గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Oct 02, 2020 , 00:57:43

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

దుబ్బాక : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఎంతటివారికైనా చర్యలు తప్పవని దుబ్బాక ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య అన్నారు. గురువారం దుబ్బాక తహసీల్దార్‌ కార్యాలయంలో నోడల్‌ అధికారులు, పోలీసులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో రిటర్నింగ్‌ అధికారి మాట్లాడారు. తెలంగాణలో దుబ్బాక శాసనసభ స్థానానికి మాత్రమే ఉప ఎన్నిక జరుగుతోందన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అన్ని పార్టీల నాయకులు సహకరించాలన్నారు. అనుమతి లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. మాస్క్‌, శానిటైజర్లను తప్పక వాడాలన్నారు. గ్రామాల్లో ప్రచారం చేసేందుకు గుంపులుగా కాకుండా ఐదుగురి కంటే ఎక్కువ ఉండొద్దన్నారు. అభ్యర్థులపై వ్యక్తిగత దూషణలు కానీ అసభ్యకర పోస్టులను సోషల్‌ మీడియాలో పెడితే.. బాధ్యులపై కేసు నమోదవుతుందని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనల అమలుపై రెండు రకాల టీంలు ఉన్నాయన్నారు. ఒకటి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ), మరొకటి ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు ఉంటాయన్నారు. ప్రతి మండలానికి రెండు టీంల చొప్పున మొత్తం 14 టీంలు ఉంటాయన్నారు. అభ్యర్థులు రోజు వారిగా ఖర్చుల వివరాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు.

వృద్ధులకు, కొవిడ్‌ వ్యాధిగ్రస్తులకు పోస్టల్‌ బ్యాలెట్‌..

ఉద్యోగులు, ఎన్నికల సిబ్బందితో పాటు వృద్ధులు, కరోనా బాధితులు, అనారోగ్యంతో మంచాన పడ్డవారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య తెలిపారు. నవంబరు 3న  దుబ్బాక శాసనసభ స్థానానికి పోలింగ్‌ జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.  


logo