శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Oct 15, 2020 , 02:04:23

కుండపోత

కుండపోత

  • n మెతుకుసీమ జలమయం
  • n సంగారెడ్డి జిల్లాలో 13.05 సెం.మీ., సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో 10 సెం.మీ. చొప్పున వర్షం
  • n పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • n నీట మునిగిన పత్తి, వరి, ఇతర పంటలు
  • n అన్నదాతకు తీవ్ర నష్టం
  • n పలుచోట్ల వరదలకు కొట్టుకుపోయిన రహదారులు
  • n సింగూరు, మంజీరా గేట్లను ఎత్తిన అధికారులు
  • n ఘనపురం వనదుర్గ అమ్మవారి పాదల చెంతగా నీళ్లు..
  • n వరదలో చిక్కుకున్న ఏడుగురు కూలీలను కాపాడిన అధికారులు
  • n పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్లు వెంకట్రామ్‌రెడ్డి, హనుమంతరావు

ఉమ్మడి మెతుకుసీమ జలమయమైంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. కుండపోత వానతో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో వాగులు, వంకలు, ఇతర జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. భారీ ఇన్‌ఫ్లో రావడంతో అధికారులు సింగూరు గేట్లు ఎత్తి నీళ్లు దిగువన మంజీరకు వదిలారు. మంజీర నుంచి కూడా నీళ్లు కిందకు వదిలారు. భారీ వర్షంతో పత్తి, వరి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు నీళ్లలో మునిగిపోయాయి. పలు చోట్ల వరదలకు రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సరాసరి 13, మెదక్‌, సిద్దిపేట జిల్లాలో 10సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఏటిగడ్డ సంగం గ్రామంలోని మదుగడ్డ వద్ద వరదలో చిక్కుకున్న ఏడుగురు కూలీలను కలెక్టర్‌ హనుమంతరావు నేతృత్వంలో అధికారులు బోట్ల ద్వారా క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సిద్దిపేట, మెదక్‌ జిల్లాల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. పంటల నష్టంపై వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.

- సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ