గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Sep 29, 2020 , 02:12:21

ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన కరోనా-19 ప్రభావం

ఉమ్మడి జిల్లాల్లో  తగ్గిన కరోనా-19 ప్రభావం

  • n అవగాహనతో అప్రమత్తంగా ముందుకు సాగుతున్న జనం
  • n పుంజుకున్న నిర్మాణ రంగం
  • n ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ప్రజలు
  • n నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ పనులు
  • n సేవలందిస్తున్న ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు
  • n జన సందడిగా ఆలయాలు.. కిటకిటలాడుతున్న దుకాణాలు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జనం మళ్లీ బిజీ అయ్యారు. కరోనాతో ఐదు నెలల పాటు ఇండ్లకు పరిమితమైన వారు ఇప్పుడు తిరిగి వీధుల్లోకి వస్తున్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఉద్యోగులు, కార్మికులు డ్యూటీలు చేసుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల్లో సందడి నెలకొంటున్నది. జోరుగా కురుస్తున్న వర్షాలతో నిండిన ప్రాజెక్టులు, జలాశయాలు సందర్శకుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో భక్తులు క్యూలు కట్టి పూజలు చేస్తున్నారు. స్వరాష్ర్టాలకు వెళ్లిన కార్మికులు తిరిగి రావడంతో నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఉపాధ్యాయులు స్కూళ్లకు వస్తున్నారు. మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ ఎప్పటిలాగే కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. అయితే ఎవరికి వారు కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌ ధరించి వీధుల్లోకి వస్తున్నారు. వ్యాపార సంస్థల ముందు శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఈ క్రమంలో సమాజంలో కరోనా ముందటి సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నారు. ఎవరికి వారు తమ పనుల్లో బిజీ అవుతూ కరోనా గురించి మర్చిపోతున్నారు.

పుంజుకుంటున్న నిర్మాణ రంగం

నిర్మాణ రంగం మళ్లీ పుంజుకుంటున్నది. కరోనాతో వేలాది మంది కార్మికులు తమ స్వరాష్ర్టాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే కరోనా ప్రభావం తగ్గిపోతున్న క్రమంలో కార్మికులు ఒక్కొక్కరుగా తిరిగి ఇక్కడకు చేరుకుంటున్నారు. మూడు నెలలుగా పూర్తిగా నిలిచిపోయిన నిర్మాణ పనులు మళ్లీ పుంజుకున్నాయి. కార్మికులు తిరిగి పనుల్లో చేరుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఇతర రాష్ర్టాలకు చెందిన వారు దాదాపు 50 వేల మంది వరకు పనిచేస్తుంటారు. అందులో తమ రాష్ర్టాలకు వెళ్లిన వారంతా దాదాపుగా తిరిగి వస్తున్నట్లు నిర్మాణ రంగ ప్రతినిధులు చెబుతున్నారు. కార్మికుల కొరత ఉన్న సమయంలో కొంత కూలీ ఎక్కువ చెల్లించుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు తిరిగి అందరూ వచ్చారని సాధారణ పరిస్థితి నెలకొన్నాయని చెబుతున్నారు. ప్రధానంగా అమీన్‌పూర్‌, పటాన్‌చెరు, రామచంద్రాపురం, కొల్లూరు, సంగారెడ్డి, తూప్రాన్‌, గజ్వేల్‌, మెదక్‌, సిద్దిపేట ప్రాంతాల్లో పెద్దఎత్తున నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కార్మికులు రావడంతో ఇక వేగంగా నిర్మాణాలు పూర్తి కానున్నాయి. కార్మికులు కూడా ఎలాంటి భయం లేకుండా ఎప్పటిలాగే రోజువారి కూలీ పనులకు వస్తున్నారు.

విధిగా విధుల్లోకి ఉద్యోగులు, కార్మికులు..

అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఇక విధిగా డ్యూటీలకు హాజరవుతున్నారు. ఉపాధ్యాయులు కూడా స్కూళ్లకు వస్తున్నారు. అన్ని శాఖల్లో పాలన యథావిధిగా కొనసాగుతున్నది. ప్రజలకు అధికారులు ఎప్పటిలాగే తమ సేవలు అందిస్తున్నారు. పటాన్‌చెరు, సదాశివపేట, హత్నూర, కాళ్లకల్‌, చిన్నశంకరంపేట, ములుగు, జిన్నారం ప్రాంతాల్లో వందల సంఖ్యలో పరిశ్రమలున్నాయి. కరోనాతో కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. 

తిరిగి అందరూ రావడంతో ఆయా పరిశ్రమల్లో తిరిగి ఎప్పటిలాగే ప్రొడక్షన్‌ కొనసాగుతున్నది. కార్మికులు తమ డ్యూటీలు చేసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో సహా ఆన్ని శాఖల జిల్లా అధికారులు మొదలుకుని కిందిస్థాయి అటెండర్‌ వరకు రెగ్యులర్‌గా విధులకు హాజరు అవుతున్నారు.

పర్యటక ప్రాంతాలుగా జలాశయాలు..

జోరుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జిల్లాలో జలాశయాలు నీళ్లతో కళకళలాడుతున్నాయి. నీళ్లతో నిండిన జలాశయాలను చూడడానికి పెద్దఎత్తున సందర్శకులు తరలివెళ్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టు, మంజీరా రిజర్వాయర్‌, సిద్దిపేట జిల్లాలో రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, మెదక్‌ జిల్లాలో పోచారం, వనదుర్గ రిజర్వాయర్ల వద్ద సందడి నెలకొన్నది. రోజువారీగా వేలాది మంది ప్రాజెక్టులు, రిజర్వాయర్లను చూడడానికి వస్తున్నారు. ఐదారు నెలలుగా ఇంటికి పరిమితమైన వారు ఒక్కసారిగా ఆహ్లాదకర వాతావరణానికి రావడంతో సంతోషపడిపోతున్నారు. ఇదిలాఉండగా ఆలయాలకు కూడా భక్తులు వస్తున్నారు. క్యూలు కట్టి దేవుళ్లను దర్శించుకుంటున్నారు.

వ్యాపార, వాణిజ్య సంస్థల్లో సందడి

కరోనా ప్రభావం తగ్గడంతో వ్యాపార, వాణిజ్య సంస్థల్లో సందడి నెలకొంటున్నది. 6 నెలలుగా ఇండ్లకే పరిమితమైన అన్నివర్గాల ప్రజలు మార్కెట్లోకి వస్తున్నారు. పిల్లాపాపలతో వచ్చి ఇష్టమైన సామాన్లు తీసుకువెళ్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే అన్ని రకాల తమ పనులు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, గజ్వేల్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు, లింగంపల్లి పట్టణాల్లో షాపింగ్‌ మాల్స్‌ కిటకిటలాడుతున్నాయి. అన్నిరకాల వస్తువుల కొనుగోలు గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థల వద్ద శానిటైజర్‌ అందుబాటులో ఉంచుతున్నారు. మాస్క్‌ ఉన్నవారిని దుకాణాల్లోకి అనుమతిస్తున్నారు. పలు షాపింగ్‌ మాల్స్‌ల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ కూడా చేస్తున్నారు. వ్యాపారులు తగు జాగ్రత్తలు తీసుకుంటుండగా ప్రజలు అంతే జాగ్రత్తగా తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.

ప్రయాణికుల సేవలో ఆర్టీసీ బస్సులు

కరోనాతో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు తిరిగి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. చిన్నపాటి పల్లెలకు మినహా నియోజకవర్గ, మండల, జిల్లా కేంద్రాలకు బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని పటాన్‌చెరు, లింగంపల్లి, రామచంద్రాపురం, జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ల నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారు. బస్సుల్లో శానిటైజర్‌ అందుబాటులో ఉంచుతున్నారు. మాస్క్‌లు ధరించాలని కండక్టర్లు ప్రయాణికులకు సూచిస్తున్నారు. బస్సులతో పాటు గ్రామీణ ప్రాంతాలకు ఎప్పటిలాగే ఆటోలు తిరుగుతున్నాయి. కరోనా ముందులాగే గ్రామాల్లో పోటీలు పడి ఆటోడ్రైవర్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. 

ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి

కరోనాపై నిబంధనలు పాటిస్తూ రోజువారి కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సూచనలతో వేడినీటిని తాగడం, వేడినీళ్లతో స్నానం చేయాలి. అలాగే, ఆహారపు అలవాట్లను పాటిస్తూ మాస్క్‌లు ధరించడంతో కరోనా వైరస్‌ దరికి చేరదు. 

- వెంకటేశం, విశ్రాంతి మండల విద్యాధికారి, సంగారెడ్డి


logo