గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Oct 05, 2020 , 00:58:18

పిచికారీ.. ఇక సులభం

పిచికారీ.. ఇక సులభం

కొత్తరకం పిచికారీ యంత్రాన్ని రూపొందిన బసంతపూర్‌ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు

చక్రం కదిలికతో కలిగే పీడనంతో పనిచేయనున్న యంత్రం 

రైతులకు కూలీల ఖర్చు ఆదా.. తగ్గనున్న శ్రమ

న్యాల్‌కల్‌ : సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం బసంతపూర్‌ గ్రామ శివారులోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సరికొత్త పిచికారీ యంత్రాన్ని తయారు చేశారు. పంటలకు ఆశించే తెగుళ్లు, చీడపీడలను నివారించేందుకు కొత్తగా పిచికారీ యంత్రాన్ని (స్ప్రేయర్‌)ను రూపొందించారు. స్థానిక పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు విజయలక్ష్మి, లక్ష్మణ్‌, అరవింద్‌ ఈ యంత్రాన్ని  రూపొందించారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ విజయ్‌కుమార్‌  యంత్రం పనితీరును వివరించారు. బ్యాటరీ, పెట్రోల్‌ అవసరం లేకుండా.. యంత్రం ముందు చక్రం కదలికతో ఏర్పడే పీడనంతో డబ్బాలోని రసాయన  మందు బయటకు వచ్చి, నాజిల్స్‌ ద్వారా పంటపై పిచికారీ అవుతుంది. పంటలకు ఆశించే తెగుళ్లు, చీడ పురుగులను నివారణకు ఇదివరకు ఉన్న చేతిపంపు, పవర్‌ పిచికారీ యంత్రాల(స్ప్రేయర్‌)ను ఉపయోగించేవారు.  దానికి ఇద్దరూ నుంచి ముగ్గురు కూలీలతో పాటు ఎక్కువ శ్రమించాల్సి వచ్చేది. పిచికారీ యంత్రాన్ని(స్ప్రేయర్‌) వీపునకు వేసుకుని గంటల తరబడి పంటలపై రసాయన మందులను పిచికారీ చేసేవారు. దీంతో  రైతులు అలసిపోయేవారు. 

పెట్రోల్‌, బ్యాటరీ లేకుండానే..

కొత్తగా రూపొందించిన ఈ పిచికారీ యంత్రంతో ఒకరిద్దరితో, పెట్రోల్‌, బ్యాటరీ సహాయం లేకుండా చక్రం కదలికతో ఏర్పడే పీడనం ఒత్తిడితో సులభంగా పిచికారీ చేసుకోవచ్చు. యంత్రాన్ని ఒక్కరే తోలుకుంటూ పిచికారీ చేయవచ్చు. ఈ యంత్రంపై ఒక ప్లాస్టిక్‌ డబ్బా, రెండువైపులా మందు పిచికారీ చేసేందుకు నాజిల్స్‌ ఏర్పాటు చేశారు. పంట ఎత్తును బట్టి యంత్రానికి ఇరువైపుల ఉన్న నాజిల్స్‌ పైపులను పెంచుకోవచ్చు. యంత్రాన్ని తోలుకుంటూ పొలంలో మధ్యలో వెళ్తుంటే, ముందు చక్రం కదలిక ఆధారంగా గేర్‌ సహాయంతో ఏర్పడే 1.2(ఎంపీఐ) యూనిట్ల పీడనంతో, డబ్బాలో నుంచి  ఇరువైపుల ఉన్న ఆరు నాజిల్స్‌తో పంటపై రసాయన మందు పిచికారీ అవుతుంది. 

రెండు గంటల్లో ఎకరాకు పిచికారీ..

నిమిషానికి నాలుగు లీటర్ల మందును 2 గంటల్లోపే ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవచ్చు. నాజిల్స్‌ ద్వారా తుంపర్ల రూపంలో  పడడంతో మొక్క మొత్తాన్ని మందుతో తడుస్తుంది. దీంతో చీడపురుగులు, తెగుళ్ల నివారణపై బాగా ప్రభావాన్ని చూపిస్తుంది.  ఇదివరకే ఉన్న పిచికారీ యంత్రంతో మొక్కలపై సరైన మోతాదులో మందు పడక పోవడంతో తెగుళ్లు, చీడపీడల బెడద తగ్గేదికాదు. ఈ యంత్రంతో పూర్తిగా  నివారించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ముఖ్యంగా కంది, సోయాబీన్‌, పెసర, మినుము, అల్లం, పసుపు, కూరగాయలు తదితర పంటలకు ఆశించే తెగుళ్లు, చీడపీడలను నివారించాడానికి బాగా ఉపయోగపడుతుంది. 

తయారీ ఖర్చు రూ.9వేలు..

  ఈ పిచికారీ యంత్రాన్ని తయారు చేసేందుకు రూ.9 వేలు ఖర్చు అవుతుంది. శ్రమ ఎక్కువ అవసరం ఉండదు. బరువు మోయకుండా సులువుగా కదిలించుకుంటూ వెళ్తే, తనంతట అదే పంటలపై మందు పిచికారీ జరుగడంతో రైతులకు సౌకర్యంగా ఉంటుంది.

 రైతులకు ఎంతో మేలు..

కొత్తగా రూపొందించిన పిచికారీ యంత్రంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇదివరకు ఉన్న పిచికారీ యంత్రం(స్ప్రేయర్‌)తో ఎక్కవ శ్రమతో పాటు ఇద్దరూ, ముగ్గురు కూలీలు అవసరం ఉండేది. వ్యయం ప్రయాస కూడా ఎక్కువగా ఉండేది. కొత్తగా రూపొందించిన  పిచికారీ యంత్రాన్ని ఒక్కరే పొలంలో కదిలించుకుంటూ వెళ్తే, గేర్‌ సహాయంతో ఏర్పడే పీడనంతో మందు పంటపై పిచికారీ చేసుకోవచ్చు. పెట్రోల్‌, బ్యాటరీ లేకుండా నడుస్తుండడంతో డబ్బులు ఆదా చేస్తూ, తక్కువ శ్రమతో ఎక్కువ ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు. ఈ యంత్రంతో మందు తుంపర్లుగా పడడంతో తెగుళ్లు, చీడపీడలను పూర్తిగా నివారించవచ్చు. 

-విజయ్‌కుమార్‌, ప్రధాన శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ జయశంకర్‌ 

వ్యవసాయ పరిశోధన కేంద్రం, బసంతపూర్‌


logo