బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Sep 27, 2020 , 02:14:24

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

  • నిండుకుండలను తలపిస్తున్న చెరువులు
  • సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు

రామాయంపేట : రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని పర్వతాపూర్‌, కాట్రియాల, దంతెపల్లి, తొని గండ్ల, లక్ష్మాపూర్‌, కోనాపూర్‌ తదితర అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. వర్షానికి రామాయంపేట మున్సిపల్‌  పరిధిలోని గొల్పర్తి, కోమటిపల్లి గ్రామాలు, పట్టణంలోని మంజీరా, రెడ్డి, బీసీ కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి చెరువులను తలపించాయి. రోడ్డు పక్కనే ఉన్న మల్లె చెరువు నిండుకుండలా నిండింది. మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, కమిషనర్‌ శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు చంద్రపు శోభాకొండల్‌రెడ్డి, దేమె యాదగిరి, గజవాడ నాగరాజులతో బాటు మున్సిపల్‌ సిబ్బంది  అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.  రామాయంపేటలోని పాండుచెర్వు, సర్వాయికుంట, హనుమచెర్వు, కొచ్చెర్వులలోకి నీళ్లు చేరి అలుగులు  పారుతున్నాయి. మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌ తెల్లవారుజామునుంచే కాలనీలు తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  రైతులు చెరువుల వద్దకు వెళ్లి సంతోషం వ్యక్తం చేస్తున్నారు .  

నర్సాపూర్‌ రూరల్‌లో..

నర్సాపూర్‌ రూరల్‌ : పట్టణంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో నిరంతరంగా భారీ వర్షం కురియడంతో గ్రామంలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. నర్సాపూర్‌ పట్టణంలోని రాయారావు చెరువు పూర్తిగా ఎండిపోతున్న తరుణంలో భారీ వర్షం కురియడంతో నిండుకుండలా మారింది. చెరువును చూసేందుకు పర్యాటకులు,  పట్టణ వాసులు పోటెత్తారు. కాగజ్‌మద్దూర్‌ గ్రామంలో చౌదరి చెరువు పూర్తిగా నిండి అలుగు పారింది. పెద్దచింతకుంట గ్రామంలోని రామన్న చెరువులోకి వరద పరుగులెత్తింది. బ్రాహ్మణ పల్లి గ్రామంలోని కండ్ల చెరువులోకి వర్షపు నీరు చేరడంతో రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వీక్షించారు. అచ్చంపేట గ్రామంలో చెరువు అలుగు పారడంతో గ్రామస్తులు, రైతన్నలు సంతోషం వ్యక్తం చేశారు.   

నిజాంపేటలో

నిజాంపేట : మండలవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండి మత్తడి దూకుతున్నాయి. నిజాంపేట మండలంలో 44.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నిజాంపేట మల్కచెరువుతో పాటు కుంటలు నిండి అలుగు పారుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వెల్దుర్తిలో..

వెల్దుర్తి : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని అన్ని చెరువులు, కుంటలు అలుగు పారుతుండగా, హలీ ్దప్రాజెక్టు, హల్దీ వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. హల్దీ ప్రాజెక్టుపై ఉన్న ఎనిమిది చెక్‌డ్యాంలతో పాటు  ప్రాజెక్టు పొంగి పొర్లుతుండడంతో హల్దీ వాగు పూర్తిస్థాయిలో ప్రవహిస్తున్నది. వెల్దుర్తికి చెందిన కోదండ సంజీవగౌడ్‌   పెంకుటిల్లు కూలింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు 6.7 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు ఆర్‌ఐ ధన్‌సింగ్‌ తెలిపారు.

మండలంలో 45.3 సెం.మీ. వర్షపాతం..

చిలిపిచెడ్‌ :  వర్షాలతో పాటు నక్క వాగు నుంచి వస్తున్న భారీ వరదకు చిలిపిచెడ్‌ మండలంలోని చాముండేశరి ఆలయం సమీపంలోని మంజీరా నది నిండుకుండలా ప్రవహిస్తున్నది. మండలంలో  రెండు రోజుల నుంచి 45.3 సెం.మీ   భారీ వర్షంతో గ్రామాల్లో కుంటలు,చెరువులు 80 శాతం నిండాయి.  మంజీరా నది, చెరువు, కుంటలలో నీరు రావడంతో సమీప బోరుబావుల నుంచి   కూడా నీరు ఎక్కువగా వస్తున్నది. ఈ సంవత్సరం  బోరుబావులనుంచి బాగా నీరు వచ్చే అవకాశాలు ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

వర్షానికి కూలిన ఇల్లు..

నర్సాపూర్‌ రూరల్‌ :  తుజాల్‌పూర్‌ గ్రామంలో శనివారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి  బోనాల నాగమణికి చెందిన నివాస గృహం కూలిపోయింది. ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని సర్పంచ్‌ గాలి శ్రీరాములు విజ్ఞప్తి చేశారు.


logo