గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Oct 19, 2020 , 00:46:06

సింగూరుకు.. పోటెత్తిన వరద

సింగూరుకు.. పోటెత్తిన వరద

ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల

కొనసాగుతున్న జలవిద్యుత్‌ ఉత్పత్తి

నాలుగు రోజుల్లో 17 టీఎంసీల ఇన్‌ఫ్లో

మంజీరాలోకి 12టీఎంసీల విడుదల

మంజీరా ద్వారా నిజాంసాగర్‌కు పరుగులు

నిరంతర పర్యవేక్షణలో అధికారులు

పుల్కల్‌ : సింగూర్‌ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. శనివారం రాత్రి భారీ వర్షాలు కురియడంతో ప్రాజెక్టులోకి భారీ ప్రవాహం చేరుకుంది. అప్పటి వరకు మూడు గేట్లతో దిగువకు నీటిని వదులుతున్న అధికారులు ప్రవాహం పెరుగడంతో మరో మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో అధికారులు అప్రమత్తమై. ప్రాజెక్టు 36 ఎంఎం వర్షం కురియడంతో ఉదయం 4 గంటల ప్రాంతంలో ప్రాజెక్టులోకి 82 క్యూసెక్కుల నీరు చేరింది. పరీవాహక ప్రాంతంలో పంటలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో 5, 6, 9, 11, 14, 15 గేట్లను రెండున్నర మీటర్ల ఎత్తు ఎత్తి దిగువకు 82 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. వర్షాలు కురుస్తున్న తీరుగా ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలో ఎచ్చు తగ్గులు కనబడుతున్నది. ఈ నెల 14 నుంచి ఒక రోజు ఆరు గేట్లు, మరో రోజు మూడు గేట్లు ఎత్తి అధికారులు వరదల సమతూల్యతను చూస్తున్నారు. బీదర్‌, బాల్కీ, లాతూర్‌ జిల్లాల నుంచి ఇన్‌ఫ్లో చేరుతుందని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 15856 క్యూసెక్కులు ఉందన్నారు.  

నాలుగు రోజుల్లో 17 టీఎంసీలు రాకా...

భారీ వరదలు రావడంతో ప్రాజెక్టులోకి ఈ నెల 14వతేదీ నుంచి 17 టీఎంసీల నీరు చేరింది. అల్ప పీడన ప్రభావంతో వర్షాలు కురియడంతో ఎగువ ప్రాంతంలో నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ ప్రాంతంలో కురిసిన వాన నీరు మొదటి రోజే చేరింది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షం నీరు రెండు రోజుల తర్వాత చేరింది. ప్రాజెక్టుకు 200 కిలో మీటర్ల దూరంలో సాయిగాన్‌ మత్తడి వద్ద కేంద్ర జలసంఘం పర్యవేక్షణలో సింగూరు నీటి పారుదల శాఖ సిబ్బందిని నియమించారు. వారు అందించే ఇన్‌ఫ్లో వివరాలను బట్టి ప్రాజెక్టు వద్ద వరదలను అంచనా వేస్తూ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 14న అర్ధరాత్రి వరదలను అంచానా వేసి 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. 29.900 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో ఈ నెల 14వరకు 24.500 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆ తర్వాత భారీ వరదలు రావడంతో ప్రాజెక్టు సామర్థ్యం మేరకు నీటిని ఉంచి మిగతా నీటిని దిగువకు వదిలారు. నాలుగు రోజుల్లో డ్యాంలోకి 17 టీఎంసీలు రాగా... 5టీఎంసీల నీటిని ప్రాజెక్టులో ఉంచి 12టీఎంసీల నీటిని మంజీరాలోకి వదిలారు. మంజీరా  సామర్థ్యం 1.9 టీఎంసీలు కావడంతో అంతే నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని వనదుర్గ మాతా ఆనకట్ట ద్వారా నిజాం సాగర్‌లోకి చేరుతుంది. నిజాం సాగర్‌ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు సింగూర్‌ నుంచి 12టీఎంసీల వరకు చేరింది.

డ్యాం వద్దనే అధికారులు...

డ్యాంలోకి వరద ప్రవాహం పెరుగుతుండడంతో నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు వద్దే ఉంటూ ఇన్‌ఫ్లోను పరిశీలిస్తున్నారు. వర్షాల ఎచ్చుతగ్గుల వల్ల రాత్రిల్లో వచ్చే వరదలను గుర్తించడానికి నీటిపారుదల శాఖ ఈఈ మధుసూదన్‌ రెడ్డి పర్యవేక్షణలో డిప్యూటీ ఈఈ రామస్వామి, ఏఈలు మహిపాల్‌రెడ్డి, రమేశ్‌ ఈ నెల 14 నుంచి ప్రాజెక్టు వద్దే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న దృష్ట్యా జలవిద్యుత్‌ ఉత్పత్తి ఏడీఈ పాండయ్య నేతృత్వంలో సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తూ రెండు టర్బయిన్లతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.

1.3 ఎంయూ విద్యుత్‌ ఉత్పత్తి...

నాలుగు రోజుల నుంచి సింగూర్‌ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో 1.3 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను రెండు టర్బయిన్లతో ఉత్పత్తి చేశామని జెన్‌కో ఏడీఈ పాండయ్య తెలిపారు. ఎక్కువ గేట్లను ఎత్తడం వల్ల గేట్ల ద్వారా దిగువకు పొర్లిన నీరు విద్యుత్‌ కేంద్రం దిగువకు రావడం వల్ల టర్బయిన్లపై ఒత్తిడి పడుతుందని తెలిపారు. క్రస్టుగేట్ల నుంచి నీటిని వదులకుండా కేవలం జెన్‌కోకు మాత్రమే నీటిని సరఫరా అయితే టర్బయిన్లపై దిగువ నుంచి ఒత్తిడి పడదన్నారు. 

పర్యాటకులు తాకిడి...

ఆదివారం కావడం పైగా ఆరుగేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతుండడంతో పర్యాటకులు పోటెత్తారు. డ్యాంపైకి పర్యాటకులను అనుమతి లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎస్సై నాగలక్ష్మి పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్రస్టు గేట్ల వైపు వెళ్లకుండా పర్యాటకులు గేట్ల దిగువ భాగంలో, బ్రిడ్జి వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.


logo