ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Oct 16, 2020 , 02:16:07

‘సింగూరు’కి జలసిరి

‘సింగూరు’కి జలసిరి

  • n రెండు రోజుల్లో ప్రాజెక్టులోకి  8టీఎంసీల ఇన్‌ఫ్లో 
  • n గేట్ల ద్వారా దిగువకు 3.5టీఎంసీల నీరు విడుదల
  • n ప్రాజెక్టుకు  ఎగువ రాష్ర్టాల నుంచి వరద 
  • n కరింజా, సాయిగాన్‌ బ్యారేజ్‌ల నుంచి వస్తున్న ప్రవాహం 
  • n అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు

పుల్కల్‌ : ఇటీవల కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీ వరద రావడంతో ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పోటెత్తుతున్నది. దీంతో బుధవారం ఉదయం నుంచి 5 గేట్లను ఎత్తి 2.5మీటర్లు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 29.917 టీఎంసీలకు గాను, గేట్లను ఎత్తకు ముందు 24.500 టీఎంసీల నీరు ఉండగా.. ప్రసుత్తం 29.000 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదులుతున్నారు. నాలుగేండ్ల తర్వాత ప్రాజెక్టులోకి వరదలు రావడంతో గేట్లను వదిలి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు వద్ద నీటి పారుదలశాఖ ఈఈ మధుసూదన్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ రామస్వామి, ఏఈ మహిపాల్‌ రెడ్డి ఎప్పటికప్పుడు ఇన్‌ఫ్లోను పర్యవేక్షిస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు ఎంత నీటిని విడుదల చేస్తున్నారో.. అంతే నీటిని మంజీరా ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వదులుతున్నారు.  

రెండు రోజుల్లో 8టీఎంసీల రాక..

మూడు రోజులుగా కురిసిన వర్షాలకు 8టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టులో 29.000 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదులుతున్నారు.  ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మూడు రోజులుగా భారీ  నుంచి అతిభారీ వర్షాలు పడడంతో వరద  డ్యాంలోకి చేరుకుంటున్నది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి 80వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

గంగమ్మకు ప్రత్యేక పూజలు..

సింగూరు ప్రాజెక్టులోకి వరదలు రావడంతో డ్యాం నిండిన అనంతరం గేట్ల ద్వారా అధికారు లు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటీవల  మంత్రి హరీశ్‌రావు, అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ రెడ్డితో కలిసి డ్యాంను సందర్శించారు. ఇన్‌ఫ్లో వివరాలను నీటి పారుదల శాఖ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. నాలుగేండ్ల తర్వాత మళ్లీ ప్రాజెక్టు నిండడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. ‘యాసంగి’కి సాగునీటిని ఇవ్వడానికి సన్నద్ధం కావాలని మంత్రి నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 33 టీఎంసీల ఇన్‌ఫ్లో..

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 33టీఎంసీల నీరు చేరింది. వేసవిలో చుక్కనీరు లేని ప్రాజెక్టు జూలై నుంచి స్వల్పంగా వరద రావడంతో ప్రాజెక్టులోకి నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ఆగష్టు వరకు 3.5 టీఎంసీలు, సెప్టెంబర్‌లో 21టీఎంసీలు, అక్టోబర్‌లో 8టీఎంసీలు రావడంతో మొత్తం ప్రాజెక్టులో 29.000 టీఎంసీల నీటి నిల్వ ఉంచి బుధవారం నుంచి దిగువకు 5గేట్ల ద్వారా 3.5టీఎంసీల నీటిని వదుతున్నారు. 

0.25ఎంయూ విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం..

సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదులుతుండటంతో జలవిద్యుత్‌ కేంద్రం అధికారులు రెండు టర్బయిన్లను రన్‌చేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించారు. 250 ఎంసీఎఫ్‌టీల నీటిని వాడుకొని 0.25 మిలియన్‌ యూనిట్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని ప్లాంట్‌ ఏడీఈ పాండయ్య తెలిపారు. గత వారం మంజీరా ప్రాజెక్టులోని తాగునీటిని వదిలినప్పుడు 500 ఎంసీఎఫ్‌టీ నీటిని వాడుకొని 0.7మిలియన్‌ యూనిట్‌ను విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని ఏడీఈ తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని తెలిపారు.


logo