిల్లాలోని 27 తహసీల్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుకానున్నది. అందుకోసం అన్నీ ఏర్పాట్లు చేశాం. 

             - హనుమంతరావు (సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌)

  ఒక్కో ఆఫీసులో 10 టెస్ట్‌ రిజిస్ట్రేషన్లు.. 

తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతి మండల ఆఫీసుకు కంప్యూటర్‌, కెమెరాలు, స్కానర్లు ఇతర సామగ్రి వచ్చాయి. అన్నిచోట్ల ట్రయల్‌ జరుగుతున్నది. ప్రతి ఆఫీసులో 10 వరకు టెస్ట్‌ రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ఈ టెస్టు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను క్షణ్ణంగా పరిశీలిస్తున్నాం. అంతా సజావుగానే సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న అధికారికంగా ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నది. అందుకోసం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. జిల్లాలో 24 మండలాల తహసీల్దార్లు ఇక జాయింట్‌ సబ్‌ రిజిస్టార్లుగా కూడా వ్యవహరిస్తారు. ధరణి పోర్టల్‌ గురించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పక్కాగా రిజిస్ట్రేషన్లు జరిగేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.

-  వెంకట్రామ్‌రెడ్డి  (సిద్దిపేట జిల్లా కలెక్టర్‌)


logo