శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Oct 10, 2020 , 01:45:37

పోలీసు శాఖకు మంచిపేరు తేవాలి

పోలీసు శాఖకు మంచిపేరు తేవాలి

సంగారెడ్డి టౌన్‌:  పోలీసు శాఖకు మంచిపేరు తేవాలని సీఐడీ అడిషనల్‌ డీజీపీ గోవింద్‌సింగ్‌ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లాకు చెందిన ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లు 9 నెలలపాటు పోలీసు శిక్షణ పూర్తిచేసుకున్న సందర్భంగా పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ సంగారెడ్డి మండల పరిధిలోని చిదృప్ప పోలీసు శిక్షణ కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐడీ అడిషనల్‌ డీజీపీ గోవింద్‌సింగ్‌ మాట్లాడుతూ 9 నెలల పాటు పోలీసు కానిస్టేబుళ్లుగా నల్లగొండ జిల్లాకు చెందిన 224 మందికి ఐపీసీ, సీఆర్‌పీసీతోపాటు స్పెషల్‌ లా, క్రైం, ఇన్విస్టిగేషన్‌, ఇంటలిజెన్స్‌, ఇంటర్నల్‌ సెక్యూరిటీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, పోలీసు అడ్మినిస్ట్రేషన్‌, వెపన్‌ టాపిక్స్‌, ఫైరింగ్‌ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి పోలీసు శాఖ ద్వారా మంచి అవకాశం లభించిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో నేర్చుకున్న విషయాలను నిరంతరం నెమరువేసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలని సూచించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ 9 నెలల శిక్షణలో నేర్చుకున్న విషయాలు విధి నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. పోలీసింగ్‌ అనేది నిరంతరం శిక్షణ ప్రక్రియ అన్నారు. శిక్షణ కేంద్రంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ సీహెచ్‌. సాయికుమార్‌, బెస్ట్‌ ఇండోర్‌ సీహెచ్‌.సాయికుమార్‌, బెస్ట్‌ ఔట్‌డోర్‌ జి.నరేశ్‌, బెస్ట్‌ ఫైరింగ్‌ ఆర్‌.శ్రీనుకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీటీసీ ప్రిన్సిపల్‌ సీతారాం, అడిషనల్‌ ఎస్పీ సృజన, డీటీసీ వైస్‌ ప్రిన్సిపల్‌ గిరికుమార్‌, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, డీటీసీ ఆర్‌ఐ కృష్ణ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.