గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Sep 29, 2020 , 02:12:19

సంగారెడ్డి జిల్లాలో.. 12,072 ఎకరాల్లో పంట నష్టం

సంగారెడ్డి జిల్లాలో.. 12,072 ఎకరాల్లో పంట నష్టం

  • n 10,669 మంది రైతుల పొలాల్లో చేరిన వర్షం నీరు
  • n 207 గ్రామాల్లో పంటలకు  వాటిల్లిన నష్టం
  • n పంటలను పరిశీలించిన  జిల్లా వ్యవసాయధికారి

సంగారెడ్డి : నాలుగు రోజులుగా కురిసిన వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా లో 12,072 ఎకరాల్లో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. వ్యవసాయం ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతాంగానికి చెందిన 10,669 మంది రైతుల పొలాల్లో వర్షం నీరు చేరింది. అత్యధికంగా 10,261 ఎకరాల్లో సోయాబీన్‌ పంట నష్టం వాటిల్లిన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో 207 గ్రామాలు వర్షం దాటికి నష్టం భారీన పడ్డాయి. ఆయా గ్రామాల్లో వ్యవసాయశాఖ జిల్లా అధికారి నర్సింహారావు పర్యటించి నష్టపోయిన పంటల వివరాలు సేకరించారు. నష్టం వాటిల్లిన పంటల వివరాల నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు తెలిపారు. కాగా, ఈ నెల 18న పడిన వర్షానికి జిల్లాలో 7006.77 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 124 గ్రామాల్లో 4412 మంది రైతులు వేసిన పంటలకు నష్టం కలిగింది. అత్యధికంగా సోయాబీన్‌ 3601.3 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. అలాగే, ఈ నెల 24 నుంచి కురిసిన వర్షాలకు పంటలకు నష్టం జరిగిందని అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో పడిన వర్షాలకు పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రెండు సార్లు పడిన వర్షాలకు జిల్లాలో మొత్తం 19,078.3 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అలాగే పంటలు సాగుచేస్తున్న రైతులు 15,081 మంది నష్టపోయినట్లు అధికారులు వివరించారు. 331 గ్రామాల్లో వర్షాలకు పంటలు నష్టపోయారని, నష్టం అంచనాలను తయారు చేసేందుకు అధికారులు ప్రతి రైతు వివరాలు సేకరిస్తున్నారు.   logo