మంగళవారం 27 అక్టోబర్ 2020
Sangareddy - Sep 28, 2020 , 01:43:53

సర్కారు సారె... ఆడబిడ్డ మురిసె

సర్కారు సారె... ఆడబిడ్డ మురిసె

ఆడబిడ్డలకు పంచడానికి తీరొక్క రకం బతుకమ్మ చీరెలు జిల్లాకు చేరుకున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలు 11.15 లక్షల మంది ఉండగా.. వారందరికీ 2,046 రేషన్‌ దుకాణాల ద్వారా చీరెలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే పలుచోట్ల చీరెల పంపిణీ ప్రారంభమైంది. ఈసారి సిరిసిల్ల చేనేత కార్మికులతో 225 ఆకర్షణీయమైన రంగుల్లో ఈ చీరెలను ప్రభుత్వం తయారు చేయించింది. ఏటా బతుకమ్మ పండుగకు చీరెలు అందిస్తున్న సీఎం కేసీఆర్‌ను ఆడబిడ్డలు ఆత్మీయంగా తమ తోడబుట్టిన అన్నయ్యగా భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా పుట్టింటి సారె మాదిరిగా ఆడబిడ్డలకు చీరెలను అందిస్తున్నది. 

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఏటా మాదిరిగానే మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని 18 ఏండ్ల వయసు నిండిన ప్రతి మహిళకు ప్రభుత్వం చీరెలు పంపిణీ చేస్తున్నది. ఈసారి ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 11.15 లక్షల మంది మహిళలకు చీరెలు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని సిరిసిల్ల చేనేత కార్మికులు దాదాపు 225 ఆకర్షణీయమైన రంగుల్లో ఈ చీరెలను తయారు చేశారు. గ్రామాల్లోని రేషన్‌ దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న చీరెలను గోదాములతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రపరిచారు. పలుచోట్ల పంపిణీ ప్రారంభమైంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 2,046 రేషన్‌ దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయడానికి పౌరసరఫరాలశాఖ సన్నాహాలు చేస్తున్నది. ఏటా బతుకమ్మ పండుగకు చీరెలు అందిస్తున్న సీఎం కేసీఆర్‌ను ఆడబిడ్డలు ఆత్మీయంగా తమ తోడబుట్టిన అన్నయ్యగా భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు సారెగా చీరెలను అందిస్తున్నది. 

అక్టోబర్‌ మొదటి వారం నుంచి..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో అక్టోబర్‌ మొదటి వారం నుంచి బతుకమ్మ చీరెలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ, కొన్నిచోట్ల ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ముఖ్యమైన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేల సూచన మేరకు అక్కడ కార్యక్రమాల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 4.71 లక్షల మంది, సిద్దిపేట జిల్లాలో 3.69 లక్షల మంది, మెదక్‌ జిల్లాలో 2.74 లక్షల మందికి ప్రభుత్వం చీరెలు అందించనుంది.logo