మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Oct 16, 2020 , 02:16:07

దెబ్బతిన్న పంటలు.. కూలిన ఇండ్లు

దెబ్బతిన్న పంటలు.. కూలిన ఇండ్లు

న్యాల్‌కల్‌: మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి పలు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని 37 గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో 16,870 ఎకరాల్లో పత్తి, 1,991 ఎకరాల్లో చెరుకు, 1,891 ఎకరాల్లో కంది, 511 ఎకరాల్లో  సోయాబీన్‌, 462 ఎకరాల్లో మినుము, 2 ఎకరాల్లో మిర్చి పంటలు  దెబ్బతిన్నాయని మండల వ్యవసాయాధికారి లావణ్య తెలిపారు.  మండలంలో 9,726 మంది రైతులకు నష్టం జరిగిందన్నారు. 

  రెండు రోజులుగా మండలంలో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించామన్నారు.  పంట వివరాలను సేకరించి జిల్లా అధికారులకు నివేదికలను పంపించామని, ప్రభుత్వపరంగా రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు.

కల్హేర్‌ మండలంలో...

కల్హేర్‌: ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో అన్నదాతలకు అంతా ఆగమే అయింది. వాయుగుండం ప్రభావంతో   కురుస్తున్న వ ర్షాలతో సోయా, పత్తి, వరి పంటలు నీట మునిగాయి.  

 మంత్రి దృష్టికి తీసుకెళ్తాం...

 ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించేందుకు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్తామని జడ్పీటీసీ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. గురువారం మిర్కాన్‌పేట్‌ గ్రామ శివారులో నష్టపోయిన వరి పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఎమ్మెల్యే  భూపాల్‌రెడ్డి ఆదేశాలతో  అధికారులతో కలిసి నష్టపోయిన పంటలను పరిశీలించామన్నారు. మండలంలో 700 ఎకరాల వరకు వరి పంటకు నష్టం వాటిల్లినట్లు   ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ఎమ్మెల్యే సహకారంతో మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి రైతులకు పరిహారం అందే లా కృషి చేస్తామన్నారు. ఏఈవో కృష్ణవేణి, రైతులు పాల్గొన్నారు. 

సిర్గాపూర్‌ మండలంలో  ...

సిర్గాపూర్‌:  భారీ వర్షాలకు  మండలంలో 941 ఎకరాల పత్తి పంటకు  తీవ్రంగా నష్టం వాటిల్లిందని మండల వ్యవసాయాధికారి శశాంక్‌ తెలిపారు.  ఆయన తమ ఏఈవోలతో కలిసి మండలంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు. నష్టపోయిన పంట  వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఈయన వెంట ఏఈవోలు ఉన్నారు.

కోహీర్‌ మండలంలో...

కోహీర్‌: మండలంలోని ఆయా గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు విరిగిన స్తంభాలు, విద్యుత్‌ తీగలకు మరమ్మతులు చేపట్టారు.   కవేలి, నాగిరెడ్డిపల్లి, దిగ్వాల్‌, తదితర గ్రామాల్లో ఇంత వరకు 21 ఇండ్లు కూలిపోయాయి.  

జహీరాబాద్‌-అల్గోల్‌ రోడ్డు పై భారీగా వరదనీరు

జహీరాబాద్‌ : జహీరాబాద్‌-అల్గోల్‌ రోడ్డు పై భారీగా వరదనీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  భారీ వర్షానికి రోడ్డు సైతం కోతకు గురికావడంతో పాటు వరదనీరు భారీగా ప్రవ హిస్తోంది. అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేయా లని వాహనదారులు కోరుతున్నారు.  


logo