బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Oct 01, 2020 , 00:06:20

దుబ్బాకలో... గులాబీ జోష్‌

దుబ్బాకలో... గులాబీ జోష్‌

  • ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌
  • మంత్రి హరీశ్‌రావు గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు
  • 36 గ్రామాలు, మున్సిపాలిటీలో మంత్రి ప్రచారం పూర్తి 
  • ఆయా మండలాల్లో పార్టీ ఇన్‌చార్జిల ప్రచారం
  • గ్రామాల్లో ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తున్నారు. కాగా, ఆయా గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన గులాబీ శ్రేణులకు ప్రజలు బోనాలు, మంగళహారతులు, జలపందిరిలు, వివిధ రూపాల్లో ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దుబ్బాక నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో చేసిన పనులు, రాబోయే మూడేండ్లలో చేయబోయే పనులు ప్రజలకు విడమరిచి చెబుతున్నారు. ఉదయం నుంచి ప్రారంభమవుతున్న పర్యటనలు రాత్రి వరకు కొనసాగుతున్నాయి. 

మంత్రి నేతృత్వంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్‌ చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు వారికి కేటాయించిన మండల గ్రామాల్లో విస్త్రృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించడంతో పాటు గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. విద్యార్థి విభాగం, యువత నాయకులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రచారం చేపడుతున్నారు. ఇక బీజేపీ నాయకులు ఆయా గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు చేసుకుంటూ వెళ్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ప్రచారం ఇంకా షురూ కాలేదు. కాగా, బీజేపీ, కాంగ్రెస్‌, టీజేఎస్‌ పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిపోతున్నారు. మొత్తంగా దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది.

మంత్రి హరీశ్‌రావు పర్యటనలు..

దుబ్బాక ఉప ఎన్నికల ఇన్‌చార్జి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పక్కా వ్యూహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డితో కలిసి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను ఇంటింటికీ తీసుకెళ్లేలా కార్యకర్తలను సన్నద్ధం చేశారు. కాగా, పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్‌కే తమ మద్దతు అంటూ ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మున్సిపాలిటీతో పాటు దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్‌, రాయపోల్‌లతోపాటు మెదక్‌ జిల్లాలోని చేగుంట, నార్సింగ్‌ మండలాలున్నాయి.

ఈ వారం పది రోజుల్లోనే మంత్రి హరీశ్‌రావు 36 గ్రామాలు దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో పర్యటించారు. దుబ్బాక మున్సిపాలిటీ, విలీన గ్రామాలు, దుబ్బాక మండలంలో ఎనిమిది గ్రామాలు, మిరుదొడ్డి మండలంలో ఎనిమిది, దౌల్తాబాద్‌ మండలంలో ఎనిమిది, రాయపోల్‌లో ఏడు, తొగుట, చేగుంట మండల కేంద్రాలతో పాటు  నార్సింగ్‌లోని మూడు గ్రామాల్లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆయా గ్రామాల్లో మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. పైగా సిద్దిపేట, దుబ్బాక రెండు నియోజకవర్గాలు పక్కపక్కనే ఉండడంతో దుబ్బాక నియోజకవర్గంతో మంత్రికి ఆత్మీయ అనుబంధం ఉంది. గతంలో దుబ్బాక మండలంలోని 11 గ్రామాలు ఇదివరకు సిద్దిపేట నియోజకవర్గంలో ఉండేవి. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఆ 11 గ్రామాలు దుబ్బాక నియోజకవర్గంలో కలిశాయి. సిద్దిపేట, దుబ్బాక రెండు కండ్లు అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. 

పోటీకి సిద్ధ్దమవుతున్న కాంగ్రెస్‌, బీజేపీలు.

దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో దుబ్బాక రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ తదితర పార్టీల నాయకులు సమాలోచనలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో ఉన్న కొద్దిపాటి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామాలు చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఆ నాయకులను కాపాడుకోవడంతో పాటుగా పార్టీ శ్రేణులను సమన్వయం చేయడానికి మండలానికి ఒక మాజీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం నియమించనున్నట్లు సమాచారం. వీరు కాకుం డా రెండు గ్రామాలకు ఒక రాష్ట్రస్థాయి నాయకుడికి బాధ్యత అప్పగిస్తున్నట్లు తెలిసింది. ఇక అభ్యర్థి విషయంలో ఆ పార్టీలో స్పష్టత లేదు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా టీజేఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీ కేటాయించింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడానికి నలుగురైదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించింది. గత ఎన్నికల్లో పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు రఘునందన్‌రావు పోటీ చేయనున్నారు. ఆయనకే టిక్కెట్‌ రానున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. కాగా, కొద్ది రోజులుగా ఆయన ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఎవరికి వారే తమ ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.

విస్తృతంగా ప్రచారం..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు దుబ్బాక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అన్ని మండలాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్‌చార్జిలుగా నియమించడంతో ఆయా మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి గ్రామస్థాయిలో విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. మిరుదొడ్డిలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, బక్కి వెంకటయ్యలు, దౌల్తాబాద్‌ మండలంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులు మాదాస్‌ శ్రీనివాస్‌, రాయపోల్‌లో జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, తొగుటలో అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, దుబ్బాక మండలంలో దేవేందర్‌రెడ్డి, నార్సింగ్‌లో నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, చేగుంట, నార్సింగ్‌లో నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆయా మండలాల్లో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. దుబ్బాక మున్సిపాలిటీలో సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు ఆయా వార్డులో ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో గడప గడపకూ వెళ్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు.

టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్శితులై బీజేపీ, కాంగ్రెస్‌, టీజేఎస్‌ పార్టీల నుంచి పెద్దఎత్తున ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి చూడండి.., దుబ్బాక అభివృద్ధికి కలిసి రావాలని మంత్రి పిలుపునిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఇటీవల టీజేఎస్‌ దుబ్బాక నియోజకవర్గ కన్వీనర్‌ చిందం రాజ్‌కుమార్‌ తన అనుచరులతో పాటు దౌల్తాబాద్‌ మండలంలోని  కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన కార్యకర్తలు సుమారు 2 వందల మందికి పైగా టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితో పాటు లచ్చపేటకు చెందిన 10వ వార్డు కౌన్సిలర్‌ కూరపాటి బంగారయ్యతో పాటు ఆయన అనుచరులు సుమారు వంద మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా అన్ని మండలాల్లో నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి.logo