గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Oct 06, 2020 , 00:53:31

రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో అక్రమాలు

రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో అక్రమాలు

జహీరాబాద్‌: రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని కొం దరు అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మార్చేస్తున్నారు. అరికట్టాల్సిన అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిడులతో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. స్థానికులు ఫిర్యా దు మేరకు ప్రత్యేక బృందాలు దాడులు చేసినప్పు డు మాత్రమే చీకటి వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. జహీరాబాద్‌ డివిజన్‌ కర్ణాటక సరిహద్దులో ఉండడంతో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సా రించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గుట్కా, రేషన్‌ బియ్యం, గంజాయి స్మగ్లింగ్‌, పత్తాలాట, మట్కా జోరుగా సాగుతున్నదనే ఆరోపణలున్నాయి.

కర్ణాటక సరిహద్దుల్లో మట్కా..

మట్కా వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయి. కర్ణాటక సరిహద్దు మండలాలైన జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌, కోహీర్‌లో జోరుగా సాగుతోంది. మట్కా నిర్వాహకులు ఆన్‌లైన్‌ పద్ధతిలో దందాను సాగిస్తున్నారు. దీంతో మట్కా ఆడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే తప్పుడు ఆలోచనలతో మట్కాకు బానిసలుగా మారుతున్నారు. మట్కా ప్రధాన నిర్వాహకులు గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకొని, ఫోన్ల ద్వారా మట్కా నడిపిస్తున్నారు. గ్రామాల్లోని హో టల్‌, వ్యవసాయ క్షేత్రాలను అడ్డాలుగా ఏర్పాటు చేసుకున్నారు. 

రేషన్‌ బియ్యం బ్లాక్‌..

సరిహద్దులోని వ్యవసాయ క్షేత్రంలో షెడ్లను  ఏర్పాటు చేసి రేషన్‌ బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. అనంతరం ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్నారు. జహీరాబాద్‌ కేంద్రంగా రేషన్‌ బియ్యం మాఫియా సాగుతున్నది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో  నుంచి రేషన్‌ బియ్యం తీసుకొస్తున్నారు. రీసైక్లింగ్‌ చేసిన తర్వాత గుజరాత్‌, మహారాష్ర్టాలకు లారీలో తరలిస్తున్నారు. జహీరాబాద్‌, కోహీర్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌ మండలాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశారు. డీలర్లు, పేదల నుంచి సేకరించిన బియాన్ని నిల్వ చేస్తున్నారు. బియ్యం మాఫి యా నిర్వాహకులు ప్రతి నెలా పోలీ సు, పౌర సరఫరాలు, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖల అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు కొందరు ఫిర్యాదు చేసిన వెంటనే బియ్యం మాఫియా నిర్వాహకులకు సమాచారమిచ్చిన సంఘటనలు ఉన్నాయి.

ఒడిశా సరిహద్దు@జహీరాబాద్‌..

ఒడిశా సరిహద్దు నుంచి స్మగ్లర్లు, ప్రైవేటు లారీలు, డీసీఎంలు, ఇతర వాహనాల్లో గంజాయిని జహీరాబాద్‌కు తీసుకొస్తున్నారు. విశాఖ మన్యం, ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి మాఫియా ఒక్కో ప్యాకెట్‌ను 5 కిలోల చొప్పున ప్యాక్‌ చేసి తెస్తున్నట్లు సమాచారం. గంజాయిని కొందరు తీసుకొచ్చి, వ్యవసాయ క్షేత్రాల్లో నిల్వ చేసి అవసరం మేరకు మహారాష్ట్ర, కర్ణాటకకు తరలిస్తున్నారని పోలీసుల విచారణలో గతంలోనే తేలింది. విశాఖ ఏజెన్సీ గ్రామాల నుంచి గంజాయిని అక్రమంగా తెచ్చి, అమ్మకాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో జాతీయ రహదారితోపాటు జహీరాబాద్‌-బీదర్‌ రోడ్డు, జహీరాబాద్‌-చింజొళి రోడ్డులో తనిఖీలు లేకపోవడంతో గంజాయి మాఫియా నేరుగా రవాణా చేస్తున్నది. జాతీయ రహదారిపై ఎక్సైజ్‌ శాఖ చెక్‌పోస్టు ఉన్నా అక్కడ అధికారులు తనిఖీలు చేయడం లేదు.

బీదర్‌ నుంచి ఖైనీ, గుట్కా అక్రమ రవాణా..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖైనీ, గుట్కాలను ప్రభుత్వం నిషేధించడంతో కర్ణాటకలోని బీదర్‌ నుంచి జోరుగా రవాణా సాగుతుంది. ప్రతిరోజు ఖైనీ, గుట్కా ప్యాకెట్లను అక్రమంగా బీదర్‌లో ఉన్న కంపెనీలో కొనుగోలు చేసి వాహనాల్లో తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు గుట్కా తరలిస్తుండగా వాహనాలను పట్టుకున్నారు. జాతీయ రహదారిపై నిఘా లేకపోవడంతో రవాణా జోరుగా సాగుతున్నది. వ్యాపారులు సరిహద్దు పోలీసులను మచ్చిక చేసుకొని, దందా సాగిస్తున్నారనే విమర్శలున్నాయి.  

పత్తాలాట హద్దులు దాటింది..

కర్ణాటక సరిహద్దులోని వ్యవసాయ క్షేత్రాల్లో షెడ్లను ఏర్పాటు చేసుకొని పత్తాలాటను మూడు పువ్వులు.. ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు. జహీరాబాద్‌, సంగారెడ్డితోపాటు కర్ణాటక రాష్ర్టానికి చెందిన జూదరులు వస్తున్నారు. పోలీసుల అండదండలతో జూదశాలలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి నిర్వహించిన సంఘటనలున్నాయి. గతంలో కోహీర్‌లో షెడ్‌ ఏర్పాటు చేసి పత్తాలాట నిర్వహిస్తున్న కేంద్రంపై దాడి చేసి, పలువురిని అరెస్టు చేశారు.  


logo