ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Oct 19, 2020 , 00:50:22

కారుతో సహా ఆనంద్‌ మృతదేహం లభ్యం

కారుతో సహా ఆనంద్‌ మృతదేహం లభ్యం

ఆరు రోజులుగా శ్రమించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు 

మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి భరోసా 

అమీన్‌పూర్‌ : అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని ఇసుక బావి గ్రామం వద్ద గడిచిన మంగళవారం రాత్రి వరద ప్రవాహంలో కారుతో సహా గల్లంతైన మల్లికార్జున్‌(ఆనంద్‌) ఆచూకీ లభించింది. ఆదివారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే కారుతో సహా మృతదేహం లభ్యమైంది. ఆరు రోజులుగా రాత్రి, పగలు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా గాలించారు. పోలీసులు డ్రోన్‌ కెమెరాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.  

ఎమ్మెల్యే చొరవతో ముమ్మర గాలింపు... 

ఇసుకబావి వద్ద వరదలో కొట్టుకుపోయిన ఆనంద్‌ విషయం తెలుసుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి వెంటనే స్పందించి గాలింపు చర్యల కోసం అధికారులను సమన్వయం చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పించి చర్యలను ముమ్మరం చేశారు. 

మిన్నంటిన రోధనలు... 

వరదలో గల్లంతైన ఆనంద్‌ తిరిగి వస్తాడని అనుకున్న అతడి కుటుంబీకుల ఆశలు అడియాశలయ్యాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అధికారులు, సిబ్బంది గాలింపు చర్యలను చేపట్టడంతో ఆచూకీ లభిస్తుందని, అతడు బతికే ఉండి ఉండవచ్చని భావించారు. కానీ మృతదేహం లభ్యం కావడంతో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి.   

ఆనంద్‌ కుటుంబానికి అండగా ఉంటాం

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు : ఇసుకబావి వరద ప్రవాహంలో మృతి చెందిన ఆనంద్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆనంద్‌ మృతదేహం, కారు లభ్యం కావడంతో మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆరు రోజుల పాటు ఆనంద్‌ మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, నీటి పారుదల శాఖ, మత్స్యశాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారని అన్నారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎంతో అండగా నిలిచాయన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సంయమనం కోల్పోకుండా, గాలింపు చర్యల్లో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. 


logo