శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Oct 06, 2020 , 00:44:45

హెటిరో హరిత సంకల్పం

హెటిరో  హరిత సంకల్పం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారానికి ఫార్మా దిగ్గజం హెటిరో సంస్థ మద్దతుగా నిలిచింది. పచ్చదనం పెంచేందుకు సంకల్పించింది. ఎంపీ సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నది. 

గుమ్మడిదల/పటాన్‌చెరు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారానికి ఫార్మా దిగ్గజం హెటిరో సంస్థ మద్దతుగా నిలిచింది. పచ్చదనం పెంచేందుకు సంకల్పించింది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ స్ఫూర్తితో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల శివారులోని ముంబాపూర్‌-నల్లవల్లి అటవీ ప్రాంతాన్ని ప్రముఖ ఫార్మా దిగ్గజం దత్తత తీసుకున్నది. అర్బన్‌ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు దాదాపు 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఈ మేరకు సోమవారంలో గుమ్మడిదల శివారులో ముంబాపూర్‌-నల్లవల్లి అడవిలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఏర్పాటు చేయగా, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌ పాల్గొని, మొక్కలు నాటారు. అర్బన్‌ పార్కు అభివృద్ధికి హెటిరో సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ పార్థసారథిరెడ్డి రూ.5కోట్ల చెక్‌ను మంత్రి ఐకేరెడ్డి, ఎంపీ, మెదక్‌ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సమక్షంలో అటవీశాఖకు అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. హెటి రో సంస్థ చైర్మన్‌ పార్థసారథిరెడ్డి దత్తత తీసుకోవడంపై అభినందించారు. సమాజంపై, పర్యావరణంపై సృహతో హెటిరో సంస్థ 2,543 ఎకరాలను దత్తత తీసుకుని అర్బన్‌ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. ముంబాపూర్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ మూడు కంపార్ట్‌మెంట్లలో విస్తరించి ఉన్నదని తెలిపారు. ముంబాపూర్‌లో 1,777 ఎకరాలు, నల్లవల్లిలో766 ఎకరాలు కలిపి అభివృద్ధి చేయనున్నదని చెప్పారు. ఔటర్‌ రింగురోడ్డుకు దగ్గరి అటవీ ప్రాంతం కావడంతో సీఎం కేసీఆర్‌ నర్సాపూర్‌ పర్యటన సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు అటవీ ప్రాంతాన్ని పచ్చదనంతో నింపుతున్నామన్నారు. నగరం చుట్టూ పచ్చదనం పెరగడంతో స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. అటవీ శాఖ ద్వారా పలు అర్బన్‌ పార్కులు అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ, పీసీసీఎఫ్‌ (సోషల్‌ ఫారెస్ట్రీ) ఆర్‌ఎం దోబ్రియల్‌, మెదక్‌ సర్కిల్‌ సీఎఫ్‌ శరవణన్‌, సంగారెడ్డి డీఎఫ్‌వో వెంకటేశ్వరరావు, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రతినిధి రాఘవ, ఎంపీపీ  ప్రవీణభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

పచ్చదన్నాన్ని పెంచుతున్న సర్కారు -ఎంపీ సంతోష్‌కుమార్‌

హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసే క్రమంలో తెలంగాణ సర్కార్‌ పచ్చదనాన్ని పెంచుతున్నదని ఎంపీ సంతోష్‌కుమార్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన హరితహారాన్ని కొనసాగించడంలో భాగంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించామన్నారు. పుడమిపై పచ్చదనంతో పర్యావరణం బాగుపడుతుందన్నారు. గత నెలలో సినీ స్టార్‌ ప్రభాస్‌ కూడా కాజిపల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారని గుర్తు చేశారు. కాజిపల్లి కూడా రింగురోడ్డుకు అనుకొని ఉండటంతో నగర ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ లభిస్తుందన్నారు. నగరం చుట్టూ ఉన్న అటవీ భూములు పచ్చదనంతో కనిపించేలా చర్యలుంటాయన్నారు. హెటిరో సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ ఫార్థసారథిరెడ్డి అఅర్బన్‌ పార్క్‌ అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. రూ.5కోట్ల చెక్కు ఇచ్చి, పచ్చదనం పెంపునకు ఊతమిచ్చారన్నారు. హెటిరో సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తుండటం తనను ఆకట్టుకున్నదన్నారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ ఇచ్చిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు స్పందించి, తమ సంస్థ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నదన్నారు. అటవీశాఖ కార్యాచరణను బట్టి కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు మద్దతుగా తమ వంతు సాయం చేస్తున్నామన్నారు. logo