గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Oct 17, 2020 , 05:12:35

సింగూరులో జల సవ్వడి

సింగూరులో జల సవ్వడి

ప్రాజెక్టులోకి నాలుగు రోజుల్లో 9 టీఎంసీల వరద

దిగువకు 5 గేట్ల ద్వారా 4.5 టీఎంసీలు వదిలిన అధికారులు

కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 68,348 క్యూసెక్కులు

గేట్లు తెరవడంతో పర్యాటకుల సందడి

పుల్కల్‌: సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఎగువ రాష్ర్టాల నుంచి వరద పోటెత్తడంతో శుక్రవారం మధ్యా హ్నం ఐదు గేట్లు రెండున్నర మీటర్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. నాలుగు రోజుల నుంచి ప్రాజెక్టు పరిసరాల్లో కురిసిన వర్షా నికి తోడు ఎగువ నుంచి వరద వస్తుండటంతో బుధవారం ఐదు గేట్లు ఎత్తి దిగువకు 3.5 టీఎంసీల నీటిని వదిలారు. స్థానికంగా ఇన్‌ఫ్లో తగ్గడంతో గురువారం రెండు గేట్ల ద్వారా నీటిని వదిలారు. ఎగువ రాష్ర్టాలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి శుక్రవారం ఉదయం భారీ వరద రావడంతో మధ్యా హ్నం 5,6,11,14,15 నంబర్‌ గేట్లను ఎత్తి దిగువకు వదిలారు. 29.900 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదులుతున్నారు.

సమానంగా ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో ...

మహారాష్ట్ర, కర్ణాటకలోని బీదర్‌, బాల్కీ, లాతూర్‌ జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో ఆ వరదంతా కరింజా బ్యారేజ్‌, సాయిగాన్‌ మత్తడి ద్వారా సింగూరు ప్రాజెక్టుకు చేరుకుంటున్నాయి. నాలుగు రోజుల కింద ఎగువ రాష్ర్టాల్లో కురిసిన వర్షం సిం గూరు ప్రాజెక్టుకు చేరుకోవడానికి మూడు రోజుల సమయం పడుతుంది. ఎగువ రాష్ర్టాల వరద గురువారం అర్ధరాత్రి నుంచి ప్రాజెక్టుకు చేరుకోవడంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై వరదలను పర్యవేక్షించారు. వరద ఉధృతి  68,348 క్యూసెక్కులకు పెరుగడంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై ఐదు గేట్ల రెండున్నర మీటర్లు ఎత్తడంతో దిగువకు అంతే నీటిని వదులుతున్నారు.

నాలుగు రోజుల్లో 9 టీఎంసీల ఇన్‌ఫ్లో.. 

నాలుగు రోజుల నుంచి 9 టీఎంసీల వరద వచ్చింది. మంజీరా ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1.9 టీఎంసీలు. మంజీరా బ్యారేజ్‌ని పర్యవేక్షించే హైదరాబాద్‌ జలమండలి అధికారులు 1.5 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని, మిగతా నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువకు వదిలిన నీరు ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు గుండా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి పరుగులు తీస్తున్నాయి. సింగూరు నుంచి ఇప్పటి వరకు నిజాంసాగర్‌కు 3టీఎంసీల మేర జలాలు వదిలినట్లు అధికారులు తెలిపారు. 

1.3ఎంయూల విద్యుదుత్పత్తి..

సింగూరు జల విద్యుత్‌ కేంద్రంలో 14 తేదీ నుంచి ప్రతిరోజు 0.312 మెగావాట్ల చొప్పున విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నామని జల విద్యుత్‌ కేంద్రం ఏడీఈ సౌజన్య తెలిపారు. గేట్ల ద్వారా నీరు వదులుతుండటంతో జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం దిగువ భాగంలో ఒత్తిడి పెరుగడంలో సామర్థ్యానికి కంటే తక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. 2020-21లో ఇప్పటి వరకు రెండు పర్యాయాలు 1.3 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశామన్నారు.


logo